.
ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త ఇది… ఓసారి చదవండి…
.
Ads
న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి. అవును, మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా… సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేకపోవడంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. ఇన్నాళ్లూ న్యాయ దేవత రెండు చేతుల్లో.. కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ మార్పులుచేర్పులు చేసింది. అయితే ఇన్నాళ్లూ న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం, చేతిలో ఖడ్గం ఉంచడం వెనక కారణం లేకపోలేదు…
చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు” అనే సందేశమిచ్చేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కడతారు. ఇక.. చేతిలో ఉంచే ఖడ్గం విషయానికొస్తే.. అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు ఇలా న్యాయదేవత విగ్రహం చేతిలో ఖడ్గాన్ని ఉంచారు.
ఇంత గొప్ప అర్థం ఉన్నప్పుడు మరి న్యాయదేవత విగ్రహంలో మార్పులు ఎందుకు చేశారనే సందేహం కలగడం సహజం. బ్రిటీష్ వలస పాలన ఛాయల నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థ బయటపడాలనే ఉద్దేశంతో పాటు.. చట్టం గుడ్డిది కాదని, రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగానే చూస్తుందని చాటి చెప్పే ఉద్దేశంతో జస్టిస్ చంద్రచూడ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్టు సమాచారం…
చదివారు కదా వార్తను… ఎందుకో గానీ సుప్రీంకోర్టు భిన్నంగా ఆలోచించి ఉండాల్సిందని అనిపించింది… మరీ తెలంగాణ తల్లి రూపంలో మార్పుల్లాగా మార్పులు అవసరమా..? ఒక జనగణమన, ఒక వందేమాతరం, ఒక జాతీయ పతాకం, ఒక అశోకచక్రం, ఒక నాలుగు సింహాల బొమ్మ… ఇలా కొన్ని డైనమిక్‌గా కాదు, స్టాటిక్‌గా అలాగే ఉంచేయడమే బెటరేమో…
త్రాసు, ఖడ్గం, గంతలకు అర్థాలున్నాయి… అఫ్‌కోర్స్, రాజ్యాంగం నిర్దేశించే ప్రతి పౌర హక్కుకు రక్షకురాలిగా మన న్యాయవ్యవస్థ ఉండాలి, అది దాని విద్యుక్తధర్మం… అదేకాదు, మన సొసైటీకి సంబంధించిన దాదాపు అన్ని అంశాల్లోనూ భారతీయ విలువలకు తగిన న్యాయాన్ని కూడా అందించాలి… మన జుడిషియరీ అపెక్స్ బాడీ ఇలాగే ఆలోచిస్తే బాగుండేదేమో… అలాగని ఇప్పుడు చేసిన మార్పులు బాగా లేవని కాదు… బాగున్నాయి… కానీ కొన్ని మార్పులకు అతీతంగానే ఉండాలి…
ఒక ఆకాశవాణి, ఒక దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్లనే మనం మార్చడం లేదు… ఎందుకంటే..? కొన్నింటి యూనిక్‌నెస్ అలాగే ఉండాలి… నిజానికి అవి కాపాడుకోవాలి అలాగే… ఇది ఒక అభిప్రాయం మాత్రమే… మేధోసమాజం అభిప్రాయాలు కూడా తీసుకుంటే మరింత బాగుండేది… గుర్తుంది కదా..? పార్లమెంటు కొత్త భవనం మీద పెట్టిన నాలుగు సింహాలు ఉగ్రరూపం కలిగి ఉన్నాయనీ, మార్చకుండా ఉండాల్సిందనే వాదనలు కూడా వినిపించాయి అప్పట్లో… ఐనా బ్రిటిష్ ఛాయల నుంచి బయటపడాలంటే న్యాయదేవత రూపం కాదు కదా మార్చాల్సింది… న్యాయదేవత చేతిలోని ఖడ్గం హింసకు చిహ్నం కాదు, అది అన్యాయాల పట్ల కఠినంగా ఉంటామనే స్పష్ట సంకేతం…
పార్లమెంటు నిర్దేశించినా సరే, కొలీజయం వ్యవస్థలో మార్పులు, నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు పట్ల మాత్రం మన న్యాయవ్యవస్థ సానుకూలంగా స్పందించదు… జైళ్ల స్థితిగతులు, విచారణ ఖైదీల దురవస్థలు, కేసుల క్లియరెన్సులో సుదీర్ఘ జాప్యాలు, పేదవాడికి న్యాయం వంటివి కదా సీరియస్‌గా ఆలోచించాల్సింది…!!
Share this Article