Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్ బన్నీ… శ్రీచైతన్య యాడ్స్ చేసేటప్పుడు ఇక బహుపరాక్..!!

November 15, 2024 by M S R

.

కోచింగ్ సెంటర్ల మోసాలపై కేంద్రం దృష్టి

అంటే…ఇక-
ఒకటి…ఒకటి…ఒకటి…
అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా?

Ads

అంటే…ఇక-
రెండు…రెండు…రెండు…
అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా?

అంటే…ఇక-
బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో పిల్లలు సూర్యచంద్రుల్లా తారపథంలో వెలుగుతుండగా షారుఖ్ ఖాన్ మురిసి ముప్పందుమయ్యే ప్రకటనలు కనుమరుగవుతాయా?

అంటే…ఇక-
ఆకాష్ ప్రకటన ఆకాశంలో కలిసిపోతుందా?
విరాట్ కోహ్లీ పిల్లల చేత బూస్ట్ తాగించలేడా?
మన ఎర్రచందన పుష్పం ఇంటర్ పిల్లలకు తగ్గేదే ల్యా! అంటూ పాఠాలు చెప్పకూడదా?
క్రికెటర్ రోహిత్ శర్మ ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షల పిల్లలకు ఇన్ఫినిటీ క్లాసులు తీసుకోకూడదా?

శాస్త్రీయంగా రుజువు కాని ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేవారి మీద కూడా చర్యలు తీసుకుంటామని మూడేళ్ళ క్రితమే కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. అలాంటి ప్రకటనలను తయారు చేసినవారు, ఆ ప్రకటనకు మూలమయిన కంపెనీ లేదా సంస్థ వారు అందరూ అందులో ఉన్న ప్రతి అక్షరానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అప్పటి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఉదాహరణకు-
“శ్రీ చైతన్యలో చేరడం వల్లే ఇన్ని వేల మంది మెడిసిన్లో, ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్ లో చేరగలిగారు” అని అల్లు అర్జున్ చెబుతున్న ప్రకటన ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని లక్షల మందికి శిక్షణ ఇస్తే…అందులో నుండి ఎన్ని వందల మంది ఎంపికయ్యారో స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పనప్పుడు ఎంపికయిన వారి నంబర్లు మాత్రమే చెప్పి పిల్లలను ఆకర్షించడం తప్పు అవుతుంది.

ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో ఉన్న అల్లు అర్జున్ కు, శ్రీ చైతన్య యాజమాన్యానికి, ఆ ప్రకటనను అచ్చేసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇవ్వవచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ ప్రకటనలను నిషేధించవచ్చు.

ఆచరణలో సాక్షాత్తు నారాయణుడికే విద్యా చైతన్యం ఇవ్వగలిగిన సంస్థలను మానవమాత్రులయిన ఐ అండ్ బి అధికారులు ఏమి చేయగలరు? అన్న నిర్వేదం, వైరాగ్యం ఉండనే ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు కూడా ఉండి ఉంటాయి.

తాజాగా కోచింగ్ సెంటర్ల ప్రకటనలమీద కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

1. విజేతలైన అభ్యర్థుల అనుమతి లేకుండా ప్రకటనల్లో ఫోటోలు వాడకూడదు.
2. ప్రకటనలో ఉన్న సెలెబ్రిటీలు కూడా ఆ ప్రకటనకు బాధ్యత వహించాలి.
3. అధ్యాపకుల విద్యార్హత, అనుభవం, ఫీజులు, వసతుల వివరాలను తెలియజేయాలి.
4. యాభై మందికి మించి అభ్యర్థులున్న అన్ని కోచింగ్ సెంటర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
5. కోచింగ్ సెంటర్ల మోసాలను బట్టి శిక్షగా మొదట జరిమానాలు విధిస్తారు. అయినా నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే చివరికి కోచింగ్ సెంటర్ ను మూసేస్తారు.

ఆచరణలో ఇవన్నీ అమలవుతాయో లేదో కానీ…కనీసం- చర్చ అయినా జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రకటనలకు అడ్డు కట్ట వేయకపోతే…సరస్వతికి తామే అ ఆ ఇ ఈ లు దిద్దించామని, బృహస్పతికి తామే హోమ్ ట్యూషన్ చెప్పామని, సూర్యుడికి తామే వెలుగులు పంచామని, నదికి తామే నడకలు నేర్పామని…ఇంకా అదని…ఇదని…ఏది చెప్పినా మనం గంగిరెద్దుల్లా తలలూపాల్సి ఉంటుంది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions