నెవ్వర్… ఇప్పటికి తెలుగు పాత్రికేయంలో ఇదే అల్టిమేట్ వార్త… ఇంకెవరూ ఈ రేంజ్ వార్త రాయలేరు… చాలెంజ్… అసలు దీన్ని పాత్రికేయం అని పిలవకుండా ఇంకేమైనా పవిత్రమైన, బరువైన, గంభీరమైన పదాల్ని సృష్టించి పిలవడం బెటరేమో… టీన్యూస్ చానెల్‌కు సంబంధించిన వెబ్‌సైట్ ఇది… అరె, నమస్తే తెలంగాణకు ఓ సైట్ ఉంది కదా, మళ్లీ టీవీకి దేనికి అనడక్కండి… దేని వెబ్ దుకాణం దానిదే… ఎవరి గోల వాళ్లదే…
ఇంతకీ వార్త ఏమిటయ్యా అంటే… మోడీని తిట్టిపోయడం… సరే, కేసీయార్ చానెల్, కేసీయార్ సైట్… తను తిట్టినట్టే వాళ్లూ తిట్టడం సహజం కదా, యథా చీఫు, తథా స్టాపు అనుకుందాం కాసేపు… కానీ ఓ రీతి ఉండాలి… మరీ ఏడో తరగతి ఫెయిలైన ఓ రూరల్ కంట్రిబ్యూటర్ వార్త రాసినట్టుగా ఉంది ఇది… యాంటీ మోడీ ప్లాట్‌ఫారమ్స్, పార్టీలు, నాయకులు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు కదా…
నిజంగా మోడీని తిట్టిపోయాల్సిన అంశాల జోలికి వెళ్లరు వీళ్లు… ఆ సబ్జెక్టులు అర్థమైతే కదా… ఎంతసేపూ మోడీ అంగీలు చమ్కాయిస్తున్నయ్… మస్తు పిరం లాగూలు తొడుక్కుంటడు, సారు చెప్పుల ధర లక్షలు… ఇలాంటి విమర్శలు చేస్తుంటారు… ఇదీ అలాంటిదే… పైగా ఉత్త ఫేక్… సోషల్ మీడియాలో ఈ టీన్యూస్ క్లిప్ కనిపిస్తే, ఇంకా అలాగే ఉందా అని చెక్ చేస్తే… ఈ కథనం రాసే సమయానికి అలాగే ఉంది… మరి ఈ వార్తకు సంబంధించి ట్విట్టర్‌లో వైరల్ అయిన వీడియో ‘‘ఔటాఫ్ కాంటెక్స్ట్’’ అని ట్విట్టరే ప్రతి పోస్టు కింద డిస్‌క్లెయిమర్ తగిలిస్తున్నది కదా… అప్పుడైనా ఈ వార్త డిలిట్ చేయాలి కదా… పోనీ, వార్త పబ్లిష్ చేసేముందు చెక్ చేసుకోవాలిగా… అబ్బే, ఏదో దొరికింది, తిట్టేశాం, అంతే…
Ads
ఆ భాష ఏమిటి..? ఆ రాత ఏమిటి..? ఆ రీతి ఏమిటి..? చేతులెత్తి దండం పెట్టినా మోడీ దళిత రాష్ట్రపతిని పట్టించుకోలేదట… గురువు గురువు అంటూనే గూబలపై కొడుతున్నాడట… ఎవరు గురువు..? ఎవరికి గురువు..? ఏదో నోటికొచ్చింది రాసి పారేస్తే సరి… పైగా మోడీకి చేతులెత్తి దండం పెట్టాల్సిన ఖర్మ రామనాథ్ కోవింద్‌కు ఏముంది..?
నిజానికి రామనాథ్ కోవింద్‌ను ఎంపిక చేసిందే మోడీ అండ్ షా… గెలిపించుకున్నారు… పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు… అంతేకాదు, పలువురు ప్రతిపక్ష సీఎంలతోపాటు ప్రభుత్వ ముఖ్యులను ఆహ్వానించి విందు కూడా ఇచ్చాడు మోడీ… ద్రౌపది ముర్ము ఎంపిక కూడా మోడీషాలదే… విందుకు స్టాలిన్‌ను కూడా పిలిచాడు, కానీ కేసీయార్‌ను పిలవలేదు… తన భాష, తన విమర్శల తీరుతో మర్యాదను పోగొట్టుకున్నాడు కేసీయార్… ఇదుగో ఇలాంటి వార్తల్లాగే…
ఇదంతా సరే… నిజానికి ఈ చేతులెత్తి దండం అనే వివాదం ఏమిటో చూద్దాం… కోవింద్‌కు వీడ్కోలు ఇచ్చినప్పుడు ఆయన అందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాడు… అలా నమస్కరిస్తూనే నడిచాడు… ప్రముఖులంతా ప్రతినమస్కారం చేశారు… అది మర్యాద, అది సంస్కారం… మోడీ కూడా చేతులు జోడించి ప్రతినమస్కారం చేశాడు… కానీ ఆ వీడియోను ఎడిట్ చేసి ఆప్ నాయకుడు ఎవరో రాష్ట్రపతికి ప్రతినమస్కారం చేయలేదు మోడీ అని ట్విట్టర్‌లో వదిలాడు…
అసలే మోడీ, దొరికాడు అని యాంటీ మోడీ సెక్షన్ వైరల్ చేసేసింది… ఈ ఫోటోలు, ఈ వీడియోలు చూస్తే నిజంగానే మోడీ ఇంత కుసంస్కారంగా వ్యవహరించాడా అన్న సందేహం వచ్చేలా ఎడిట్ చేశారు… తరువాత బీజేపీ సెక్షన్ మేలుకుని, ఒరిజినల్ వీడియో సేకరించి, కౌంటర్ స్టార్ట్ చేసేసరికి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ శ్రేణులు కూడా యాంటీ మోడీ వీడియోను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు… బీజేపీ సెక్షన్ ట్విట్టర్‌కు కంప్లయిట్ చేశాక, ట్విట్టర్ దానికి “Out of Context” అని ట్యాగ్ తగిలించింది కూడా… ఇదుగో ఇదీ అసలు నిజం… రాజకీయాల్లో ప్రత్యర్థి నాయకులపై విమర్శలు సహజం… కానీ దానికి మరీ ఈ బజారు భాష, ఈ పాతాళ భాష అవసరం లేదు… ఇది బీజేపీ నాయకులకూ వర్తిస్తుంది…!!
Share this Article