ఒక వార్త… వామపక్ష పత్రికల్లో బ్యానర్లు… (ఆ సర్వే చేసిన సంస్థల క్రెడిబులిటీ, ఉద్దేశాల గురించి తరువాత చెప్పుకుందాం)… హంగర్ ఇండెక్స్‌లో 105 వ స్థానం… 127 దేశాల్లో… చివరకు అఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బర్మా, పాకిస్థాన్‌లకన్నా దిగువ ర్యాంకులో… పేదలు, పిల్లల ఆకలికేకలు…
ఆ వ్యాఖ్యల గొప్పవాడు దర్శకుడో, నిర్మాతో, మరెవరో గానీ… నాగవంశీ అట… ఓసారి తనకు ఈ హంగల్ ఇండెక్స్ వార్త ఎవరైనాచూపించండి… ప్రతి కుటుంబం ఆఫ్టరాల్ ప్రతి సినిమాకు 1500 చెల్లించలేరా అనడుగుతున్నాడు… మాల్‌కు వెళ్తే ఖర్చుకన్నా తక్కువట… ఇదుగో, ఇలాంటి మూర్ఖపు వ్యాఖ్యలు, అభిప్రాయాల్లాగే మన సినిమాలూ ఏడుస్తున్నాయి… మరి వీళ్ల మైండ్ సెట్ అదే కదా… తెలంగాణలో ఇలాంటోళ్ల ధోరణిని ‘పైసల బలుపు’ అంటుంటారు…
Ads
మన దేశంలో ఆకలి సూచికల గురించి చెప్పుకున్నాం కదా… పేదవాడి దాకా ఎందుకు, కనీసం ఓ మధ్యతరగతి వాడికే ఒక సినిమా చూడటమే భారం అవుతోంది… విపరీతమైన టికెట్ రేట్లు, క్యాంటన్ల దోపిడీ, థియేటర్ వద్దకు వెళ్లివచ్చే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు, పార్కింగ్ ఖర్చు… మొత్తం నిలువు దోపిడీయే కదా… పోనీ, దానికి సిద్ధపడితే మన సినిమాల తీరు ఏమిటి..?
దిక్కుమాలిన కథలు, అడ్డమైన హీరో ఎలివేషన్లు… తలతిక్క స్టెప్పులు, ఊహాతీత ఫైట్లు… పనిలోపనిగా అందాల ఆరబోతలు, బూతులు సరేసరి… ఈ మూర్ఖపు సినిమాలకు ఒక్కో సినిమాకు ఆఫ్టరాల్ 1500 ఖర్చుపెట్టలేరా అనడుగుతున్నాడు ఈ మూర్ఖాగ్రేసరుడు… ఈ మాట అనడానికి సందేహం అక్కర్లేదు… బుర్రలో చటాక్ గుజ్జు ఉంటే కూడా ఇలాంటి మాటలు రావు… అందుకే సోషల్ మీడియాలో నెటిజనం ఓ ఆట ఆడుకుంటున్నారు తన వ్యాఖ్యలపై…
థియేటర్లలో దోపిడీ ఒకవైపు… రిలీజ్ కాగానే సోకాల్డ్ ప్రజాప్రభుత్వాలు అత్యంత దయతో వాళ్లకు టికెట్ రేట్లను అడ్డగోలుగు పెంచుకునే చాన్సులు ఇచ్చి, మరింత దోపిడీకి సహకరిస్తాయి… అదొక దరిద్రం… ఇష్టమొచ్చినన్ని షోలు, ప్రీమియం షోలు అదనం…
పోనీ, వినోదం కోసం కాస్త ఖర్చుకు సిద్ధపడ్డామే అనుకుందాం… ఆ అడ్డమైన చెత్తను భరిద్దామనే అనుకుందాం… కానీ జరిగిదేమిటి..? ఒక్కొక్క హీరో వందలు, వేల కోట్లను వెనకేసుకుంటాడు… (ఒక హీరో 150 కోట్లు తీసుకున్నాడట ఓ సినిమాకు మన సౌత్‌లోనే..) అదంతా ప్రేక్షకుల నుంచే కదా దోచుకునేది… ఆ హీరోలకు అవి చాలవు, రాజకీయాల్లోకి వస్తారు, అక్కడ దోచుకున్నోడికి దోచుకున్నంత… అలా జనాన్ని ఉద్దరిస్తారు…
ఈ నాగవంశీయుడు ఏ మైహోం బినామీయో నాకు తెలియదు గానీ… సేమ్ మెంటాలిటీ… సేమ్… ఒకప్పుడు ది గ్రేట్ కేసీయార్ బాపతు… ఇప్పుడేమిటో తెలియదు…
దీనికితోడు మీడియా… ఈమధ్య ప్రతి రివ్యూయర్‌కు ఒకటి అలవాటుగా మారింది… పరమ చెత్త సినిమాలకు కూడా పర్లేదు, ఒకసారి చూడొచ్చు, థియేటర్లలోనే చూడాలి అని రాసిపారేస్తున్నారు… సగటు మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జీవన వ్యయాలు ఎలా ఉన్నాయో తెలియని, నిర్లక్ష్యపు, పట్టని, బాధ్యతారాహిత్యపు, దోపిడీ అనుకూల రాతలు ఇవి…
ఒకసారి చూడటమే దిక్కుమాలిన పని అనుకుంటుంటే, పర్లేదు ఒకసారి చూడొచ్చునట… పోనీ, సినిమా ఓ మోస్తరుగా ఉంటే ఎన్నిసార్లు చూడాలి రాతగాళ్లూ..? పదీపదిహేనుసార్లు చూడొచ్చా…? ఫ్యాన్లు రివ్యూయర్లు అయితే ఇదీ సొసైటీకి నష్టం… డబ్బు చేసిన వాళ్లు, అభిమాన ఉన్మాదులను వదిలేయండి… మధ్యతరగతికి రచయిత, పాత్రికేయుడు బుద్ధా మురళి సజెషన్ ఏమిటంటే..?
‘‘ఒక్క సినిమా కు 1500 పెట్టే బదులు వాటినే మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల SIP చేయండి … సినిమా చూస్తే రెండు గంటలు టైం పాస్ లేదా తల నొప్పి … కానీ అదే డబ్బు SIP చేయడం ద్వారా కొంత కాలానికి మీరు ఊహించని విధంగా పెరుగుతుంది … మీ పిల్లల చదువు భవిష్యత్తు , మీ రిటైర్ మెంట్ జీవితం హాయిగా గడిచిపోవడానికి ఉపయోగ పడుతుంది … మా తరంలో ఈ ఆలోచన లేదు కానీ ఇప్పటి యువత కు ఇది తెలుసు … ప్రతి నెల SIPల ద్వారానే మ్యూచువల్ ఫండ్స్ లోకి 25 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి . … వాటి విలువ తెలిసిన కొందరి వల్లనే 25 వేల కోట్లు అంటే ఇక అందరూ ఈ బాట పడితే … నాగవంశీ ఎవరో నాకు తెలియదు కానీ 1500 విలువ ఎంతో చర్చించే అవకాశం కల్పించాడు…’’
Share this Article