Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…

November 2, 2024 by M S R

ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్. కొన్ని నాన్ సీరియస్. అలా అమెరికాలో జరిగిన ఒకానొక అధ్యయనం అమెరికాకు పరమ సీరియస్. మనకదే పరమ కామెడీ.

సినిమాల్లో విషాద సన్నివేశాలకు ఏడ్చేవారిలో అకాల మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. చూస్తున్న సినిమా/నాటకం/దృశ్యం నిజం కాదని… కేవలం నటన అని… కల్పితమని తెలిసినా అందులో సన్నివేశాలకు పొర్లి పొర్లి ఏడ్చే ప్రేక్షకుల గుండె బలహీనమని… ఇలాంటివారి గుండె మధ్యలోనే కొట్టుకోవడం మానేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కొన్ని లక్షల గుండెలను పరిశీలించి చెబుతోంది.

ఇదివరకు లవకుశ సినిమాలో సీతమ్మను అడవికి పంపినప్పుడు తెరమీద అంజలీదేవి…
“అపవాద దూషితయైన కాంతను బాసి, పతికీర్తి బొందుట భావ్యమనుము;
కౌసల్యాదిగాగల్గు అత్తల కేను, గడుభక్తితో మ్రొక్కులిడితి ననుము;
తోడి కోడండ్రు నాతోడి నేస్తము నెంచి, కడసారి సేమంబు నడిగె ననుము;
చెలికత్తియలు నన్ను బలుమారు దలపోసి, యమ్ములింప నిరుపయోగమనుము”
అని ఏడవగానే మహిళా ప్రేక్షకులందరూ అంజలీదేవితోపాటు వెక్కి వెక్కి ఏడ్చి… చీరకొంగుతో కన్నీళ్లు తుడుచుకునేవారు. దాంతో హాలంతా కన్నీటిసంద్రమై ప్రేక్షకులు సెంటిమెంటు పడవలమీద తెడ్డేసుకుని తీరం చేరేవారు.

Ads

“మాతృదేవోభవ” సినిమా చూస్తూ ఏడవకుండా ఉండగలిగిన ప్రేక్షకుడికి నగదు బహుమతి ప్రకటించారు. “రాలిపోయె పువ్వా! నీకు రాగాలెందుకే?
తోటమాలి నీ తోడు లేడులే!
వాలిపోయే పొద్దా! నీకు వర్ణాలెందుకే?
లోకమెన్నడో చీకటాయెలే!
నీకిది తెలవారని రేయమ్మా!”

అన్న వేటూరి మాటలు కీరవాణి గొంతులో వినిపించగానే ఆ మాతృదేవతకు తెలవారని రేయి మనల్ను విషాదంలో ముంచేస్తుంది. నుదుట కుంకుమ పొద్దుల తలరాత వివర్ణమైన ఆ మాతృదేవతకు వర్ణాలెందుకు? అన్న సమాధానంలేని ప్రశ్న మన కన్నీళ్ళుగా కట్టలు తెంచుకుంటుంది. సినిమా థియేటర్ దృశ్యం దాటి కేవలం ఆడియోగా వినేవారిని కూడా కన్నీళ్ళలో ముంచే పాట ఇది.

ఇప్పుడలాంటి లవకుశల్లు లేవు. మాతృదేవోభవలు లేనే లేవు. కాబట్టి మనం ఈ అమెరికా అధ్యయనాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. బాధపడాల్సిన పనిలేదు. పడితే గిడితే… ఆశ్చర్యపడాలి.

మన రచయితలు, దర్శకులు, నిర్మాతలందరికీ అమెరికా అధ్యయనం కంటే ముందే ఈ విషయం మాబాగా తెలుసు. అందుకే ఎక్కడ పొరపాటున మనకు ఏడుపొస్తుందోనని కేజిఎఫ్ పార్లమెంటులో మెషిన్ గన్ తో సభ్యులను చంపే పరమ సీరియస్ విషయాన్ని కూడా పిల్లల కార్టూన్ నెట్ వర్క్ డిష్షుమ్ డిష్షుమ్ సరదా సన్నివేశంలో నవ్వు పుట్టించేలా చిత్రీకరిస్తారు.

నంద్యాల రైల్వే స్టేషన్లో హీరో తొడగొడితే ఆ తొడ తాడన శబ్ద విస్ఫోటనానికి రైలు నాగర్ కోయిల్ దాకా వెనక్కు వాయువేగంతో పరుగెడితే మనం ఘొల్లున నవ్వుకుంటున్నాం కానీ… ఇలాంటి సన్నివేశాల కల్పన/చిత్రీకరణ ద్వారా సినిమావారు మన గుండెలకు ఎంత ఆయుష్షు పోస్తున్నారని ఒక్కరోజైనా ఆలోచించామా! లేదే.

మనవారు బాధ్యతగల సినిమావారు కాబట్టి… గుండెలు పిండేసే… విషాదాన్ని పండించే… కన్నీరొలికించే కథలు/సన్నివేశాల జోలికి వెళ్ళకుండా మనల్ను కాపాడుతున్నారు. మొదటివారం టికెట్ ఎక్కువ దోపిడీ; బెనిఫిట్ ఆఫ్ డౌట్ షో; థియేటర్లలో పార్కింగ్, తినుబండారాల బాదుడుతో గుండెలు ఆగినట్లుగా ఇప్పటిదాకా ఏ అమెరికా అధ్యయనమూ తేల్చలేదు కాబట్టి… ఆగిన గుండెలను ఆ పద్దులో వేయడం అధర్మం అవుతుంది!

కొస మెరుపు:- అమెరికా అధ్యయనం సంగతేమో కానీ… భారత్ లో మాత్రం ముసలమ్మలు కేవలం ఏడుపుగొట్టు టీవీ సీరియళ్లు చూస్తూ… ఆ ఎమోషన్ కన్నీళ్లను తాగుతూ… మరో పదేళ్ల ఆయుర్దాయం పెంచుకుంటున్నారు. “బాలానాం రోదనం బలం” అన్న పరమ ప్రమాణం సాక్షిగా చిన్నప్పటి నుండీ మన ఏడుపు దినదినాభివృద్ధి చెంది… ఏడుపే జాతీయ పోషకాహారంగా మారింది కాబట్టి అమెరికా ఏడుపుగొట్టు అధ్యయనం గురించి మనం ఏడవాల్సిన పనిలేదు! – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహల్లో కోయిల… ఇది వంశీ రాసిన కథ కాదు… వేరే… ‘కోటలో రాణి’…
  • ఉపరాష్ట్రపతి ఎంపికపైనా ఆర్ఎస్ఎస్ ముద్రపడింది… ఎవరాయన..?!
  • అర్జెంటుగా ఓ దాసరి కావలెను..! ఆ లోటు బాగా కనిపిస్తోంది ఇప్పుడు..!!
  • KTR వింత విమర్శలు… పోలవరం నాణ్యతతో తెలంగాణ పార్టీలకు ఏం పని..?!
  • ఇన్‌సెన్సిబుల్, ఇన్‌సెన్సిటివ్ స్కిట్… ఇందులో విజ్ఞానం ఏముందిర భయ్..?!
  • ట్రంప్ – పుతిన్ భేటీ… తక్షణ ప్రయోజనం ఇండియాకే… ఎలాగంటే..?
  • ట్రంప్- పుతిన్ భేటీ ఉక్రెయిన్ శాంతికై కాదు… అసలు చర్చ ఆర్కిటిక్..!!
  • బారా ఖూన్ మాఫ్..! ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు… అంతే ఇక..!!
  • చప్పట్లు, శాలువాలు, దండలు, అవార్డులు దక్కాల్సింది రాధికకు కూడా..!!
  • మోహన్‌లాల్ ఖాళీ చేసిన కుర్చీలో… తొలిసారిగా ఓ ఫైర్ బ్రాండ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions