.
‘తెలంగాణా తల్లి’ విగ్రహం మీద కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నా ఉద్దేశ్యంలో
.. ప్రతీ పౌరుడికి తమ తమ అభిప్రాయం చెప్పే స్వాతంత్య్రం ఉంది.
Ads
.. కానీ, ప్రభుత్వం చేసి ప్రతీ పనిని, రాజకీయ పార్టీల దృక్కోణంలో చూసి విమర్శించకూడదు.
.. ఉద్యమ సమయంలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని రూపొందించినప్పుడు, ఆ ఉద్యమంలో గెలిచి స్వరాష్ట్ర స్వప్నం ఫలించడానికి, మానవ పోరాటంతో పాటు దైవశక్తి కూడా అవసరం అని, తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఒక దేవత రూపంలో రూపొందించారు. అందుకే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవతలను పోలిన విధంగా రూపొందించారు. వారందరూ ఏకమై దీవించి, తరతరాల తెలంగాణా ప్రజల ప్రగాఢమైన పోరాట ఫలితాన్ని ప్రసాదించారు.
ఆ అవతారం అక్కడితో సమాప్తం.
.. అప్పటి తెలంగాణా తల్లిలో కొందరి మహిళా రాజకీయ నాయకుల పోలికలు ఉన్నాయని, ఆ విగ్రహం ఒంటి నిండా నగలతో ఒక రాచరిక వ్యవస్థకు ప్రతీకగా ఉందని, దేవతలను పూజించడానికి బతుకమ్మ ఆడతాం గాని, దేవతలే బతకమ్మ ఆడరని కొన్ని వాదనలు వచ్చాయి.
ఆ నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వం, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా, తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా మౌలికమైన వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రతిఫలించే విధంగా తెలంగాణా తల్లి విగ్రహాన్ని రూపొందించమని, JNTU శిల్పకళా శాస్త్ర విద్యార్థులను, అక్కడి ఆచార్యులను కోరింది. ఆ ఆలోచనా విధానానికి అనుగుణంగానే, ప్రస్తుతం రూపొందించబడిన తెలంగాణా తల్లి విగ్రహం రూపొందించారు.
నా ఉద్దేశ్యంలో
.. ఇప్పుడు ప్రతిష్ఠించబోయే తెలంగాణా తల్లి విగ్రహమే బావుంది.
.. ఎందుకంటే, ఈ సంవత్సరం తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఒక లక్షా యాభై వేల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. బహుశా ఈ విషయం విగ్రహాన్ని రూపొందిస్తున్నప్పుడు తెలియకున్నా, ఈ ప్రగతికి, ఇప్పుడున్న విగ్రహం ప్రతీకగా నిలుస్తుంది.
.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా, IT పరంగా ఎంత అభివృద్ధి చెందినా, మౌలికంగా మనది వ్యవసాయ రాష్ట్రం. IT లో లక్షలు లక్షలు సంపాదిస్తున్న యువతీయువకులకు, తెలంగాణా పల్లెల్లో ఆరుగాలం శ్రమిస్తున్న యువతీ యువకులకు సంబంధమే లేదు. వారికి వ్యవసాయం జీవనాధారం. హైటెక్ సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఏ సంబంధమూ ఉండదు.
.. బాగా చదువుకుని, కలెక్టరయినా, ఐటీ ఉద్యోగి అయినా, వ్యాపారవేత్త అయినా, పారిశ్రామికవేత్త అయినా, అసలు సిసలయిన తెలుగు ప్రజలు, మానసికంగా గ్రామీణ నేపథ్యంలోనే, ఒక రైతు మనస్సుతోనే ఆలోచిస్తారు. సూటు బూటూ వేసుకున్నా, heart in hearts మన ఆలోచనలన్నీ మధ్య తరగతి, రైతుల్లాంటి మనస్తత్వమే.
.. మన ఆర్థిక ప్రగతికి, పారిశ్రామికాభివృద్ధికి, ఐటీ విప్లవానికి కృషి చేయాల్సిందే. కానీ, దాని వల్ల 60% తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తే, కొంత పథకాల రూపంలో రైతులకు చేరుతుంది. అంతే కానీ, వారి జీవన విధానం ఏం మారదు. లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోరు. బడ్జెటులోని లెక్కలు చూసి పదేళ్ళు మోసపోయారు. ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు.
.. రైతుకు ఎరువులు, పురుగు మందులు, సరైన ధర, సబ్సిడీ ఇచ్చి, సకాలంలో పంట దిగుబడిని కొంటేనే వారింట లక్ష్మీదేవి గలగలలాడుతూ సంతోషాలను వెల్లివిరియ చేస్తుంది. ఆ దిశగా, ప్రస్తుత ప్రభుత్వం సన్న రకాల వడ్లకు 500 రూపాయల అదనపు బోనస్ ఇస్తుంది.
.. ఒక బృహత్తర స్వప్నాన్ని ప్రస్తుత ప్రభుత్వం, రైతుల కోసం వీక్షిస్తుంది.
.. అందుకు మొదటి అడుగే, ఈ నాటి తెలంగాణా తల్లి రూపం.
.. దేవత దీవిస్తుంది.
.. అమ్మ లాలిస్తుంది.
రెండూ అవసరమే. కానీ అమ్మ కొంచెం ఎక్కువ అవసరం. అమ్మను రోజూ చూసినా బోరు కొట్టదు. అమ్మ కోసం ప్రత్యేక పూజలు చేయనవసరం లేదు. అమ్మ మన గుండెల్లో కొలువై ఉంటుంది. అమ్మను మనం అడగకున్నా, బిడ్డ ఆకలిని గమనించి, కడుపు నింపుతుంది. అందుకే అమ్మను ప్రేమిస్తాము. దేవతను పూజిస్తాము.
అసలు దేవత ప్రతిరూపమే అమ్మ కదా? రచన: డాక్టర్ ప్రభాకర్ జైనీ
Share this Article