ఇండియాను హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అది సాధ్యమేనా..? ప్రజలు ఆమోదిస్తారా..? ఇవన్నీ చర్చల్లో ఉండే ప్రశ్నలు… జవాబులు కష్టం… కానీ నేపాల్‌లో మాత్రం ఈ దిశలో ప్రజలే ఉద్యమిస్తున్నారు… ఇది ఆసక్తికరమైన పరిణామం…
కానీ ఇండియన్ మీడియా ఈ వార్తలకు ఏమీ ప్రయారిటీ ఇవ్వడం లేదు… మొన్న ఖాట్మండులో భారీ ప్రదర్శన జరిగింది… వేలాది మంది మార్చ్ నిర్వహించారు… ఒక దశలో ఈ ఆందోళనలు ప్రధాని కార్యాలయ ముట్టడి ప్రయత్నాలతో అదుపు తప్పే పరిస్థితి కనిపించడంతో పోలీసులు అడ్డుకున్నారు,
టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు… కొన్నాళ్ల నుంచే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేతృత్వంలో సాగే ఈ ఆందోళనకు ప్రస్తుతం ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది… నిజానికి ఇది ఓ ఇంట్రస్టింగ్ ఉద్యమం.,.
Ads
దశాబ్దం క్రితం పరిస్థితి ఏమిటి..? పలు మావోయిస్టు గ్రూపుల నక్సలైట్లు బలపడి ఉన్నారు… వాళ్లు ఏది చెబితే అదే… తరువాత ప్రజాస్వామిక మార్గంలోకి వచ్చారు ఆ చండప్రచండ నక్సలైట్లు… ప్రజలు అధికారాన్ని ఇచ్చారు… నక్సలైట్లు సాగించిన అంతర్యుద్దంలో దాదాపు 15 వేల మంది దాకా మరణించినట్టు ఓ అంచనా…
తరువాత ఓ శాంతి ఒప్పందంతో నేపాల్ రాచరిక వ్యవస్థను రద్దు చేశారు… 2007 వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, ఫెడరల్ సెక్యులర్ స్టేట్‌గా మార్చేసింది… (లౌకిక గణతంత్ర రాజ్యం)… అప్పటివరకూ ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం నేపాల్… ఆ మార్పుతో హిందూ దేశమనే గుర్తింపు పోయింది…
ఇప్పుడు మళ్లీ మాకు ఆ పాత రాచరిక వ్యవస్థే కావాలనీ, అందులోనే స్థిరత్వం ఉందనీ, అంతేగాకుండా మళ్లీ హిందూ రాజ్యంగా మారిపోదామనే డిమాండ్ ప్రబలంగా వినిపిస్తోంది… ప్రజలు వీథుల్లోకి వస్తున్నారు… చైనాకు అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ విధానాలు అంతిమంగా దేశానికే చేటు అనే భావన బలపడుతోంది…
ఇదంతా మావోయిస్టులు, కమ్యూనిస్టుల పాలన వైఫల్యాలకు ఓ నిదర్శనం… ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, నిరుద్యోగిత పెరిగిపోయింది… ఈ నేతల అవినీతి, అక్రమాలు, అసమర్థ పాలనకన్నా ఆ పాత రోజులకే వెళ్లిపోదాం అనేది ప్రజల కోరిక…
రాచరికాలు పోవాలి, ప్రజల ప్రభుత్వాలు రావాలి అని దాదాపు ప్రతి దేశంలోని ప్రజలు కోరుకుంటారు… నేపాల్ ఫుల్లు రివర్స్ ఇప్పుడు… మార్చుకున్న రాజ్యాంగం మేరకు ఆర్టికల్ 11 మతస్వేచ్ఛను ఇస్తోంది… అన్ని మతాలూ సమానమే అంటోంది… ఎవరి మతాన్ని వారు అనుసరించే స్వేచ్ఛను ఆర్టికల్ 19 ఇస్తోంది… అది అక్కర్లేదని ప్రజానీకం అంటోంది…
హిందూదేశంగా నేపాల్‌కు సుదీర్ఘ చరిత్రే ఉంది… పృథ్వి నారాయణ షా రాజుగా ఉన్న 1768 నుంచి… అంటే దాదాపు 239 సంవత్సరాలు ఆ దేశం హిందూ దేశమే… 2007లో సెక్యులర్ రాజ్యం పేరిట కొత్త రాజ్యాంగ రచన జరిగి, 2015 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది…
నేపాల్ పరిణామాల్ని ఇండియా కూడా జాగ్రత్తగా గమనిస్తోంది… నేపాల్‌లో తిష్ఠ వేసి ఇండియాకు చైనా పెద్ద థ్రెట్‌గా మారుతోంది… అదెంత వరకూ వెళ్లిందంటే ఇండియన్ ఆర్మీలో నేపాలీలు చేరొద్దని కమ్యూనిస్టు ప్రభుత్వ నేతలు పిలుపు ఇచ్చేదాకా చేరింది… చైనా కోసమే… క్రమేపీ చైనా ధోరణి, నేపాల్ ప్రభుత్వ సహకారం ఇండియా భద్రతకు ప్రమాదం… ఒకప్పుడు నేపాల్‌ను ఇండియాకు ఓ అనుబంధ రాష్ట్రంగా పరిగణించేవాళ్లు… కానీ రెండు దేశాల నడుమ ఇష్యూస్ పెరుగుతున్నాయి… క్రమేపీ ఈ ప్రజాందోళనలు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే…
Share this Article