పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట – part-2… నేపాల్ గూర్ఖాలు వాగ్నర్ గ్రూపులో చేరుతున్నారు! అవును, మీరు చదువుతున్నది నిజమే! రష్యాకి రెగ్యులర్ ఆర్మీలో సైనికుల కొరత ఉన్నది అన్నది నిజం! ఉన్నవాళ్లకి సరి అయిన శిక్షణ లేదు. అసలు రష్యన్ ఆర్మీలో ఎంతమంది సైనికులు ఉన్నారో బయటి ప్రపంచానికి తెలియదు! ప్రస్తుతం డిఫెన్స్ రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్న గణాంకాలు కేవలం కాకి లెక్కలు మాత్రమే! నిజానికి రష్యా ప్రపంచంలోనే రెండవ సైనిక శక్తి అనే రాంక్ ని సవరించి 4 వ రాంక్, అంటే భారత్ తరువాత ఇవ్వాల్సి ఉంటుంది.
*******************
వాస్తవం ఏమిటో… పేరు చెప్పడానికి ఇష్టపడని 82 ఏళ్ళ మాజీ KGB గూడచారి ఒకరు (గత 20 ఏళ్లుగా ప్రవాసంలో ఉంటున్నారు ) వివరించినవి మీ ముందు ఉంచుతున్నాను. రష్యన్ సైన్యం అది ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ లు ఆయుధాల పరంగా మరీ అంత నాశిరకం కావు, అలా అని అత్యాధునికం కూడా కావు. వెస్ట్రన్ దేశాల కంటే 20 ఏళ్ళు వెనకబడి ఉంది.
Ads
ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ లు అత్యుత్తమ శిక్షణ పొందినవి కావు. అన్ని విభాగాల అధిపతులు అవినీతిపరులు! రష్యా దగ్గర 12,000 యుద్ధ టాంకులు ఉన్నాయి రిజర్వ్ లో. ఇవి దాదాపుగా తుప్పు పట్టే స్థితిలో ఉన్నాయి. 12,000 యుద్ధ టాంకుల నిర్వహణ కోసం అంటూ వేల కోట్ల రూబుల్స్ ఖర్చు రాస్తున్నారు ప్రతీ సంవత్సరం. కానీ ఆ ధనంలో 80% రక్షణ మంత్రి షోయ్గు అతని జెనరల్స్ జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఉక్రైన్ యుద్ధంలో T 80 టాంక్ లున్నాయి అంటూ పుతిన్ కి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు రక్షణ మంత్రి షోయ్గు అతని జెనరల్స్. వాస్తవానికి రిజర్వ్ లో ఉన్నవి తుప్పు పట్టిన స్థితిలో అలానే ఉన్నాయి. వాటిని అప్గ్రేడ్ చేస్తే పని చేస్తాయి. కానీ అలా చేయలేదు. ఉక్రెయిన్ లో రష్యా కోల్పోయిన యుద్ధ టాంకులు 500 లకి పైగానే. వాటి స్థానంలో కొత్తవి పంపించకుండా సోవియట్ కాలం నాటివి పంపిస్తున్నాడు షోయ్గు.
ఇప్పటి వరకు రష్యా ప్రయోగించిన మిసైల్స్ సంఖ్య 20 వేలకి పైనే. సగటున రోజుకి 100 మిసైల్స్ ని ప్రయోగించింది రష్యా! వీటిలో క్రూయిజ్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్, హైపర్ సానిక్ మిసైళ్ళు ఉన్నాయి. వీటి ప్రాబబులిటీ 70% మాత్రమే. అంటే ప్రతీ 100 మిసైళ్ళకి 70 మాత్రమే టార్గెట్ ని కొట్టగలిగాయి. మిగతా వాటిలో చాలా వరకు పౌర నివాసాల మీద పడడమో లేదా మధ్యలోనే కూలిపోవడమో జరిగింది.
***************
ఇక రష్యన్ హైపర్ సానిక్ మిస్సైళ్ళని అమెరికన్ పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. హైపర్ సానిక్ అంటే మాక్ 6 (శబ్దవేగానికి 6 రెట్ల వేగం ) తో ప్రయాణించే మిసైల్ ని అడ్డుకోవడం కష్టం. అలాంటిది పెట్రియాట్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది అంటే ఆ మిసైల్స్ మాక్ 3 వేగంతో ప్రయాణించాయి.
మిసైళ్ళకి ఉపయోగించే రామ్ జెట్ ఇంజిన్ల తయారీలో లోపాలు ఉండడంతో అవి మాక్ 6 కి బదులు మాక్ 3 తో ప్రయాణిస్తున్నాయనే సాకుతో ఆ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ సైటిస్టులని జైళ్లలో పెట్టాడు పుతిన్! ఇలాంటి పిచ్చి పనులు పుతిన్ మాత్రమే చేయగలడు. సీనియర్ సైటిస్టులని జైల్లో పెడితే హైపర్ సానిక్ మిస్సైళ్ళ ప్రొడక్షన్ వేగం తగ్గిపోతుంది.
తనకి కొద్దో గొప్పో విజయాలు తెచ్చిపెట్టిన వాజ్ఞర్ గ్రూపు ప్రిగోజిన్ ని హత్య చేశాడు. సరయిన వ్యూహం లేకుండా యుద్ధం ప్రకటించి దాదాపు 30,000 మంది సైనికులని కోల్పోయాడు! కనీసం తన సైనిక ట్రక్కులకి తగినన్ని టైర్లు స్టాక్ పెట్టుకోకుండా చివరి క్షణంలో చైనా నుండి దిగుమతి చేసుకున్నాడు కానీ అవి 300 km లకే చెడిపోయి కదలలేక పొవడంతో కనీసం 2 వేల ట్రక్కులు ఉక్రేయిన్ కి చిక్కాయి ఫుల్ కండిషన్ తో… ఇంకా వాటిలో ఉన్న బులెట్స్,షెల్స్,ఇతర ఆయుధాలతో సహా! అందుకే మరో మూడు నెలలు యుద్దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగింది ఉక్రేయిన్. ఈ లోపు నాటో నుండి సహాయం మొదలయ్యి ఇప్పటి వరకు లొంగకుండా పోరాడుతున్నది ఉక్రేయిన్!
హెలికాఫ్టర్ గన్ షిప్స్ కి సరయిన రక్షణ లేకుండా, అదే సమయంలో పైలట్లకి శిక్షణ లేకుండా నేరుగా యుద్ధంలోకి పంపించి విలువైన పైలట్లని కోల్పోయాడు పుతిన్! ఏ యుద్ధంలో అయినా ఫార్వార్డ్ సైనికులు కనుక ఎదుటి పక్షం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నట్లయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ‘క్లోజ్ ఇన్ ఎయిర్'( Close in Air Support) సపోర్ట్ కోసం అడుగుతాడు ఫార్వార్డ్ కమాండర్!
క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడిగే ముందు సదరు కమాండర్ ఎదుటి పక్షం దగ్గర షార్ట్ రేంజ్ గ్రౌండ్ to ఎయిర్ మిస్సైల్స్ (stinger) స్టింగర్ లు లేవు అని నిర్ధారణ చేసుకొని కమాండ్ కంట్రోల్ కి క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడగాలి! కానీ రష్యన్ ఫార్వార్డ్ కమాండర్లు ఇలాంటి తప్పనిసరి ప్రోటోకాల్ ని పాటించకుండా నేరుగా క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ ఆడుతున్నారు.
పోనీ కమాండ్ కంట్రోల్ లో ఉన్నవాళ్లు అయినా అక్కడ స్టింగర్ మిసైల్స్ ఉన్నాయా లేవా అని అడగాలి. స్టింగర్ మిసైల్స్ ఉంటే Su-25 (Frog Foot, ఇది నాటో Su-25 కి పెట్టిన కోడ్ నేమ్)ని పంపిస్తారు. Su-25 కి ముందు 110 mm హెవీ మిషన్ గన్ ఉంటుంది. అలాగే రెక్కల కింద అన్ గైడెడ్ రాకెట్ లాంచర్స్ ఉంటాయి. జెట్ ఇంజిన్లు ఉండడం వలన వేగంగా వచ్చి గ్రౌండ్ ఫోర్స్ మీద దాడి చేసి అదే వేగంతో వెళ్ళిపోతుంది. స్టింగర్ మిసైల్స్ నుండి తప్పించుకోగలవు!
స్టింగర్ మిసైల్స్ లేకపోతే హెలికాఫ్టర్ గన్ షిప్స్ ని పంపిస్తారు. కానీ క్లోజ్ ఇన్ ఎయిర్ సపోర్ట్ అడిగే ఫార్వార్డ్ కమాండర్ చెప్పడు, కమాండ్ కంట్రోల్ వాళ్ళు అడగరు. ఇలా ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు అడగడం వీళ్ళు పంపించడం జరిగింది. దాంతో ఉక్రేనియన్ సైనికులు స్టింగర్స్ ఉపయోగించి ఒక స్క్వాడ్రన్ Su-25 లని పిట్టలని కాల్చినట్లు కూల్చేశారు.
******************
ఇక రష్యన్ హెలీకాఫ్టర్ పైలట్లు అయితే తన ముందు ఉన్న తమ హెలీకాఫ్టర్ ని స్టింగర్ తో కూల్చేయడం చూసి కూడా దాడి కోసం ముందుకు వెళ్లి చనిపోయారు. మొత్తం రెండు స్క్వాడ్రన్ ల గన్ షిప్స్ కోల్పోయింది రష్యా. Su-25 పైలట్లు కూడా అదే తప్పులు చేసి చనిపోయారు. ఇక ఉక్రేనియన్ ఎయిర్ డిఫెన్స్ S300 అని రష్యాకి తెలుసు. రష్యా దగ్గర కూడా S300 లు ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. S300 రేంజ్ ఎంతో తెలుసు రష్యాకి. కానీ Su-27, Su-30, jet ఫైటర్ పైలట్లు మూర్ఖంగా లోలెవెల్ లో జెట్లని నడిపి S300 కి బలయ్యారు. Su27 జెట్లు 46, Su30 లు 25 దాకా ఉక్రేనియన్ ఎయిర్ S-300 మరియు మిగ్29 ల చేత కూల్చబడ్డాయి.
అసలు ఉక్రేయిన్ లో ఎక్కడెక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వాలి. యుద్ధం మొదలయిన కొత్తల్లో (feb 23 ,2022) దాడి చేయడానికి మొదలు రష్యన్ మిలటరీ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ సేకరించింది. 2022 జూన్ నెల వరకు రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఉక్రేయిన్ గగనతలం మీద ఆధిపత్యం వహించింది. తరువాత కెనడా, అమెరికన్, బ్రిటన్ వ్యూహకర్తలు ఉక్రెయిన్లోకి వచ్చి రష్యన్ ఎయిర్ ఫోర్స్ ని ఎలా బోల్తా కొట్టించాలో ప్లాన్ చేసి దానిని అమలు చేయడం మొదలు పెట్టిన తరువాత రష్యన్ ఫైటర్ జెట్లు వరుసగా కూలిపోవడం జరిగింది! దాదాపుగా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం మరిచిపోయింది రష్యా ఇప్పటి వరకు. పూర్తిగా క్రూయిజ్ మిస్సైళ్ళతో దాడి చేస్తూ వచ్చింది.
*********************
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం మాటేమిటి? ఇప్పటివరకు రెండు S-400 మిసైల్ లాంచర్స్ ని ఉక్రేయిన్ డ్రోన్లు రష్యాలోకి చొరబడి మరీ ధ్వంసం చేశాయి. మొత్తం సిస్టం ని కాదు కేవలం లాంచర్స్ ని మాత్రమే నాశనం చేశాయి! ప్రస్తుతం రష్యా తన భూభాగాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో కాపాడుకోలేని స్థితిలో ఉంది. చాలా చోట్ల సోవియట్ కాలం నాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో నెట్టుకొస్తున్నది రష్యా! డబ్బు కోసం భారత్, చైనా, టర్కీలకి S-400 లని అమ్మింది కానీ తన దేశ రక్షణ కోసం కావాల్సినన్ని తయారుచేయలేదు! అందుకే అమెరికా ఉక్రేయిన్ కి ఇచ్చిన హిమార్స్ రాకెట్ల దాడి నుండి రష్యా ఆయుధ, ఆయిల్ డిపోలని కాపాడుకోలేకపోతున్నది.
*******************
నేపాల్ కి చెందిన గూర్ఖాలని 5 వేల మందిని రిక్రూట్ చేసుకున్నా వాళ్ళకి రష్యన్ భాష నేర్పి ఉక్రేయిన్ పంపడానికి ఇంకో రెండు నెలలు పట్టవచ్చు. ఇప్పటికే మూడు నెలలు అయ్యింది రిక్రూట్ చేసుకొని. వాళ్ళకి డాలర్లు ఇస్తామని వాగ్దానం చేసింది రష్యా కానీ రూబుల్ తీసుకొని డాలర్లు ఎవరు ఇస్తారు? చైనా ద్వారా డాలర్లు ఇప్పిస్తున్నది రష్యా! భారత్ అగ్నివీర్ స్కీం 5 ఏళ్ళు మాత్రమే ఉండడంతో నేపాల్ యువకులు రష్యా బాట పట్టారు అన్నది నిజం! చైనా మధ్యవర్తిగా ఉండి గూర్ఖాలని రష్యన్ రెగ్యులర్ సైన్యంలో చేర్పించింది! Cont… Part -3
Share this Article