Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చచ్చినట్టు యాడ్స్ చూడాల్సిందే… కథలోనే కలిపేస్తాం… కొత్త ట్రెండ్…

February 1, 2022 by M S R

ఓ దిక్కుమాలిన తెలుగు సీరియల్ వస్తోంది… ఆ కోడలు ఎప్పుడూ ఆ ఇంట్లో అసలు వంట చేయదు, వంటవాళ్లున్నారు… కానీ హఠాత్తుగా అత్త ఏదైనా మంచి డిష్ చేయి కోడలా అంటుంది… సరే, అత్తమ్మా, ఆలూ ఫ్రై చేస్తాను అని వంటింట్లోకి వెళ్తుంది… అత్తమ్మను ఎలా శాటిస్‌ఫై చేయాలి అనుకుంటుంటే ఐడియా తడుతుంది… వెంటనే MTR గరం మసాలా పాకెట్ కట్ చేసి, ఫ్రై మీద చల్లేస్తుంది… అత్తమ్మ, కోడలు ఇద్దరూ కలిసి సదరు MTR మసాలాల గొప్పతనం గురించి మాట్లాడి, ఫోటో ఫోజు ఇస్తారు…

ఇది కల్పన కాదు, ప్రేమ ఎంత మధురం సీరియల్… సోమవారం ఎపిసోడ్… యాడ్స్ ఎవడైనా ఇస్తాడు, వినియోగదారుడు చచ్చినట్టు చూసేలా యాడ్ చేయించేవాడే గొప్పోడు ఈరోజుల్లో… ఇదీ అంతే… సీరియల్‌లోనే వాణిజ్యప్రకటనను మిక్స్ చేస్తే ఇక కస్టమర్ చూడక చస్తాడా..? ఇక రాబోయే రోజుల్లో చీరలు, నగలు, బూట్లు, ఇంట్లోకి తెప్పించే మటన్ పీసులు, రెడీటుఈట్ ఫుడ్ పార్శిళ్లు, పెయింట్స్, తలనూనెలు, సబ్బులు, వాట్ నాట్… అన్నీ ఇలా సీరియళ్ల కథల్లోనే కలిపికొట్టేస్తే ఇక చూసుకో నాసామిరంగా…

మామూలుగా పత్రికల్లో ఓ వింత యాడ్ పద్ధతి కనిపిస్తుంది అప్పుడప్పుడూ… మొత్తం అష్ట వంకర్లుగా యాడ్ పేస్ట్ చేస్తారు, ఆ వంకర్ల నడుమ అక్కడక్కడా విచిత్రంగా వార్తలు ఇరికిస్తారు… అవి ఏవో చిన్నచిన్న స్పేస్ ఫిల్లింగ్ వార్తలు… ఇక యాడ్ చూడకుండా పేజీ తిప్పేసే పాఠకుడు ఎవడుంటాడు..? టీవీలో సీరియల్ అంటే అరగంట ఎపిసోడ్‌లో చివరి పది నిమిషాలు యాడ్సే… అది అందరికీ తెలుసు… ట్రాయ్ నిబంధనల్ని బొంద పెట్టి మరీ ప్రసారం చేస్తుంటారు… ఆమధ్య కొత్త ట్రెండ్ కనిపెట్టారు…

Ads

సీరియల్ మధ్యలో హఠాత్తుగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కనిపిస్తుంది… దానిపై యాడ్ ఉంటుంది… ట్రాయ్ వాడికి కాదు కదా, వాడి తాతకూ అది యాడ్ అని అర్థం కాదు… డివైడర్ నడుమ యాడ్ బిల్ బోర్డులు కనిపిస్తుంటయ్… రోడ్డు పక్కన హోర్డింగ్ కనిపిస్తుంటుంది… ఎహె, ఇవన్నీ దేనికి అనుకున్నట్టున్నారు… ఇప్పుడిక సీరియల్ కథలోనే కలిపేస్తే సరి… కొన్ని దశాబ్దాల క్రితం సుందరి-సుబ్బారావు అనే సినిమా కావచ్చు బహుశా… సుబ్బారావు రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటాడు… ఆ పరుగు పూర్తయ్యేసరికి రామోజీరావు ఫ్యాక్టరీకి సంబంధించిన హోర్డింగులన్నీ కనిపిస్తయ్… అప్పట్లో సోమ అని కూల్ డ్రింక్ తయారుచేసేవాళ్లు కదా… అది కూడా కనిపిస్తుంది…

అంతకుముందు సినిమాలో ప్రియానందభోజా అంటే ఏమిటి అని ఓ నటితో అడిగించి, ప్రియాపచ్చళ్లతో ఆనందంగా భోజనం చేయడం అని హీరోతో జవాబు చెప్పిస్తారు… అదీ యాడ్స్‌లో కొత్తదనం, నిర్బంధం అంటే… ఈనాడోళ్లు దశాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టారు ఈ ట్రెండ్… ఇప్పుడు మళ్లీ ఊపిరి పోసుకుంటుందన్నమాట… బొంబాయి ప్రియుడు సినిమా కావచ్చు… చంద్రబోస్ ఓ పాట రాశాడు… చందన చీరను కట్టి… బొమ్మన బ్లౌజును చుట్టి… అని పాట… అందులో రేమండ్, రేబాన్, ఐటెక్స్, న్యూ లక్స్, ఎంటీవీ, సోనీ, యమహ, కోల్గేట్ టూత్‌పేస్ట్, రాశి సిమెంట్, సింగార్ తిలకం, సింధూర్, అంబికా దర్బార్, పోలార్ ఫ్యాన్, రిన్, జీవన్‌టోన్, టైటాన్, త్రీరోజెస్, కింగ్ సైజు, గోద్రెజ్ బ్రాండ్లను బ్యాండులా మోగించేశాడు…

సో, ఇకపై టీవీల్లో సీరియళ్ల డైలాగులు రాసేటప్పుడు కూడా వీలైనన్ని బ్రాండ్ల పేర్లు ఉండేలా జాగ్రత్తపడి, అలాగే రాయించి, డబ్బులు వసూలు చేయించి, బాగుపడండి బ్రదర్స్… అడుగడుగునా యాడ్స్ కళ తాండవించాలి… ‘‘భారత్ మాట్రిమోనీలో మ్యాచ్ కుదిరింది వదినా, ఇంకేం కేఎల్ఎం ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం బావగారూ, పదండి మరి లలితా జుయెలరీకి, చీరెలు చెన్నై సిల్క్స్‌లో కొనేద్దాం, ఇప్పుడే బుల్లెట్టు బండెక్కి పారిపోయాడు ఎస్సయి గారూ, ఒరేయ్ రామూ బ్రూ కాఫీ పెట్టరా, అయ్యో ఆల్రెడీ తాజ్ చాయ్ పెట్టేశాను అయ్యగారూ, దావత్ బాస్మతి ఎసరు పెట్టాను అత్తమ్మా, మామయ్యకు ఆశీర్వాద్ చపాతీలు చేస్తాను, మీకు జొమాటోలో స్నాక్స్ ఆర్డర్ పెట్టాను…’’ ఇలా ఉండాలి ప్రతి డైలాగ్… జాలిమ్ లోషన్ కూడా వదలొద్దు… ఇక కుమ్మేయండి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions