విష్ణుదేవ్ సాయి… చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది… నిజానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఆశ పార్టీలోనే లేకుండేది… వివిధ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలింది… కానీ అనూహ్యంగా 54 సీట్లు వచ్చాయి… మొత్తం 90 సీట్లకు గాను ఇది చాలా స్పష్టమైన మెజారిటీ…
ఎవరిని సీఎం చేయాలో బీజేపీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేకపోయింది… ఇప్పుడు ముగ్గురు పార్టీ పరిశీలకులు వెళ్లి, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి, మెజారిటీ నిర్ణయం మేరకు విష్ణుదేవ్ సాయి పేరును ప్రకటించింది… తను 2020 నుంచి 2022 దాకా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు… అజిత్ జోగి తరువాత ఈ రాష్ట్రానికి మళ్లీ ఓ గిరిజన నేత ముఖ్యమంత్రి కావడం ఇదే…
తను తేలి (సాహు) కమ్యూనిటీకి చెందినవాడు… అరవయ్యేళ్లు… ఏకగ్రీవ సర్పంచి నుంచి ఎదిగాడు… రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ, కేంద్ర మంత్రి… సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం… ఆ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువ… దుర్గ్, రాయపూర్, బిలాస్‌పూర్ డివిజన్లలో వీళ్లు మరీ అధికం… తను కూడా మొన్నటి ఎన్నికల్లో కుంకురి ఏరియా నుంచి గెలిచాడు… ఆ ఏరియా ఎన్నికల్ని బీజేపీ స్వీప్ చేసింది…
Ads
68 నుంచి 35కు పడిపోయింది కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో… బీజేపీ గనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ఓబీసీ నుంచి గానీ ఎస్టీ నుంచి గానీ సీఎంను ఎంపిక చేస్తుందని అనుకుంటున్నదే… పార్టీ అగ్రనేత రమణసింగ్‌ను పక్కన పెట్టేశారు… (తెలంగాణలో పార్టీ వేసినవి తప్పుటడుగులే గానీ… కొన్ని బీజేపీ నిర్ణయాలు కొన్నాళ్లుగా భిన్నమైన బీజేపీని సూచిస్తున్నాయి… తమిళనాట ఓ మాజీ ఐపీఎస్ అధికారి, ఎస్సీ నేత అన్నామలైను పార్టీ అధ్యక్షుడిగా చేసింది… తను దుమ్మురేపుతున్నాడు…)
(తెలంగాణకు సంబంధించి మొన్నటి ఎన్నికల్లో మాదిగ హక్కుల పోరాట నేత మంద కృష్ణను దగ్గరకు తీసుకుని, వర్గీకరణకు హామీ ఇవ్వడం కూడా రాజకీయంగా మంచి అడుగే… రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక మరో ప్రశంసనీయమైన నిర్ణయం… ఇప్పుడు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పదవికి విష్ణుదేవ్ సాయి ఎంపిక కూడా ఈ పరంపరలో భాగమే… బీజేపీ మారుతోంది… తన సంప్రదాయ వోటు బ్యాంకులే గాకుండా అన్ని వర్గాల ప్రజలకూ చేరువవుతోంది…)
చత్తీస్‌గఢ్‌లో 32 శాతం గిరిజనులే… వాళ్లకు రిజర్వ్ చేసిన 29 సీట్లలో బీజేపీ ఏకంగా 17 సీట్లు గెలుచుకుంది ఈసారి… (ఓబీసీల జనాభా 45 శాతం… అందుకే ఎస్టీ లేదా ఓబీసీ సీఎం అని బీజేపీ ముందే ఫిక్సయింది…) (తేలి కమ్యూనిటీ అంటే గుజరాత్‌లో మోడీ బాపతు తేలి కమ్యూనిటీ వేరు, వాళ్లు ఓబీసీలు… చత్తీస్‌గఢ్‌లో తేలి కమ్యూనిటీ ట్రైబల్ కమ్యూనిటీ…) హయ్యర్ సెకండరీ చదువు మాత్రమే కొత్త సీఎం విద్యార్హత… కానీ అందరినీ కలుపుకుపోవడంలో దిట్ట… ఈలెక్కన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ కొత్త ముఖ్యమంత్రులు రాబోతున్నట్టు ఊహించొచ్చు… శుభం…
Share this Article