Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం సార్… అన్యాయం… ఇలా కొలువులిస్తిరి… అలా పీకేస్తిరి…

November 9, 2024 by M S R

.
సర్కారు కొలువులు ఇలా కూడా ఊడతాయా !?

ప్రభుత్వ ఉద్యోగం రాగానే సంబరపడొద్దు.. అయినవాళ్లకు చెప్పుకొని సంబరాలు చేసుకోద్దు.. ఆనక పరువు పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పుడైనా ఊడిపోయే ఛాన్సు ఉంది కాబట్టి. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగిగా నియామకమైతే, తొలగించడం అంత ఈజీ కాదని అందరూ భావిస్తుంటారు. కానీ అదంతా ఉత్తిదేనని ఖమ్మం జిల్లా అధికారులు నిరూపించారు.

రాత్రింబవళ్లు కష్టపడి చదివి, తీవ్రమైన పోటీని తట్టుకొని, ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తిస్తున్న వారిని రాత్రికి రాత్రే రోడ్డున పడేశారు. ‘మీ అర్హత సర్టిఫికెట్లు చెల్లవు.. ఉద్యోగాలు ఇచ్చిన సమయంలో మేం వాటిని సరిగా చెక్‌ చేయలేదు.. ఇప్పుడు చూశాం కాబట్టి మిమ్మల్ని తొలగించాం..’ అని అలవోకగా సెలవిస్తున్నారు. బహుశా టీచర్ల ఉద్యోగాల భర్తీ చరిత్రలో ఈ తరహా ‘ఊడబీకుడు’ ఎప్పుడూ జరగలేదని ఉపాధ్యాయులే అంటున్నారు.

Ads

డీఎస్సీ- 2024లో భాగంగా ఖమ్మం జిల్లాలో 19 హిందీ పండిట్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులమనుకున్న వారందరూ దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు… అన్ని సరిగా వున్నవని భావించిన వారికి హాల్‌టికెట్లు ఇష్యూ చేశారు. నిరుద్యోగులు కంటిమీద కునుకు లేకుండా చదివారు.

తీవ్రమైన పోటీని తట్టుకొని మెరిట్‌ సాధించిన వారిని అధికారులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచారు. వారి సర్టిఫికెట్లను పరిశీలించి, అన్నీ ఓకే అని నిర్ధారించి, అర్హులైన వారిని పోస్టులకు ఎంపిక చేశారు. పైగా వారిని బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించి, ఎల్‌బి స్టేడియంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించారు.

జాబ్‌ సాధించిన వారు ఆనందంతో బంధుమిత్రులతో సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లోనైతే తెలిసిన వారందరూ మూకుమ్మడిగా తరలివచ్చి అభినందనలతో ముంచెత్తారు. వాట్సాప్‌ గ్రూపుల్లో విషెస్‌ పోటెత్తాయి. ర్యాంకులు సాధించిన వారి విజయగాథలు మీడియాలో హోరెత్తాయి. ఇక ఉద్యోగం పొందిన వారు ఎంతో ఉత్సాహంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా 22 రోజులు గడిచాయి.

ఇక్కడ సీన్‌ కట్‌చేస్తే.. 23వ రోజున తెల్లవారే సరికల్లా అంతా రివర్సయి పోయింది. రోజులాగానే పాఠశాలలకు వెళ్లిన హిందీ పండిట్‌ టీచర్లకు హెచ్‌ఎంలు ఎదురెళ్లి, ‘మీ ఉద్యోగాలు పోయాయి.. మీ పోస్టుల్లో వేరే వాళ్లు జాయిన్‌ అయ్యారు.. ఇవిగో డీఈవో ఉత్తర్వులు..’ అని నింపాదిగా చెప్పారు. ఈ అనుభవం ఒకే రోజు ఏడుగురికి ఎదురైంది. ఏం జరిగిందో అర్థం కాక వారు హతాశులై పోయారు.

పరుగుపరుగున డీఈవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీఈవో చావుకబురు చల్లగా చెప్పాడు. ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ (మద్రాసు)లో మీరు చదివిన హిందీ కోర్సు చెల్లుబాటు కాదు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో గమనించకపోవడం వల్ల మీకు ఉద్యోగాలు దక్కాయి.. అందువల్ల మీ ఉద్యోగాలను రద్దు చేస్తున్నాం..’ అని సెలవిచ్చాడు.

‘దరఖాస్తు సమయంలో చెప్పలేదు.. హాల్‌ టికెట్లు జారీ చేసినప్పుడు చెప్పలేదు.. తుది ఎంపిక సమయంలో చెప్పలేదు.. ఉద్యోగాలు పొంది విధులు నిర్వర్తిస్తున్న సమయంలో చెప్పి రోడ్డున పడేస్తారా..?’ అని ఏడుగురు హిందీ పండిట్లు నెత్తీనోరు బాదుకుంటున్నా వినేవారే లేకుండా పోయారు. అర్హత లేని కోర్సులు చేస్తే తాము డీఎస్సీ పరీక్షల్లో ఎలా మెరిట్‌ సాధించగలిగామని వారు ప్రశ్నిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన నిరుద్యోగులనే కాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత ఈజీగా ఊడతాయా..?’ అని విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు ప్రొబేషన్‌లో వున్నా, రెగ్యులర్‌ పోస్టులో వున్నా వారిని తొలగించాలంటే నిర్దేశిత పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. కానీ ఖమ్మంలో మాత్రం వాటిని బేఖాతరు చేశారు.

కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలకు తీసిపోని విధంగా తీసిపారేశారు. పైగా ఏవేవో జీవోలను కోట్‌ చేస్తూ ఉత్తర్వులు చేతికందించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ ఆషామాషీ వ్యవహారం కాదు, అవి జీవితాలకు సంబంధించినవి. ఉద్యోగం దక్కకపోతే, నోటిఫికేషన్లు రాకపోతే ప్రాణాలు తీసుకునే యువత ఉన్న సమాజం మనది. అట్లాంటిది, దక్కిన ఉద్యోగం దారుణంగా చేజారిపోతే ఎవరికైనా తీవ్ర మానసిక వేదన కలుగుతుంది. అది ఎటో దారితీస్తుంది.

‘తప్పిదం జరిగింది.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నాం..’ అని ప్రకటించిన అధికారులు- సర్టిఫికెట్లను పరిశీలించిన ఇద్దరు హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేశారు. ఇక ఇష్యూ క్లోజ్‌ అయిందన్నట్టు వ్యవహరిస్తున్నారు. సస్పెండైన ఇద్దరూ కొన్నిరోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరడం ఖాయం. కానీ ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురి భవిష్యత్తు మాత్రం ఏమిటో ఎవరూ చెప్పలేరు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులో పోరాడతామని బాధితులు చెబుతున్నారు. వారి పోరాటం ఎప్పుడు ఫలిస్తుందో కూడా ఎవరూ చెప్పలేరు.

అరుదైన ఈ ఉదంతంపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించ లేదు. పాలక, ప్రతిపక్షాల మూసీ రాజకీయ రణగొణ ధ్వనుల మధ్య, ఫార్ములా కారు రేస్‌ స్కామ్‌ సవాళ్ల మధ్య దీనిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. డీఎస్సీ నిర్వహణను గొప్ప అంశంగా ప్రచారం చేసుకున్న సర్కారు.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న ‘తప్పిదం’పై నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తోంది.

ఉద్యోగాలు పొందడం కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేయడాన్ని గత ప్రభుత్వ హయాంలో చూశాం. ఇప్పుడు పొందిన ఉద్యోగాలను రద్దు చేస్తూ మాడిఫికేషన్‌ ఆర్డర్లు జారీచేయడాన్ని చూస్తున్నాం. పాలకులు ఎందరు మారినా, నిర్వాహక వ్యవస్థల్లో మార్పు రాకపోతే ఈ తరహా ఊడబీకుడు ఉదంతాలు ముందు ముందూ తప్పవేమో. వీటిని కామన్‌ ఫెనామినన్‌ ఘటనలుగా భావించాలేమో! ……. -శంకర్‌ శెంకేసి   (79898 76088)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions