.
నెట్ ఫ్లిక్స్… బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనే వెబ్ సీరీస్ చాలా ఆసక్తిని రేపుతోంది… రైడింగ్ ద టైగర్ పేరిట (పులి మీద స్వారీ) ఎపిసోడ్ మన తెలుగు సత్యం రామలింగరాజు జీవితంలోని ఉత్థాన పతనాలను వివరిస్తుంది… ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఏ. సాయి శేఖర్ పంచుకున్న జ్ఞాపకాలు ఏమిటంటే..?
డెస్టినీ… ఒకప్పుడు తనతో ఫోటో దిగితేనే మహాభాగ్యం అనుకునేవారు జనం… కానీ ఇప్పుడు పాతికేళ్ల తరువాత తనను గుర్తుపట్టేవారే లేరు… స్వయంకృతం అందామా..? విధిలిఖితం అందామా..,?
Ads
మార్చి 24, 2000…. బిల్ క్లింటన్ వచ్చాడు హైదరాబాదుకు… అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… వాళ్లతోపాటు వేదికపై ఒకే ఒక్కడు… అప్పట్లో దేశానికి ఐటీ దిగ్దర్శకుడు సత్యం రామలింగరాజు… అదొక వైభోగం… అదొక ప్రభ…

- ప్రపంచం ఆసక్తిగా చూసింది ఈ సీన్… కట్ చేస్తే… ఆగస్టు 13, 2025… సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ హెడ్… అప్పట్లో రాజుకు బెయిల్ సాధించి, జైలు నుంచి బయటికి తీసుకొచ్చిన ప్రముఖుడు… ఆయన కొడుకు పెళ్లికి వచ్చిన రామలింగరాజు అక్షింతలు వేయటానికి వేదిక మీదకు వస్తుంటే తనను గుర్తుపట్టినవారే లేకుండా పోయారు… గుర్తుపట్టిన కొందరు పట్టించుకోలేదు… ఒకప్పుడు తనతో ఫోటో దిగితేనే అదృష్టం అని సంబరపడిన జనం తనను లైట్ తీసుకున్నారు ఇప్పుడు… డెస్టినీ…
ఎంత తేడా… అప్పటి ఐటీ లెజెండ్ ఇప్పుడు ఓ అనామకుడు.., జస్ట్ వారం రోజులు ఆగండి… 17 ఏళ్లు పూర్తవుతాయి… దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ మోసాన్ని తనే బయటపెట్టి… ! అప్పట్లో వైకుంఠ ఏకాదశి రోజు తన తప్పు అంగీకరించాడు ఆయన…
Ashley Gething… మంచి కథకుడు… రామలింగరాజు జీవితంలోని ఉత్థానపతనాలను సరిగ్గా అర్థం చేసుకున్నాడు… ఏం జరిగిందనే కథను పకడ్బందీగా, ఆసక్తికరంగా నేశారు… అదే ఇప్పుడు రైడింగ్ ద టైగర్ పేరిట నెట్‌ఫ్లిక్స్ లో మొన్నటి 30వ తేదీ నుంచి స్ట్రీమవుతున్న బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ సీరీస్‌లో దాదాపు 50 నిమిషాల కథ…
ఈ సీరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో ప్రముఖ దర్శకుడి దర్శకత్వం… ఈ ఎపిసోడ్‌కు ఆష్లే గెథింగ్… టెక్ మహీంద్ర (పూర్వపు సత్యం కంప్యూటర్స్) ఉద్యోగులతో విస్తృతంగా సంప్రదించి, వాళ్ల అనుభవాలూ అధ్యయనం చేసి, ఈ ‘పులి మీద స్వారీ’ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచారు…
- అప్పట్లో ది హిందూ రిపోర్టర్‌గా పనిచేస్తూ… సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించిన ప్రతి అంశాన్నిసవివరంగా కవర్ చేసిన నేను ఈ ఎపిసోడ్లలోని ప్రతి సెకన్‌తో రిలేట్ కాగలను… సీనియర్ జర్నలిస్ట్, మాజీ సత్యం ఉద్యోగి శ్రీరామ్ కర్రి ఈ ఎపిసోడ్‌లో చెప్పిన ప్రతి మాటా విలువైంది…
సత్యం కంప్యూటర్స్‌లో 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన వార్తను మొదటిసారి ‘ది హిందూ’ ఫ్రంట్ పేజీలో రాసి, ఈ కుంభకోణం మూలాలను పసిగట్టింది నేనే అని గర్వంగా చెప్పగలను… అప్పుడు రాజు గారు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను రాసింది అక్షరాలా నిజమని అంగీకరించారు… (అదే తన చివరి ప్రెస్ మీట్)…
హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని జనానికి చాటిచెప్పిన ప్రముఖ పాత్రికేయురాలు, విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ ఈ ఎపిసోడ్‌లో చెప్పినట్టుగా… త్రైమాసిక ఫలితాలను ఆకర్షణీయంగా చూపించే ఒత్తిడికి రామలింగరాజు గురయ్యాడు… దాంతో ఆయన అప్పటి సీఎఫ్ఓ శ్రీనివాస్ వడ్లమాని కలిసి కంపెనీ లెక్కల్లో పెద్ద లొసుగులు ఉన్నా, బయటకు మాత్రం అంతా బాగున్నట్లు రంగుల ప్రపంచాన్ని చూపించారు…

marquee బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మొదటి ఇండియన్ కంపెనీగా చెప్పబడిన ఈ సంస్థ బుడగ పేలినప్పుడు ఆ స్కామ్ విలువ ఒకటిన్నర బిలియన్ డాలర్లు… అంటే, ఆరోజుల్లో డాలర్ విలువను బట్టి దాదాపు 4500 కోట్లు…
- రాజుగారు తన రెండో కొడుకు రామరాజుకు చెందిన మేటాస్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కోసం భూముల్ని సమీకరించే పనిలో ఉన్నాడప్పుడు… తన పెద్ద కొడుకు తేజ రాజు కోసం మేటాస్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ అనే మరో కంపెనీ ఫ్లోట్ చేశారు… అప్పట్లో అంతా సజావుగా సాగుతున్నట్టే కనిపించేది..,
మేటాస్ (maytas) అంటే సత్యం (satyam)ను తిరగేస్తే వచ్చే పేరు... అవును, సుచేతా దలాల్ చెప్పినట్టు... అంతా రివర్స్ డైరెక్షన్... రామలింగరాజు ప్లాన్ కూడా అలా రివర్స్ కొట్టింది...
శ్రీరామ్ కర్రి చెప్పినట్టు… ‘‘అమెరికన్ కంపెనీలకు ఆఫ్‌షోర్ సర్వీసెస్ మొదలెట్టిన మొదటి కంపెనీ సత్యం… తరువాత పలు దేశాలకూ విస్తరించాడు… ఔట్ సోర్సింగ్ సేవలకు ఆద్యుడు తను… అదొక మార్గదర్శక మోడల్ ఇతర కంపెనీలకు…
- ‘పేరులో రాజు ఉంది కదా, అంటే కింగ్… నిజంగానే తన కార్పొరేట్ రాజ్యంలో కింగ్ కావాలనుకున్నాడు… సాఫ్ట్‌వేర్, ఐటీ, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా… చాలా కలలు కన్నాడు… నిజంగానే అప్పటి తన సంక్షోభం నుంచి గనుక తను ఎలాగోలా బయటపడి ఉంటే మరో ఇండియన్ స్టీవ్ జాబ్స్ అయ్యేవాడు…’’
‘‘ ఎప్పుడూ నెం. 3, నెం. 5 అంకెల గురించి ఆలోచించేవారు… ఆ సమయంలో భారతదేశంలో టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రోల తర్వాత సత్యం నాలుగో అతి పెద్ద ఐటి కంపెనీగా ఉండేది… సో, సత్యం మొదటి లేదా రెండవ స్థానాన్ని కాకపోయినా గౌరవనీయమైన మూడవ స్థానాన్ని ఆక్రమించేలా చూడటానికి తను పైన ఉన్న ముగ్గురిలో ఒకరిని పడగొట్టాలని కోరుకున్నాడు… ఐదవ స్థానానికి జారిపోకూడదని అనుకునేవాడు’’
చివరి ప్రయత్నం… హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి, తన కొడుకుల కంపెనీలను సత్యంలో విలీనం చేయాలని రాజు ప్రయత్నించాడు… కానీ అనలిస్టులు ఆయనను నిలదీయడంతో ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది… అప్పుడు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్న ప్రముఖులు కూడా రాజు గారి మాయమాటలు నమ్మి మోసపోయామని తర్వాత వాపోయారు…
“ఇది పులి మీద స్వారీ చేయడం లాంటిది, అది మనల్ని తినకుండా ఎలా సురక్షితంగా దిగిపోవాలో తెలియక పోవడం లాంటిది…” అని బి. రామలింగ రాజు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి రాసిన తన 2009 ఒప్పుకోలు లేఖలో పేర్కొన్నాడు…
- ఒకప్పుడు శిఖరాగ్రంపై కూర్చున్న తను… తన కళ్ల ముందే తన ప్రతిష్ట, తన కంపెనీ కుప్పకూలిపోతున్న తీరు చూశాడు… తను నిర్మించిన ఓ పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం పేకమేడలా విచ్ఛిన్నమవడాన్ని కూడా చూశాడు… కొంత స్వయంకృతం, కొంత విధిలిఖితం… లాభాలను అధికంగా చూపాలనుకున్న ఓ అబద్ధం చివరకు పెరిగీ పెరిగీ తననే ఓ పులిలా మింగేసింది…
2008లో సబ్-ప్రైమ్ సంక్షోభం యుఎస్ మార్కెట్లను తాకకపోతే… లెహ్‌మాన్ బ్రదర్స్ కుప్పకూలి ఉండకపోతే… అది ఇండియా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను దెబ్బతీయకుండా ఉండుంటే… రామలింగరాజు కూడా తను సేకరించిన భూముల్ని అమ్మేసయినా… తన తప్పుల్ని కప్పిపుచ్చుకుని, లొసుగుల్ని పూడ్చుకుని, మళ్లీ వెలిగిపోయేవాడేమో…
కోరికల గుర్రాలు ప్రతిసారీ మన మాట వినవు... బోల్తాపడేస్తాయి...!! ఇదే ‘సత్యం’... ఐనా కార్పొరేట్ ప్రపంచంలో, వ్యాపారంలో ‘ఒకవేళ ఇది జరిగి ఉంటే’ అనే వాక్యానికి చోటుండదు కదా..!!
Share this Article