“చిరుత” వ్యాకరణం… భాష ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఆ భాష మాట్లాడేవారందరి ఉమ్మడి సొత్తు. ప్రవహించేదే భాష అని ఒక పరమ ప్రమాణం ఉండనే ఉంది. నిలువ నీరు మురుగు కంపు కొట్టి తాగడానికి పనికిరాదు. ప్రవహించే నీటిలో ఎంత చెత్త కలిసినా తాగడానికి పనికిరాకుండా పోదు.
భాషాశాత్రవేత్తలు, వ్యాకరణ పండితులు, భాషోత్పత్తి శాస్త్రం చదివినవారే కొత్త మాటలు పుట్టించాలని నియమం లేదు. నిజానికి పండితుల భాష సామాన్యులకు అర్థం కాదు. సామాన్యుల భాషను పండితులు గుర్తించరు. జనమే భాషలో కొత్త మాటలను అలవోకగా పుట్టిస్తారు. హాయిగా వాడేస్తూ ఉంటారు. భాషను ఒకరు కృత్రిమంగా పుట్టించలేరు. బలవంతంగా చంపనూ లేరు.
“ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి? దుషట చతుషటయానికి వెయ్యండి రెండు వీర తాళ్లు” అని మాయాబజార్లో మాటల మాంత్రికుడు పింగళి ఘటోత్కచుడి చేత తడబడిన మాటలకు సన్మానమే చేయించాడు.
Ads
సామాన్యులు పుట్టించిన అనన్యసామాన్యమయిన మాటలకు పెద్దగా ప్రచారం ఉండదు. అంత గొప్ప మాటలను ఏ సామాన్యులు పుట్టించారో కూడా లోకానికి తెలియదు. తెలియాల్సిన అవసరం ఉందని ఆ మంచి మాటలను పుట్టించినవారు అనుకోరు కూడా. అదే ఒక సెలెబ్రిటీ కొత్త మాటలు పుట్టిస్తే…ఇక అది లోకోత్తర భాషావిష్కరణ అయి…మీడియాలో చర్చలే చర్చలు.
దాసరి పోయిన తరువాత సినీపెద్ద సింహాసనం ఖాళీగా ఉంది. అందులో ఒక్కోసారి చిరంజీవి కూర్చున్నట్లు, ఒక్కోసారి కూర్చోనట్లు ప్రవచనాలు చెబుతూ ఉంటారు. తమ్ముడిని కాపు కాయాలి. అలాగని జగన్ తో శత్రుత్వం ఉండకూడదు. ఇలా అంతులేని సంఘర్షణలో జనానికి అర్ధమయినట్లు…కానట్లు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన బాధ ఆయనది. ఆయన భాష ఆయనది.
తాజాగా ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా భాషా శాస్త్రం క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన గారాల పట్టి క్లీమ్ కారను తాత ఎత్తుకున్న ఫోటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ… చిరంజీవి ప్లస్ తాత కలిపి “చిరుత” అన్న కొత్త అర్థాన్ని సాధిస్తూ వ్యాఖ్య కూడా పెట్టారు. ఈనాడు మొదలు మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా నిండా “చిరుత” సందడే సందడి చేస్తోంది.
ప్రాతాది సంధి సూత్రం ప్రకారం- సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్ల లోపం బహుళంగా వస్తుంది. మీదు- కడ మీగడ అవుతుంది. అలాగే చిరు – తాత “చిరుత” అయ్యిందని రామ్ చరణ్ నవీన వ్యాకరణ సూత్రం విప్పి చెబుతున్నారు.
ఈ సరికొత్త సూత్రం ప్రకారం-
చిరు ప్లస్ మామ- చిరుమ
చిరు ప్లస్ బాబాయ్- చిరుబాయ్
చిరు ప్లస్ నాన్న- చిరున్న
చిరు ప్లస్ అత్త- చిరత్త
ఇలా ఈ చిరంతన నవీన నామకరణోత్సవాలు నిరంతరంగా జరుపుకోవచ్చు అని నెటిజెన్లు సరదాగా జోకులేసుకుంటున్నారు.
అయినా… నిజంగా కూడా తెలుగు హీరోలు తాతలయినా, ముత్తాతలయినా…వారి వయసు పట్టుమని పాతికెళ్లే కదా? పాతికేళ్ల పడుచు తాతలు చిరుతలు కాక చిన్నయసూరి తాతలవుతారా యువరానర్?
Share this Article