అబ్బా… ఈమె మళ్లీ వచ్చిందిరా బాబూ… ఈమధ్య రెండు సర్జరీలు చేయించుకుంది, ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా… లేకపోతే తన నియోజకవర్గంలో కరోనా స్థితిగతులపై కాస్త జనానికి సాయం చేయడంపై దృష్టి పెట్టొచ్చుగా……….. ఇలా కామెంట్లు పోటెత్తుతున్నయ్… అర్థం కాలేదా..? ఈటీవీలో జబర్దస్త్ అనే ఓ వెగటు కామెడీ షో వస్తుందిగా… దానికి రోజా జడ్జి… అసలు తనను గెలిపించిందే జబర్దస్త్ అన్న స్థాయిలో ఆ షోను ఓన్ చేసుకుంటుంది రోజా… నాగబాబు కో-జడ్జిగా ఉన్నన్నాళ్లూ కాస్త తగ్గి ఉండేది… నాగబాబు చాప్టర్ ఈటీవీలో క్లోజయిపోయాక ఇక జబర్దస్త్‌కు మల్లెమాల టీం కాదు, రోజాయే బాస్ అయిపోయింది… సరే, ఓన్ చేసుకుంటే మంచిదే గానీ… ఆమె వైఖరితో ఇటు ప్రేక్షకులు, అటు జబర్దస్త్ కమెడియన్లు బోరెత్తిపోతున్నారు… అదేనండీ, విసుగెత్తిపోతున్నారు…
ఈమధ్య ఆమె రెండు సర్జరీలు చేయించుకుంది చెన్నైలో… అనివార్యంగా జబర్దస్త్‌కు దూరం కావల్సి వచ్చింది… ఏదో తాత్కాలిక సర్దుబాటుగా ఇంద్రజను తీసుకొచ్చి జడ్జి స్థానంలో కూర్చోబెట్టారు… విచిత్రంగా ఆమెను ప్రేక్షకులు, ఆ కమెడియన్లు భలే రిసీవ్ చేసుకున్నారు… ఎక్కడా ఓవరాక్షన్ లేకుండా, ప్లజెంటుగా నవ్వుతూ ఇంద్రజ అందరినీ ఆకట్టుకుంది… ఇప్పుడు రోజా మళ్లీ వచ్చింది… ఇంద్రజ వెళ్లిపోయింది.., మళ్లీ రోజా మార్క్ అతి స్టార్టయింది… ఆమె నవ్వును, జడ్జిగా ఆమె ప్రజెన్స్‌ను చాలాకాలం ఇష్టపడిన ప్రేక్షకులే ఇప్పుడు విసుక్కుంటున్నారు… ఈటీవీ వాడు యూట్యూబులో ప్రోమో పెడితే చాలు, కామెంట్లే కామెంట్లు… అధికశాతం ఇంద్రజను ప్రెయిజ్ చేస్తూ, రోజాను విమర్శిస్తున్నవే…
Ads
జూన్ 3వ తేదీ ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోమో ఒకటి కనిపించింది… అందులో రాకెట్ రాఘవ స్కిట్ కనిపిస్తోంది… పాపం, అటు స్కిట్ నడుస్తూనే ఉంది, ఇటు ఏం జరగబోతోందో, ఏ పంచ్ డైలాగ్ వేస్తారో రోజా ముందే చెప్పేస్తోంది… క్రికెట్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది కదా… అలా… నిజానికి చాలా రోజులుగా జబర్దస్త్ కమెడియన్లు, ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న విమర్శే… కానీ రోజా దాన్నే గొప్పతనం అనుకుంటున్నట్టుంది… ఇంకా ఎక్కువ చేస్తోంది… హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వంటి సీనియర్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రోజా చేస్తున్న తప్పును ఎత్తిచూపిస్తున్నారు… జడ్జి స్థానంలో ఉన్నవాళ్లు మధ్యమధ్యలో ఇలా పంచుల లీకులతో ఇన్వాల్వ్ అయిపోతుంటే ఇక స్కిట్లో థ్రిల్ ఏముంటుంది..? ఈ రాకెట్ రాఘవ స్కిట్లో ఓ కమెడియన్‌కు పాపం ఉన్నదే ఒక డైలాగ్, దాన్ని కూడా రోజా ముందే చెప్పేసింది… ఫాఫం, ఆయన లబోదిబో… అరెరె, నాకు తెలియదు, సారీ అని రోజా దండం పెట్టేసింది… ఇదుగో ఈ ధోరణినే నెటిజనం కామెంట్లలో విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు… రోజా ఇవన్నీ పట్టించుకోదు, తనేది అనుకుంటే అది చేసేస్తుంది, అంతే… ఈటీవీ, మల్లెమాల ఆమెను వదలుకోలేరు… సో, జబర్దస్త్ ప్రేక్షకులకు, కమెడియన్లకు ఈ విసుగు తప్పదు…!! ఏ మాటీవీ వాడో, ఏ జీటీవీ వాడో కాస్త క్వాలిటేటివ్ కామెడీ షో తీసుకొస్తారనుకుంటే వాళ్లకూ చేతకావడం లేదు… అదీ అసలు శాపం…! జబర్దస్త్‌కు అదే బలం..!!
Share this Article