అప్పట్లో… అంటే వెంకటేష్ వంటి కమర్షియల్ హీరో సైతం కంట్రాక్టు మ్యారేజీ సబ్జెక్టు మీద, అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడం మీద కూడా సినిమాలు చేసిన బంగారు రోజుల్లో అన్నమాట… ఇప్పుడంటే బూతునాయుడు వంటి వెబ్ సీరీస్ చేసుకుంటున్నాడు… పూలదుకాణం స్థానంలో కట్టెల మండీ పెట్టుకున్నట్టు… తను అప్పట్లో ఓ సినిమాలో సౌందర్యను కంట్రాక్టు మ్యారేజీ చేసుకుంటాడు… (పవిత్రబంధం..? ఆరేడు ఇతర భాషల్లోకి కూడా అనువదించిబడి హిట్లు కూడా కొట్టింది…)
వెంకటేష్ తండ్రి పాత్రను ఎస్పీ బాలు పోషించినట్టు గుర్తు… సమాజంలో రకరకాల మ్యారేజీలు… ఎంతసేపూ లవ్వులు, బ్రేకప్పులు, ఇతరులతో అఫైర్స్, పెళ్లిళ్లు, పెటాకులు వంటి సబ్జెక్టుల చుట్టే గిరిగిరా తిరుగుతున్నాయి మన కథలు తప్ప, భిన్నత్వం దిశలో, అంటే సొసైటీలో కనిపిస్తున్న ఇతరత్రా పెళ్లిళ్ల వైపు పోవడం లేదు ఇప్పుడు… సున్నితమైన డిబేట్ పెట్టగల దర్శకులే లేరు కదా… ఎంతసేపూ దమ్మడ దమ్మడ నరుకుతూ తెర నిండా నెత్తురు కారించడం తప్ప..!
బాగా పాపులరైన సరోగసీ మీద కూడా ఏవో కొన్ని సినిమాలు వచ్చాయి తప్ప మన దర్శకులకు పెద్దగా ఆనలేదు ఆ సబ్జెక్టు… కులాంతరాలు, మతాంతరాలు, ఖండాంతరాలు, స్వలింగ వివాహాలు, పెళ్లాల మార్పిడి గట్రా ఎన్నో వివాహాల్ని చూస్తున్నాం కదా… పెళ్లిళ్లు అనగానే ఈమధ్య జపాన్‌లో ఓ కొత్త ట్రెండ్ గుర్తొచ్చింది… ఈమధ్య పాపులర్ అయిపోతోంది ఇది… దీని పేరు ‘ఫెండ్‌షిప్ మ్యారేజీలు’…
Ads
ఒరేయ్ నాయనా, అసలే జనాభా పడిపోతోంది, రాబోయే రోజుల్లో ముసలోళ్లు తప్ప దేశంలో ఇంకెవరూ కనిపించే సీన్ లేకుండా పోతోంది, పిల్లల్ని కనండర్రా అని ప్రభుత్వం, అక్కడి మేధావులు చెబుతుంటే.., నో, నో, మా అభిరుచుల మధ్యకు వస్తే బాగోదు అంటూ యువత హెచ్చరిస్తోంది ఉల్టా…
ఈ కొత్త టైపు పెళ్లిళ్లు ఓ కొత్త తరహా వివాహబంధమే… కానీ రొటీన్, రెగ్యులర్, సంప్రదాయిక వివాహ సంబంధ ఫీలింగ్స్ ఏమీ ఉండవు ఇందులో… అర్థం కాలేదా.,.? ఈ పెళ్లిళ్లకు ప్రేమ, భౌతికబంధం, కలిసి ఉండటం వంటివేమీ ఉండవు… భలే భలే, వర్చువల్ రియాలిటీలాగా ఇవేవో కొత్త వర్చువల్ పెళ్లిళ్లా అనుకుంటున్నారా..? దాదాపు అదే… ఇప్పటికే వేలాది మంది ఈ పద్ధతి వైపు టర్న్ అయిపోయారు… ఇందులో లింగరహితులు, స్వలింగులు, బహులింగులు కూడా ఉన్నారు…
కలోరస్ అని ఇలాంటి మ్యారేజీల ఏజెన్సీ ఈ ట్రెండ్ డేటా గురించి వివరిస్తూ… 2015 నుంచి 500 మంది తమ ఆధ్వర్యంలోనే ఈ కొత్త బంధాల్లో ఇమిడిపోయారంటోంది… ‘‘ఈ కొత్త బంధాలు మనకు తెలిసిన రొమాంటిక్, లైంగిక బంధాలకు లోబడి ఉండవు… చట్టబద్ధంగా వాళ్లు దంపతులే, కానీ వారి నడుమ లైంగిక సంబంధాలు ఉండవు, పిల్లలు కావాలనుకున్నా సరే కృత్రిమ పద్ధతుల వైపు మళ్లాల్సిందే…’’ అని వివరిస్తోంది…
ఈ బంధంలో ఉన్నవాళ్లు వేరే వాళ్లతో లైంగిక సంబంధాలు నెరపొద్దని ఏమీ లేదు… అలాగే ఒకరు ఎక్కువ భార్యలను కలిగి ఉన్నా సరే… పరస్పర అంగీకారమే ప్రధానం… ఈ కొత్త పెళ్లిబంధానికి ముందే జంట తమ ఇల్లు, ఖర్చులు, లాండ్రీ, జీతాలు, ఇతరత్రా అన్నీ ముందే చర్చించుకుంటుంది… కొన్ని గంటలో, కొన్ని రోజుల్లో అలా చర్చించుకుని సమ్మతమైతేనే ఈ బంధంలోకి అడుగుపెడతారు…
మూడేళ్లుగా ఈ బంధంలో ఉన్న ఒకావిడ ‘‘ఈ తరహా పెళ్లి మనకు సరైన రూమ్‌మేట్‌ను ఎంచుకోవడం వంటిదే… నన్ను తీసుకొండి, నా తత్వానికి నేనెవరికీ గరల్ ఫ్రెండ్‌గా ఉండలేను, భార్యగా అస్సలు ఉండలేను, కానీ మంచి స్నేహితురాలిగా ఉండగలను… అందుకే నాకు తగిన అభిరుచులు, అలవాట్లు ఉన్నవాడిని చూసుకున్నాను, జీవితం సుఖంగా గడిచిపోతోంది’’ అని చెబుతోంది…
అసలైన ఆ లైంగిక బంధం లేనిదే ఇక ఈ బంధం దేనికి..? అనేదే కదా ఈ మొత్తం సబ్జెక్టులో కీలక ప్రశ్న… లైంగిక సుఖమే కావాలనుకుంటే ఇతరత్రా మార్గాలు వెతుక్కోవచ్చునట… అబ్బే, మన సొసైటీలో అస్సలు కుదరవు, అసలు ఈ తరహా పెళ్లిళ్లలో రంగు, రుచి, వాసన ఏమున్నాయి అంటారా..? జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి… వాళ్లకలాగే ఇష్టం… స్వలింగ సంపర్కాలను, పెళ్లిళ్లను ఇన్నేళ్లూ ఈసడించుకుని, ఈమధ్య చట్టబద్ధంగా ఆమోదించామా లేదా..? ఇదీ అంతే, సొసైటీ వీటినీ సరేనంటుంది… ఓ పెళ్లిళ్ల లాయర్ ఈ తరహా పెళ్లిళ్ల మీద సింపుల్‌గా ఇలా అన్నాడు… ‘‘స్నేహానికి ఎక్కువ, ప్రేమకు తక్కువ… అంటే స్నేహితులకన్నా ఎక్కువ, ప్రేమికులకన్నా తక్కువ…’’
Share this Article