రెండు వేర్వేరు పదాలను కలిపి ఒక పదం చేయడం చాలా కాలంగా ఉన్నదే.. ఇంగ్లీష్ లో దీన్ని భాషకు సంబంధించి పొర్ట్మెంటె portmanteau అంటారు.
సంస్కృతి, సంగీతం, ఆర్ట్ కు సంబంధించి ఫ్యూజన్ అంటారు. subject to correction. అంటే మాండలిన్ మీద కర్ణాటక రాగాలు పలికించడం.. పట్టు చీరెలో అమ్మాయి గాగుల్స్ పెట్టుకుని రాప్ సాంగ్ పాడడం, లేదూ జీన్స్ లో అమ్మాయి భరతనాట్యం చేయడం లాంటివన్నమాట…
ఇంకొంచెం భాషలోకి వెళితే .. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ “ఇన్ఫోటైన్మెంట్” గా, ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ “ఎడ్యుటైన్మెంట్గా” వాడకంలో ఉన్నాయి. “మోటెల్.”.. అంటే ఈనాడు తెలుగులో సంచార ఫలహారశాల మొబైల్ ప్లస్ హోటల్ లోంచి వచ్చిందే. మధ్యాహ్న భోజన సమయానికి చాలా ముందు ఉదయ అల్పాహారానికి చాలా తరవాత తినేదాన్ని అనే “బ్రంచ్” బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ లోంచి వచ్చిందే.
Ads
ఇవన్నీకూడా హత్యాచారం పదం లాంటివే. భూమిలో లెటర్స్ టు ఎడిటర్ కాలమ్ శీర్శిక “పాఠకచేరి”. ఇది కూడా పాఠకులు ప్లస్ పాటకచేరి కలిస్తే పుట్టిందే. విజయవిహారంలో ఇదే కాలమ్ శీర్శిక “మీ మెయిల్”. ఇది ఈ మెయిల్ కు మీ తగిలించుకుని అర్దం మార్చుకున్నామన్న మాట.
ఒకప్పటి హైదరాబాద్ సిటీ కేబుల్ లో మీరు మెచ్చిన పది పాటల లాంటి ప్రోగ్రాం పేరు” ఇష్టపది”. అష్టపది నీ ఇష్టాన్నీ కలిపి తయారుచేసిన మాట ఇది.
జ్యోతిలో అరుణ్ సాగర్ కాలమ్ “మేల్ కొలుపు”. మేలు కొలుపు అనే మాటను పురుషుడి కోణంగా మార్చి మేల్ ను తగిలించిన మాట ఇది. ఇప్పుడు నెట్ లో తరచూ వినిపించి కనిపించే మాట “విక్షనరీ”. ఇది వికీపీడియా ప్లస్ డిక్షనరీ లను కలిపి తయారు చేసిన కొత్త మాట.
ఆంధ్రభూమి సండే కవర్ స్టోరీగా పోలీసులే నక్సల్స్ గా వ్యవహరించడం అనే కథనం రాస్తూ నేను దానికి “నక్సలీసులు” అని హెడ్ లైన్ ఇచ్చా. ఆ తరువాత కూడా మేం ఆ పదమిశ్రమాన్ని చాలా సార్లు వాడాం. ఒకే కాన్పులో ముగ్గురు పుట్టిన ఒక న్యూస్ ఐటమ్ కు నేను”త్రివలలు” అని హెడ్ లైనిచ్చా. కవలల్ని త్రి అనే త్రయంతో కలిపాననమాట. పతంజలి గారు నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నేను ఉదయంలో చేరిన ఐదో రోజో ఆరో రోజో అది.. అప్పట్లో మాకు ఆయన మెచ్చుకోవడమంటే ఆస్మానీచే అన్నమాటే.
1990లో జపాన్ లో ఉద్యోగులు పాన్ పరాగ్ తినడం వల్ల ఉత్పాహంగా పని చేస్తున్నారన్న ఒక యాడ్ ఇంటరెస్ట్ ఐటమ్ కు నేను” జపాన్ పరాగ్” అని హెడ్ లైన్ ఇస్తే నాకు ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక గిఫ్ట్ పంపాడు మా యాడ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ జపాన్ పరాగ్ కూడా ఇలాంటిదే కదా.
ఎక్కడో రన్నింగ్ మాటర్ లో నేను ధనధనాభివృద్ధి అని దినాన్ని ధనంగా మారిస్తే ఇదే హెడ్లయినండీ అని న్యూసెడిటర్ ప్రకాష్ దాన్ని హెడ్డింగ్ చేసాడు. ఇదీ ఇలాంటిదే అనుకుంటా. ఇంకో సందర్భంలో నేను ‘ శాడిస్ట్ఫాక్షన్ ‘ అని జంబుల్ చేశా. ఆడ పెళ్లి బట్టల మాల్ కోసం ఎవరో నన్ను పేరడిగితే ‘ ‘ స్త్రీరస్తు ‘ అని సూచించా. శ్రీరస్తు కు స్త్రీ కలిపానన్నమాట.. ప్రయివేట్ టాక్స్ లో మనందరం ఇలాంటివి చాలా చేస్తుంటాం. నేను కేవలం పత్రికలలోవీ నాకు ఇప్పటికిప్పుడు గుర్తుకొచ్చినవీ మాత్రమే ఉదహరించా.
ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. just for fun.. EX తో మొదలయే ఏ పదానికైనా s కలిపి చూడండి కచ్చితంగా వేరే అర్దాన్నిస్తుంది. ఇదంతా ఎందుకంటే.. ఎస్వీ రంగారావన్నట్టు మనం సృష్టించకుంటే భాష పొడవూ వెడల్పు లోతులు ఎలా మారతాయి చెప్పండి… (By ప్రసేన్ బెల్లంకొండ)
Share this Article