మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల మాటేమిటి..?
అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ ఇచ్చింది… వుమెన్ కమిషన్ నోటీసు ఇచ్చింది… ఇక లాభం లేదని నిన్న చాలామందితో రాఖీలు కట్టించుకుని, (అదేదో జూనియర్ సినిమాలో కట్టుకుంటాడు కదా, అలా…) కవిత లేని లోటు తెలుస్తోందంటూ ఎమోషనల్ ట్వీట్ ఏదో పెట్టాడు… తను బస్సుల్లో లేడీస్ డాన్సుల మీద చేసిన వ్యాఖ్యను కౌంటర్ చేస్తూ టీపీసీసీ నిన్న ఆర్టీసీ బస్సులో ఓ గర్భిణికి పురుడు పోసిన ఫోటో పెట్టి మీమ్స్‌తో దాడి చేసింది…
ఇది సద్దుమణగనే లేదు… తాజాగా మరొకటి… సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచనను రేవంత్ రెడ్డి విరమించుకోవాలి, లేదంటే మా ప్రభుత్వం వచ్చాక తొలగిస్తాం అనే హెచ్చరిక… అంతేకాదు, తమ క్యాంపు పాత్రికేయులు, మేధావులు, జర్నలిస్టులు, కళాకారులు అంటూ కొందరు పేర్లలో రాహుల్‌గాంధీకి ఓ బహిరంగ లేఖ రాయించారు… (నమస్తేను ఎవరూ చదవరు కాబట్టి నమస్తేను మించిన పింక్ సాక్షిలో పబ్లిష్ చేయించినట్టున్నారు…)
Ads
ఓ మిత్రుడు అడిగాడు… సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏమిటి సార్ అని..! ఏమాత్రం సంకోచం లేకుండానే చెబుతున్నాను… సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ఆలోచన సరికాదు… సరే, తన పాలనకాలంలో తెలంగాణతల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు మరి అనే ప్రశ్నను పక్కన పెడితే… అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అనేది తెలంగాణ సమాజానికి ఎక్కడో కలుక్కుమనిపించేది… దాన్ని తెలంగాణ పాజిటివ్‌గా తీసుకోదు…
ఇదేదో ఆ నెహ్రూ కుటుంబానికి విధేయతా ప్రకటన తప్ప రాజీవ్ విగ్రహ స్థాపనలో సమంజసత్వం కనిపించదు… తెలంగాణ ఇచ్చింది సోనియా, అక్కడి వరకూ వోకే, కానీ తెలంగాణకు రాజీవ్‌ను ప్రత్యేకంగా గుర్తుంచుకునే జ్ఞాపకాలు ఏమీ లేవు… పైగా గరీబోళ్ల తెలంగాణ బిడ్డ అప్పటి సీఎం అంజయ్యను అవమానించిన తీరు ఇప్పటికీ పచ్చి చేదు జ్ఞాపకమే… ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధేయతా ప్రకటనకు రాజీవ్ విగ్రహం ఏర్పాటును సంకల్పిస్తే దానికి నగరంలోనే బోలెడు ప్రాధాన్య స్థలాలున్నాయి…
పోనీ, కేసీయార్ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఆ రాజమాత రూపంలోని తెలంగాణ తల్లి విగ్రహం బదులు… రేవంత్ రెడ్డి ఆలోచనల్లో నుంచి పుట్టిన సగటు తెలంగాణ పోరాట మహిళ విగ్రహమే పెట్టండి…! అదే సచివాలయం ఎదుట పెడితే… తెలంగాణ ఉద్వేగాలను గౌరవించినట్టూ ఉంటుంది… ఈ ఉద్వేగాలను రాజకీయాలకు వాడుకోవాలనుకునే బీఆర్ఎస్ ఆలోచనలకూ విరుగుడుగానూ ఉంటుంది… బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డే కొన్ని అవకాశాలు ఇస్తున్నట్టుంది చూడబోతే..,!!
.
అప్ డేట్… :: కేటీయార్ గ్రూపు అడుగులకు రేవంత్ తన మార్క్ కౌంటర్ పడేశాడు… సచివాలయం ఎదుట దేనికి..? ఏకంగా సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించాడు, స్థల పరిశీలన చేశాడు… ఊరుకోడు కదా.., సచివాలయం ఎదుట స్థలంలో మీ డాడీ కేసీయార్ విగ్రహం పెట్టాలని ఆలోచిస్తున్నావా..? రాజీవ్ విగ్రహం తీసేస్తానంటున్నావు, నువ్వెలాగూ అధికారంలోకి మళ్లీ వచ్చేది లేదు, ఐనా ఓసారి విగ్రహాన్ని టచ్ చేసి చూడు… అని రవితేజ రేంజులో హెచ్చరిక జారీ చేశాడు…!!
Share this Article