అన్యాయం గురూ గారూ… స్వాతి మోహన్ బొట్టు మెరిసిందీ, ఖగోళం మురిసిందీ అని ట్విట్టర్ నిండా బొచ్చెడు ప్రశంసలు రాశారు గానీ ఓ అన్యాయం జరిగిపోయింది…
.
పలు దేశాల నుంచి నాసాకు వచ్చి పనిచేసే వారి నడుమ… భారతీయ మూలాలున్న ఓ హిందూ స్త్రీ నాయకత్వ విజయాన్ని మనవాళ్లు ఆనందించి ఉంటారులే, బొట్టు హైందవం సూచికే కాబట్టి, ఆ క్షణాన ఆమె నొసట తిలకం చూసి మురిసిపోయి ఉంటారు… అందులో అభ్యంతరం ఏముంది..? మన మూలాల్ని మరవకపోవడాన్ని ఆక్షేపించడం దేనికి..? ఇంతకీ ఏమంటావ్..? బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ బిందీ అన్నట్టుగానే ప్రెట్టీ విత్ బ్రెయిన్ అండ్ ఇయర్ రింగ్స్ అని స్లోగన్ పాపులర్ చేస్తే బాగుండేది అంటావా..?
Ads
.
అబ్బా, అది కాదు… ఆమె బొట్టు గురించే ట్విట్టర్లో కూతల మోతలు, మీడియా రాతలు తప్ప… ఆమె చెవులకున్న జూకాల గురించి రాయలేదేం..? తప్పు కదా… అసలు అవే కదా ప్రముఖంగా, ప్రస్ఫుటంగా కనిపిస్తూ… అంతమంది విదేశీయుల నడుమ ఆమెను భిన్నంగా చూపించినయ్… అసలు అమెరికాలో మనవాళ్లు జూకాలు ధరించి కనిపించడమే ఓ విశేషం కదా…
.
అబ్బో, పోనీ, ముక్కుపుడక, మెడలో పుస్తెలు, కాలికి మెట్టెలు, పట్టీలు, జడలో పూలు కూడా ఉన్నాయో లేవో చెక్ చేయకపోయావా..? ఆ మార్స్ మీద దిగిన రోవర్ సంగతి తరువాత, ఇవయితే ముందే బడబడా రాయించేద్దాం…
చెక్ చేశాను గురువర్యా… ముక్కుపుడక లేదు, కాలి ఫోటోలు ఎక్కడా నెట్లో దొరకలేదు… ఐనా ఈమధ్య విదేశాల్లో మనవాళ్లు అన్నీ తీసేసుకుని తిరుగుతున్నారు…
.
అదేమీ లేదోయ్… నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబులో ఏది కంఫర్ట్ డ్రెసో, ఏది డ్రెస్ కోడో అదే ధరిస్తారు… ధరించాలి… అక్కడికి పట్టు చీరె కట్టుకుని వెళ్తాను, పూలజడ వేసుకుని వెళ్తాను అంటే ఎలా..? మనవాళ్లు ఎక్కడెక్కడ జాబ్స్ చేస్తున్నారో, ఆ వాతావరణాన్ని బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి వస్త్రధారణ ఉంటుంది… అంతేతప్ప మెట్టెలు, పట్టీలు, పుస్తెల గురించే ఆలోచిస్తే ఎలా..? అయినా రోమ్‌లో వీలైనంతవరకూ రోమన్‌లాగే ఉండాలి కదా…
.
అవును కదా… మరి అలాంటప్పుడు ఆమె వైజ్ఞానికి ప్రతిభకన్నా, ఆమె నాయకత్వ లక్షణాలకన్నా ఆమె ధరించిన బొట్టే ఎందుకు చర్చనీయాంశం కావాలి..?
.
అది ఆఫ్-బీటోయ్… అసలు సబ్జెక్టుకు అదనంగా ఇలాంటి కొసరు ఇంట్రస్టింగ్ పాయింట్స్ రాయడం ఓ పద్ధతి… తప్పులేదు…
.
అవును కదా… మరి అలాంటప్పుడు ఆమె జూకాల గురించి ఎందుకు రాయలేదు..?
అబ్బా… నీకు చెప్పడం కష్టంరా బాబూ… ఐనా వేరే దేశస్థుల సంగతేమిటో గానీ… మనవాళ్లు మాత్రం మన మూలాల్ని, కల్చర్‌ను వదలరు… ఇప్పుడైతే మన పండుగలు, ఫంక్షన్లు భలేగా చేసుకుంటున్నారు… చిన్న చిన్న ఫంక్షన్లకు నగలు వేసుకుని, పట్టుచీరెలు కట్టుకుని, మగవాళ్లు పంచెలు కట్టుకుని… ఇండియాలోకన్నా పద్దతిగా చేసుకుంటున్నారు… మన డాన్సులు, మన భాషలు నేర్పిస్తున్నారు పిల్లలుకు… మన మాల్స్, మన హోటల్స్… నో కాంప్రమైజ్… పొడులు, తొక్కులు… ఇళ్లల్లో అవే ఇడ్లీలు, అవే దోసెలు… వ్రతాలు, నోములు… చివరకు మన కులకల్చర్, మన సినీకల్చర్ కూడా వచ్చేసింది… కులాల వారీ సంఘాలు, భేటీలు, హీరోల వారీ హంగామాలు, సోషల్ తన్నులాటలు అన్నీ… అసలు ఇండియాలోకన్నా అక్కడే ఎక్కువట…
అవును గురువర్యా… మనవాళ్లను తీసుకెళ్లి అదే అరుణగ్రహంలో పడేసినా సరే, ఏదీ వదలరు… అక్కడ అర్జెంటుగా ఓ కులసంఘాన్ని, ఓ హీరో అభిమానసంఘాన్ని పెట్టేస్తారు… ఆ తరువాతే మిగతా పనులు…
.
కదా… అందుకే ఆమె బొట్టు గురించి, జూకాల గురించి ఎక్కువ ఆలోచించకుండా… పనిచూసుకో….
Share this Article