.
హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పదవీకాలం ఇక్కడ ముగిసింది… నిన్న మంత్రి శ్రీధర్‌బాబు ఓ వెయిటింగ్ హాల్ ప్రారంభించాడు, అప్పుడే ఆమెకు ఓ చేనేత చీరను బహూకరించి, ఆత్మీయంగా వీడ్కోలు పలికాడు…
మరోవైపు హైదరాబాద్‌కు కొత్తగా వస్తున్న కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌కు వాషింగ్టన్ డీసీ, యూఎస్- ఇండియా సాలిడారిటీ మిషన్ అక్కడే ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘన ఆత్మీయ స్వాగతం పలికింది… ఇంట్రస్టింగు… ఇలాంటివి ఖచ్చితంగా సత్సంబంధాలు, మర్యాదల కోణంలో అవసరం… ఉపయుక్తం…
Ads
యుఎస్-ఇండియా సాలిడారిటీ మిషన్ వ్యవస్థాపకుడు, ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) సహ వ్యవస్థాపకుడు రవి పులి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక స్వాగత భోజన కార్యక్రమం జరిగింది… ఇందులో హైదరాబాద్‌కు కొత్తగా నియమితులైన అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ నమ్మకం, సాంకేతికత, ప్రతిభ మార్పిడి అంశాలపై దృష్టి పెట్టే దౌత్య వ్యూహాన్ని వివరిస్తూ మాట్లాడింది…
ఈ కార్యక్రమంలో ప్రముఖ భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, విధాననిర్ణేతలు, ట్రేడ్ బాడీలు, థింక్ ట్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు… ప్రధానంగా తెలుగువాళ్లు… తన ప్రసంగంలో లారా విలియమ్స్ మాట్లాడుతూ… “సైబర్ భద్రత ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, వినియోగదారుల మధ్య నమ్మకానికి సంబంధించి కీలకం… డాన్విల్, వర్జీనియాలో మేం సైబర్ వారియర్లను తయారుచేయగలిగితే, తెలుగు రాష్ట్రాల్లో మేమెంత సాధించగలమో ఊహించండి…”
‘‘కృత్రిమ మేధస్సు (AI), సైబర్‌సెక్యూరిటీ, బయోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి… హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలకు నిలయం… ఇంకా చాలా అభివృద్ధికి స్కోప్ ఉంది… విదేశాంగ శాఖలో నియామకాల పునరుద్ధరణలో తాత్కాలిక జాప్యం కారణంగా మాత్రమే వీసాల్లో ఆలస్యం జరుగుతున్నది…’’
‘‘హైదరాబాద్‌లోని మా కొత్త కాన్సులేట్‌లో 54 వీసా కౌంటర్లు ఉన్నాయి — ఆధునిక సదుపాయాలతో… కానీ అన్ని కౌంటర్లకు సరిపడా ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగులు కావల్సి ఉంది… ఆటోమేషన్, AI ద్వారా వీసా ప్రక్రియను ఇంకా సరళతరం చేయాలనుకుంటున్నాను…
ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన ఆతిథ్యం, చూపిన ఆత్మీయతను మరిచిపోలేను… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వంటకాలను ఆస్వాదించాను… నాకు ఇండియాతో అనుబంధం ఉంది… నా 13వ ఏట భారత్‌కు నా మొదటి సందర్శన… తరువాత హిందీ నేర్చుకుని, రాజస్థాన్‌లో బయోగ్యాస్‌పై పరిశోధన చేశాను… ఇప్పుడు నా భర్త, కుమారుడితో కలిసి ఇక్కడ సేవ చేయాలన్న కల ఇలా నెరవేరింది…” అంటూ ఇండియాతో తన బంధాన్ని గుర్తుచేసుకుంది…
రవి పులి మాట్లాడుతూ… “లారా విలియమ్స్‌కు అనుభవం, అనుబంధం రెండూ ఉన్నాయి… అదొక ప్రత్యేకత… ఆమె మా భారతీయ- అమెరికన్ అభిలాషలను అర్థం చేసుకుంటున్నారు… రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య ఒక బ్రిడ్జ్‌లా ఉండాలని మేము కోరుకుంటున్నాం…’’
‘‘ఆమె టయర్-2 పట్టణాల్లో పాల్గొనాలన్న ఉద్దేశాన్ని చెప్పారు, అది ప్రశంసనీయం… మాలో ఇక్కడికి చాలా మందిమి చిన్న పట్టణాల నుండే వచ్చాం… భారతదేశంలో ఉచిత విద్యను పొందాం… ఇప్పుడు అమెరికాలో స్థిరపడి, తిరిగి మా ప్రాంతాలకు సేవ చేయాలనుకుంటున్నాం… లారా సెమీ-అర్బన్ వైపు ఆలోచన, సంకల్పం మాకు మరింత బలాన్ని ఇస్తోంది…” అనేది తన ప్రసంగ సారాంశం…
ఈ సమావేశానికి అంతరిక్ష, రియల్ ఎస్టేట్, ఉన్నత విద్య, క్లీన్ టెక్, ఔషధ రంగాల నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు… వారిలో చాలామందికి దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలు ఉన్నాయి… CII, FICCI, USIBC, భారత దౌత్య కార్యాలయ ప్రతినిధులు, ప్రాంతీయ థింక్ ట్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు… మాజీ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడా కూడా పాల్గొన్నారు…
(IAMBIG గురించి… ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) అనేది అమెరికాలో ఉన్న భారతీయ పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారుల జాతీయ నెట్‌వర్క్… ఇది అమెరికా- భారత సంబంధాలను ఆర్థిక, దౌత్య, సామాజిక రంగాలలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది…)
@USAndHyderabad , #usconsulate
Share this Article