Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

007 కథ ముగిసిపోలేదు – అదుగో కొత్త జేమ్స్ బాండ్ వస్తున్నాడు…

November 17, 2026 by M S R

.

ఇంగ్లిష్ రానీ రాకపోనీ… రెండు సినిమాల్ని విపరీతంగా చూసేవాళ్లం కదా… 1) జేమ్స్ బాండ్ 007… 2) జాకీ చాన్… ప్చ్, ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన జేమ్స్ బాండ్ సిరీస్ ఇక ముగిసిపోయినట్టే అనిపించింది. ముఖ్యంగా డేనియల్ క్రెయిగ్ నటించిన స్కైఫాల్ తర్వాత బాండ్ ప్రయాణం ముగిసిపోతుందేమో అనుకున్నవాళ్లు చాలామందే.

ఆ తర్వాత మరో రెండు సినిమాలు వచ్చినా, డేనియల్ క్రెయిగ్ చివరి సినిమా *నో టైమ్ టు డై*లో జేమ్స్ బాండ్ పాత్ర చనిపోవడంతో ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై మరింత ఆసక్తి, సందేహం ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్లీ 007 పునర్జన్మ ఎత్తుతున్నాడు. ఈసారి బాండ్‌గా వస్తున్నది ఎవరో కాదు… ఇప్పటికే బ్యాట్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్ ప్యాటిన్సన్!

Ads

అవును… తదుపరి జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్‌ను ఎంపిక చేసినట్టు అమెజాన్ MGM స్టూడియోస్ నవంబర్ 16న అధికారికంగా ప్రకటించింది. దీంతో కొత్త బాండ్ ఎవరు అనే కొన్ని సంవత్సరాల ఉత్కంఠకు తెరపడింది.
jamesbond new

బ్యాట్‌మన్ నుంచి జేమ్స్ బాండ్ వరకు! ప్యాటిన్సన్ ప్రయాణం ఆసక్తికరమైనది. హ్యారీ పోటర్ సినిమాతో చిన్న వయసులోనే ప్రేక్షకులకు పరిచయమైన అతను, ఆ తర్వాత ట్విలైట్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. అయితే ఆ ఇమేజ్‌కే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా తన పరిధిని విస్తరించుకున్నాడు.

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన టెనెట్, ది లైట్‌హౌస్, మిక్కీ 17 వంటి సినిమాలతో తనలోని మరో నటుడిని పరిచయం చేశాడు. 2022లో *ది బ్యాట్‌మన్*గా తెరపై కనిపించి సూపర్‌హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇప్పుడు మరో ఐకానిక్ పాత్ర అతడిని వెతుక్కుంటూ వచ్చింది. బాట్‌మన్‌గా చీకట్లో నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించిన ప్యాటిన్సన్, ఇక ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈసారి బాండ్ వెనుక ఉన్నది మరో భారీ టీమ్! ఈ కొత్త జేమ్స్ బాండ్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది సాధారణ దర్శకుడు కాదు. డ్యూన్, బ్లేడ్ రన్నర్ 2049, అరైవల్ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన డెనిస్ విలెన్యువ్.

స్క్రీన్‌ప్లే బాధ్యతలు పీకీ బ్లైండర్స్ సృష్టికర్త స్టీవెన్ నైట్‌కు అప్పగించారు. అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంటే నటుడి ఎంపిక దగ్గర్నుంచి దర్శకుడు, రచయిత వరకు ఒక బలమైన టీమ్‌ను సిద్ధం చేశారు.

2025లో జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీపై సృజనాత్మక నియంత్రణను అమెజాన్ MGM సొంతం చేసుకుంది. దశాబ్దాలుగా ఈ సిరీస్‌ను నడిపించిన బ్రోకలీ కుటుంబం నుంచి బాధ్యతలు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు కొత్త నటుడు, కొత్త దర్శకుడు, కొత్త రచయితతో బాండ్‌కు సరికొత్త రూపం ఇవ్వబోతున్నారు.

 

  • ఒకేసారి బ్యాట్‌మన్, బాండ్!  ప్యాటిన్సన్ ప్రస్తుతం ది బ్యాట్‌మన్ పార్ట్ 2లో కూడా నటిస్తున్నాడు. కొత్త జేమ్స్ బాండ్ సినిమా చిత్రీకరణ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విడుదల 2028లో ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఒకే ఏడాది బ్యాట్‌మన్‌గా, జేమ్స్ బాండ్‌గా రెండు ఐకానిక్ పాత్రల్లో ప్యాటిన్సన్‌ను చూడొచ్చు.

సీన్ కానరీ నుంచి జార్జ్ లేజెన్‌బీ, రోజర్ మూర్, తిమోతి డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ వరకు ఆరుగురు నటులు జేమ్స్ బాండ్ పాత్రకు తమదైన ప్రత్యేకతను జోడించారు. ఇప్పుడు ఏడో నటుడిగా ప్యాటిన్సన్ ఆ వారసత్వాన్ని కొనసాగించబోతున్నాడు.

బాండ్ అంటే కేవలం సూటు, గన్, మార్టినీ గ్లాస్ కాదు. ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, చతురత, ప్రమాదాన్ని ఎదుర్కొనే తెగువ, మహిళలను ఆకర్షించే చార్మ్… ఇవన్నీ కలిసిన పాత్ర. డేనియల్ క్రెయిగ్ బాండ్‌కు కాస్త రఫ్‌నెస్, ఎమోషనల్ డెప్త్ తీసుకొస్తే, ప్యాటిన్సన్ ఎలాంటి బాండ్‌ను ఆవిష్కరిస్తాడో చూడాలి.

బ్యాట్‌మన్ చీకటి నుంచి 007 రహస్య ప్రపంచంలోకి... ప్యాటిన్సన్ కొత్త ప్రయాణం మొదలైంది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 007 కథ ముగిసిపోలేదు – అదుగో కొత్త జేమ్స్ బాండ్ వస్తున్నాడు…
  • మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భేటీలు!- సుప్రియా సూలేకు పగ్గాలు?
  • రామోజీ స్మరణ సరే… కానీ ఎవరి జయంతి రాష్ట్ర ఉత్సవం కావాలి..? కొలమానాలేమిటి..?
  • బన్నీ రికార్డు బద్దలు… ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ సంచలనం!
  • మరో రంగంలో సైబర్ చిక్కులు- అన్నీ వరుసగా… ఏం జరుగుతోంది?
  • బామ్మా అన్నపూర్ణమ్మా… ఏమిటమ్మా ఇది..? ప్చ్, బాగోలేదు సుమీ!!
  • ఎంగిలి వార్తలకూ ఓ పద్ధతి ఉంటుంది డియర్ కేసీయార్ సర్..!!
  • కమెడియన్ సద్దాం నిజంగా ఘంటసాలను అవమానించాడా..?!
  • మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!
  • ఎన్టీఆర్ ఓడి- కృష్ణ గెలిచి… రెండు సింహాల నడుమ నలిగిన గిరిబాబు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions