చాలా రోజులుగా వింటున్నదే, చదువుతున్నదే ఇది … ఏమిటంటే… ‘‘రవిప్రకాష్ మళ్లీ తెర మీదకు రాబోతున్నాడు… తనదైన చానెళ్లతో, డిజిటల్ మీడియాతో పలు భాషల్లో ప్రవేశిస్తున్నాడు..’’ ఇవీ ఆ పలు వార్తల సారాంశం..! ఇప్పుడు మళ్లీ కొన్ని వార్తలు కనిపిస్తున్నయ్… ‘‘ఫిబ్రవరి 20న లాంచ్… ఏడు ప్రాంతీయ భాషల్లో రంగప్రవేశానికి అంతా రెడీ… మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్, సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ సంస్థల అండదండలతో ఈ మీడియా సంస్థ పలకరించబోతోంది..’’ ఇవీ తాజా వార్తల సారాంశం..!!
మళ్లీ అధికార వ్యవస్థతో ఓ మీడియా బలమైన పోరాటాన్ని చూడబోతున్నామా..? ఎందుకంటే… కేసీయార్ మీడియా పట్ల వ్యవహరించే ధోరణి వేరు… ఇదే రవిప్రకాష్ టీవీ9 చానెల్ క్రయవిక్రయాలకు సంబంధించి మై హోం గ్రూపుతో తలపడినప్పుడు కేసీయార్ మై హోంకు పూర్తి మద్దతు ఇచ్చాడు… సరే, మై హోంకూ, కేసీయార్‌కూ నడుమ ఉన్న గాఢమైన సత్సంబంధాలు అందరికీ తెలిసినవే… చివరకు రవిప్రకాష్ టీవీ9 వదిలేసి, తను సమాంతరంగా క్రియేట్ చేసి పెట్టుకున్న మోజో టీవీని కూడా వదిలేసి బయటికి రావల్సి వచ్చింది…
Ads
తరువాత రకరకాల వార్తలు… కొన్నాళ్లు రాజ్ న్యూస్ వ్యవహారాలు చూశాడు… ఒకటీరెండు చానెళ్లను టేకోవర్ చేస్తున్నట్టు విన్నాం… సొంత చానెళ్లే రాబోతున్నయ్ అనీ విన్నాం… చానెళ్ల పేర్లేమిటో, అండగా ఉన్న ఆర్థిక సంస్థలేమిటో కూడా తెలియరాలేదు… చాలారోజులుగా ఆ వార్తలు కూడా ఆగిపోయాయి… ఇప్పుడు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి ఆ వార్తలు… కాకపోతే కీలకసమాచారం కాన్ఫిడెన్షియల్‌గా మెయింటెయిన్ చేస్తున్నారు… అయితే రాష్ట్రంలో ఈనాడు, సాక్షి వంటి బలమైన పెద్ద మీడియా సంస్థలే కేసీయార్ జోలికి పోకుండా సంయమనం పాటిస్తున్నయ్… ఆంధ్రజ్యోతి కథ వేరు… టీవీ5, ఎన్టీవీ తదితర చానెళ్లూ సరేసరి… తెలంగాణలో మీడియా స్థూలంగా కేసీయార్ చెప్పుచేతల్లో ఉంది… నడుస్తోంది… కాదు, భయభక్తుల్లో ఉంది… బీజేపీ అనుకూల ఒకటీరెండు చానెళ్లు, పత్రికలున్నా సరే, వాటిది కేసీయార్‌తో అర్ధమనస్క పోరాటమే…
ఈ స్థితిలో రవిప్రకాష్ చానెళ్లు వస్తే… వాటి రీచ్, అవి సాధించబోయేది ఏమిటనే చర్చ పక్కన పెడితే… టీఆర్ఎస్‌తో ఘర్షణ ఎలా ఉండనుందనేది ఇంట్రస్టింగ్… రవిప్రకాష్ జీహెచ్ఎంసీ ఎన్నికల కాలంలో బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నాడు, బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి… అయితేనేం… బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు ఢిల్లీలో ఏం లేకపోయినా, రాష్ట్రంలో కొనసాగుతుంది… ఈ నేపథ్యంలో రవిప్రకాష్ చానెళ్లు వస్తే మీడియా వార్ తప్పేట్టు లేదు… అయితే ఉత్తుత్తి హైప్ క్రియేషన్ సాగుతోందా..? నిజంగానే రవిప్రకాష్ బలంగానే తెరమీదకు వచ్చి సై అంటాడా వేచి చూడాలి… కేసీయార్ క్యాంప్ స్పందించే తీరు ఏమిటో కూడా చూడాల్సిందే…! కొందరు సిబ్బందిని ఎంపిక చేసుకుని శిక్షణ కూడా ఇచ్చారని, ఇంకా ఫీల్డ్ స్టాఫ్ ఎంపిక పూర్తికాలేదని అంటున్నారు..!!
Share this Article