తుంటను ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టుంది… అని ఓ సామెత… అంటే చిన్న దుంగను కింద పారేసి, పెద్ద చెట్టు మొద్దును ఎత్తుకుని భరిస్తున్నట్టు..! వరుసగా జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఓ మేధావిని అభిప్రాయం అడిగితే, తను వ్యక్తం చేసిన సింపుల్ వాక్యం అదీ..! హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు తొలగించి, వైఎస్ఆర్ పేరు పెట్టాలనే నిర్ణయం కూడా అలాంటి అనేక నిర్ణయాల కోవలోనిదే… జగన్ రాజనీతిజ్ఞుడు కాదు, భవిష్యత్తులో అవుతాడే లేదో తెలియదు… కానీ ఇప్పుడు మాత్రం జస్ట్, చంద్రబాబులాగే ఓ రాజకీయ నాయకుడు మాత్రమే అని పదే పదే నిరూపించుకుంటున్నాడా..?
తన ప్రతి అడుగులోనూ కనిపించేది అదే… అమరావతి, పోలవరం వంటి కీలకాంశాలతోపాటు పరిపక్వత కనిపించని అనేక పాలనాంశాలు… లెక్కకుమిక్కిలి సలహాదార్లు, అనేకానేక కార్పొరేషన్లు, ఆ పదవుల పందేరం, అప్పులు తెచ్చి వేల కోట్ల పందేరం, భవనాలకు పార్టీ జెండా రంగులు… ఇవే కాదు, పథకాలకు పేర్లు, పేర్ల మార్పులు కూడా..! ఇప్పటికిప్పుడు వైఎస్ పేరు మీద, జగన్ పేరు మీద ఎన్ని పథకాలు అమలులో ఉన్నాయని అడిగితే జగన్ కూడా చెప్పలేడు… పక్కా…
మరి రేప్పొద్దున జగన్ బదులు, చంద్రబాబు బదులు, తెలుగు ప్రజల గ్రహచారవశాత్తూ మరో కులం నేత సీఎం అయితే…? ఇదొక చిక్కు ప్రశ్న… ఏపీ రాజకీయాల్లో కులమే ప్రధానం కాబట్టి… ఎన్టీయార్, వైఎస్ఆర్ పేర్లన్నీ తీసేసి, ఇంకెవరో తమ కులబాంధవుడి పేర్లను పెట్టేస్తాడా ఆ కొత్త సీఎం..!? వాళ్లు ఎన్టీయార్ పేరు పెట్టేవాళ్లు, ఈయన వైఎస్ పేరు పెట్టేస్తున్నాడు, ఆరోగ్యశ్రీకి ఎన్టీయార్ పేరు తగిలించలేదా..? జగన్ దాన్ని తీసేసి, వైఎస్ఆర్ పేరు పెట్టాడు, ఈ నిర్నయాల్లో తప్పేముంది అన్నాడు మరో విశ్లేషకుడు… సో, వాళ్లు చేశారు కాబట్టి వీళ్లు చేసినా తప్పులేదా..? ఈ తప్పులకు ఆమోదయోగ్యత వచ్చేసినట్టేనా..?
Ads
ఆయనే సరిగ్గా ఉంటే, ఈయన గద్దెనెక్కే అవసరం ఎందుకొచ్చేది..? ఇది మరో అభిప్రాయం… అంటే చంద్రబాబే సరిగ్గా పాలించి ఉంటే, జగన్‌కు చాన్స్ ఎందుకు దక్కేది అని అర్థం… ఇంకా విస్తృతార్థంలో తీసుకోవాలనుకుంటే… ఆ కులమే సక్కగా పాలిస్తే, ఈ కులం ఎందుకు గద్దెనెక్కేది..? అని లోతైన అర్థం… ఇలా పథకాలకు, యూనివర్శిటీలకు పేర్లు మార్చడం దేనికి..? రాష్ట్రానికే వైఎస్ పేరు తగిలిస్తే పోలా..? అన్నాడు మరొకాయన… ఇది వెటకారం కాదు, జగన్ నిర్ణయాల మీద అల్టిమేట్ ఒపీనియన్…
అవునూ, రాజధానిపై రాష్ట్రానిదే అంతిమనిర్ణయం అంటుంటారు కదా కేంద్ర పెద్దలు… రాష్ట్రం పేరును ఇలా నిజంగానే మార్చుకునే అవకాశం ఉందా అధ్యక్షా… ఈ చిన్న చిన్న పేర్ల మార్పిడి బదులు అది చాలా బెటర్ కదా… సీరియస్‌లీ… రేప్పొద్దున ఇంకెవరో వేరే కులపాయన గద్దెనెక్కితే అప్పుడు మళ్లీ పేర్ల మార్పిడి ఉద్యమం తప్పదా..? హతవిధీ…
ఇప్పుడు హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తున్నారు కదా… దాని ఏర్పాటు క్రెడిట్ ఎన్టీయార్‌దే కాబట్టి ఆయన పేరు పెట్టారంటే ఓ అర్థముంది… కానీ వైఎస్ పేరు పెట్టడానికి జస్టిఫికేషన్ ఏముంది..? అన్న క్యాంటీన్లపై దాడులు చేయిస్తే, కక్షసాధిస్తే ఏమొస్తుంది అనే ప్రశ్నకు జవాబు ఉండదు… సేమ్, యూనివర్శిటీ పేరు మార్పిడి దేనికి అనే ప్రశ్నకూ సరైన జవాబు దొరకదు… ఐనా అడిగేవాళ్లెవరు..? జనం నమ్మదగిన ఇంకో ప్రత్యామ్నాయం ఎవరున్నారు..? అది కదా అసలు విషాదం..?! ‘‘వైఎస్ వైద్యసంస్కరణకర్త కాబట్టి ఆయన పేరు పెడుతున్నాం’’ అనేది జగన్ జవాబు… నవ్వొచ్చేలా ఉంది…!!
Share this Article