.
అటు తిరిగి ఇటు తిరిగి దుమ్ముదుమారం ఇప్పుడు ప్రవచనకారుడు, అవధాని గరికపాటి మీదకు మళ్లింది… అదేనండీ… మొన్న, నిన్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినెవా తిరుమలలో తలనీలాలు ఇచ్చింది కదా… దాని మీద రచ్చ మొదలైంది… అవుతుంది కదా, ఏపీ పాలిటిక్స్ అంటే అంతే…
దేన్నయినా రచ్చ చేయగలవు ఆంధ్రా పాలిటిక్స్… సరే, విషయానికొస్తే… తన కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్నాడు… ఆ దేవుడికి తన మొక్కు వల్లే తన కొడుకు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని ఆమె విశ్వాసం…
Ads
అందుకని సింగపూర్ నుంచి రాగానే తిరుమలకు వెళ్లింది, తలనీలాలు ఇచ్చింది, తను క్రిస్టియన్ కాబట్టి టీటీడీ రూల్స్ గౌరవిస్తూ డిక్లరేషన్ ఇచ్చింది… అన్నప్రసాదం కోసం 17 లక్షలు ఇచ్చింది… భక్తులకు వడ్డించింది… అందరిలాగే తనూ అన్నప్రసాదం స్వీకరించింది…
జగన్ తన సతీమణితో ఎప్పుడైనా వెళ్లాడా…? డిక్లరేషన్ ఇచ్చాడా..? నిజమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించాడా..? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి… కాసేపు ఆ విమర్శలు, సమాధానలను పక్కన పెడదాం… ఆమె తన విశ్వాసాన్ని, తన భక్తిని ప్రదర్శించడాన్ని తప్పుపట్టే పని లేదు… పైగా ఆమె వెంకటేశ్వర స్వామి పట్ల కనబరిచిన భక్తిశ్రద్ధలను స్వాగతిద్దాం…
ఇప్పుడు కొత్త రచ్చ ఏమిటంటే..? అసలు ఆడవాళ్లు తలనీలాలు ఇవ్వొచ్చా..? ఇదీ ప్రశ్న… కొందరు గరికపాటి పాత ప్రవచన వీడియో ఒకటి వైరల్ చేయడంతో ఇది మొదలైంది…
ఆయన చెప్పేది ఏమిటంటే..? ‘‘ఆడవాళ్లు ముత్తయిదువులుగా ఉన్నప్పుడు, అంటే భర్త ఉన్నప్పుడు తలనీలాలు ఇవ్వకూడదు… భర్త చనిపోతే శిరోముండనం చేస్తారు, సో, దేవుడికైనా తలవెంట్రుకలు ఇవ్వకూడదు’’… సరే, అది తన అభిప్రాయం…
ఇప్పుడు అన్నా లెజినెవా తలనీలాలు ఇచ్చింది కదా, ఇక పాత ప్రవచనాన్ని బయటపెట్టి, అది తప్పు అంటున్నారు కొందరు… దాన్ని కౌంటర్ చేస్తున్నారు జనసైనికులు…
నిజానికి ఆడవాళ్లు గుండు చేయించుకోవడం అనేది అన్ని దేవస్థానాల దగ్గర కనిపించేదే… తమ కోరికలు నెరవేరితే తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు… అది ఎంతోకాలంగా అందరమూ చూస్తున్నదే… ఎవరి విశ్వాసం వాళ్లది… దేవుడికి ఏమిచ్చినా అందులో తప్పులేదు… పద్దతిరాహిత్యమూ కాదు…
(గతంలో బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ భేటీలో చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం, ఎప్పటిలాగే నాగబాబు నోరుపారేసుకున్న వివాదం గుర్తుంది కదా… ఆనాటి నుంచీ గరికపాటికీ జనసేనకూ నడుమ ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది…)
పనిలోపనిగా గతంలో కేసీయార్ భార్య శోభ కూడా తలనీలాలు ఇచ్చిన ఉదాహరణ చెప్పుకొస్తున్నారు… (2023 అక్టోబరులో)…
వాస్తవానికి ఈ రచ్చ అనవసరం… తిరుమలలో రోజూ వందలమంది మహిళలు తలనీలాలు ఇస్తారు… మహిళా క్షురకులు కూడా ఉన్నారు… నిజంగానే మహిళలు గుండు చేయించుకోవడం తప్పే అయితే తిరుమల పండితులు, ఆగమ శాస్త్ర నిపుణులు ఊరుకునేవారా..?
అన్ని దేవస్థానాల వద్ద మహిళలు తలనీలాలు ఇస్తూనే ఉన్నారు కదా… తప్పు అనడంలో గరికపాటికి తన సమర్థన తనకు ఉండవచ్చుగాక… కానీ మహిళల భక్తిని, విశ్వాసాన్ని వద్దనడానికి మనం ఎవరం..?!
Share this Article