మార్పు మొదలైంది అని కదా బాబు గారు సెలవిచ్చింది… ఎస్, మార్పు ఆయన ప్రమాణస్వీకారానికి ముందే మొదలైంది… ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఫస్ట్ పేజీలు యాడ్స్ ప్రభుత్వమే ఇచ్చింది… అచ్చం టీడీపీ ప్రకటనలాగే… మార్పు మరి…
ఆయన ఇంకా సీఎం కానే లేదు… సాక్షికి ఆ యాడ్స్ ఇవ్వలేదు… మార్పు సహజం కదా మరి… ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చినా సరే సాక్షికి నో యాడ్స్… మరి జగన్ ఉన్నప్పుడు కూడా అంతే కదా… టాప్ సర్క్యులేషన్ కాబట్టి ఈనాడుకు, సొంత పత్రిక కాబట్టి సాక్షికి… ఆంధ్రజ్యోతికి ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు కదా…
అవును మరి, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో… అన్నట్టుగా…! ఏమో, చెప్పలేం, కాస్త కుదురుకున్నాక చంద్రబాబు స్పెషల్ దర్యాప్తుకు ఆదేశించవచ్చునేమో… గత అయిదేళ్లలో సాక్షికి జరిగిన నిధుల పందేరం గురించి..!
Ads
వైసీపీ ప్రచారకర్త అన్న సాకుతో టైమ్స్ కరెస్పాండెంట్ దారా గోపి కొలువు అర్జెంటుగా ఊడగొట్టేశారట… సోషల్ మీడియాలో కనిపించింది… ఇలాంటి అక్కసు పనులు గతంలోనూ చాలా చూశాం కదా, మన తెలుగు రాష్ట్రాల్లోనే… ఎకనమిక్ టైమ్స్‌లో చేసే రాజసుకుమార్ రెడ్డి మీద కేటీయార్ స్వయంగా ఆఫీసుకు వెళ్లి మరీ ఫిర్యాదు చేసినట్టు గుర్తు… అంతెందుకు..? ఎన్టీవీలో ఉన్న కొమ్మినేనిని కూడా లోకేష్ ఆగ్రహంతోనే ఎన్టీవీ వదులుకుంది కదా… ‘యెల్లో బాధితుడు’ అనే ట్యాగ్‌తో ఆయన సాక్షిలో చేరడం కూడా చూశాం కదా… సాక్షి గాకుండా ఇంకా ఏయే పత్రికల్లో, టీవీల్లో వైసీపీ వీరాభిమాన జర్నలిస్టులు ఎవరున్నారో లోకేష్ గారి ‘రెడ్ బుక్’లో నమోదయ్యే ఉంటుంది జాబితా… ఫలితాలు చూడాలిక…
అన్నట్టు… జగన్ పదే పదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 మాత్రమే తన ప్రత్యర్థులని చెప్పేవాడు కదా… వాటిని యెల్లో మీడియాగా చూపేవాడు కదా… తప్పు కాదు, వాళ్లూ ఆ ముద్ర వేయించుకోవడానికి సందేహించలేదు… ఇదే జగన్ పార్టీ ఉన్నత స్థాయి బృందం ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది… ‘‘అయ్యా, టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే కేబుల్ ఆపరేటర్లను బెదిరించి కొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయించారు… మీరు కలగజేసుకుని న్యాయం చేయాలి’’ అని ఆ ఫిర్యాదు సారాంశం…
అందులో పేర్కొన్న టీవీల్లో సాక్షి టీవీ ఎలాగూ వాళ్ల సొంతమే… అది గాకుండా టీవీ9, ఎన్టీవీ, 10టీవీ కూడా ఉన్నాయట జాబితాలో… అంటే తమ అనుకూల మీడియాగా ఆ మూడు చానెళ్లకూ ముద్ర వేస్తున్నది వైసీపీయేనా..? సో, అవేమీ నిష్పాక్షికాలు కావని ప్రజలకు ఆ పార్టీయే చెబుతున్నదన్నమాట… (గిట్టనివాళ్లు బ్లూ మీడియాగా పలుకుతుంటారు)… ఆ చానెళ్లనే ఆపేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆ చానెళ్లకు వైసీపీ చానెళ్లుగా ముద్ర వేస్తున్నదన్నమాట… మొత్తానికి ప్రజలకు ఓ క్లారిటీ ఇస్తున్నారన్నమాట… శుభం..!!
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని మూసివేయించడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు… తరువాత జగన్ వచ్చాక ఈనాడు ఆర్థికమూలాల్లోకి వెళ్లి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించాడు… మార్గదర్శిని టార్గెట్ చేశాడు… ఏకంగా దివంగత రామోజీరావునే లిఫ్ట్ చేయాలనుకున్నాడు… ఆంధ్రజ్యోతి, టీవీ5 లకు సంబంధించి ఏం చేశాడో క్లారిటీ లేదు గానీ… మరిప్పుడు చంద్రబాబు సాక్షిని మళ్లీ టార్గెట్ చేస్తాడా..? లేక సాక్షితోపాటు సదరు ఆ 3 అదనపు చానెళ్ల మీద కూడా కోపం చూపిస్తాడా..? ఏం చేస్తాడు..? కాలం జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఇది..!!
Share this Article