ఆఫ్టరాల్ ఆరు వందల వోట్లు పోలయిన ఓ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజుంతా ప్రత్యక్ష ప్రసారాలా..? డిబేట్లా..? ఏమిటి టీవీల అరాచకం..? చర్చించడానికి, చూపించడానికి సమాజంలో ఎన్ని సమస్యలు లేవు..? ఇదేం దిక్కుమాలిన పాత్రికేయం..? వీ6, టీన్యూస్ చూడండి, ఎంత పద్దతిగా మా ఎన్నికల్ని అవాయిడ్ చేస్తున్నాయో… మరీ ఈ ఆంధ్రా చానెళ్లకే బుర్రల్లేవు..?……….. ఇలాంటి తిట్లు, శాపనార్థాలు నిన్న సోషల్ మీడియాలో మిక్కిలి బొచ్చెడు కనిపించినయ్… కానీ టీవీవాళ్లు పిచ్చోళ్లేమీ కాదు… నిన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు అవే చానెళ్ల ప్రసారాలకు యూట్యూబ్ లైవ్ విజిటర్ల సంఖ్య చూస్తే, ప్రతి చానెల్‌నూ వేలల్లో ఉన్నారు… మరెందుకు టీవీలు వాళ్లకు అవసరమైన మసాలా సరుకును వదిలేసుకుంటయ్..? తెలంగాణలో సినిమా పిచ్చి తక్కువ కాబట్టి వీ6, టీన్యూస్ పెద్దగా పట్టించుకోలేదు, ఆంధ్రాలో సినిమా పిచ్చి విపరీతం కాబట్టి ఆంధ్రా చానెళ్లు జనం పల్స్‌ను బట్టి ప్రసారాలు నడిపించినయ్… సింపుల్ ఈక్వేషన్… పులిహోర, దధ్యోజనం మంచివే, కానీ మన నాలుకలు పీక్కుపోయేది బిర్యానీ కోసమే..!
నిజం ఏమిటంటే..? టీవీలో వినోదం ఎలాంటి దందాయో న్యూస్ కూడా ఓ దందాయే… టీవీలకు రేటింగ్స్ కావాలి, రేటింగ్స్‌ను బట్టి యాడ్స్ కావాలి, యాడ్స్‌ను బట్టి డబ్బు కావాలి… చాలా సింపుల్… డబ్బు కోసం అవి ఏమైనా చేయగలవు… వ్యాపారం కోసం దుకాణం పెట్టుకున్నవాడు లాభాల కోసం కాకపోతే ఇంకేం ఆలోచిస్తాడు..? వాడు వ్యాపారి… అందుకే మా ఎన్నికలకు అంత కవరేజీ… ఇది తప్పు కదా అనకండి, తప్పుకానిదేదో చెప్పు అంటారు వాళ్లు… మనకు తెలుసు జబర్దస్త్ అంతటి చిల్లర, నీచమైన కామెడీ షో లేదని… కానీ ఈరోజుకూ ఈటీవీ టాప్ రేటింగ్స్ షోల జాబితాలో దానిదే ప్రథమస్థానం… మొన్నొక ప్రోమోలో ఎవరో ములక్కాడలు అడిగితే రోజా ఇంకా తింటే వెనక్కి పెరుగుతుందనో ఏదో కామెంటుతోంది… ముదురు బెండకాయను మనసులో ఊహించుకుంటున్నా అంటూ రష్మి పడీపడీ నవ్వుతుంది… మింగుడు భాష నుంచి ఆది తగ్గడం లేదు… అక్రమ సంబంధాలు, వెకిలి బూతులు, వెగటు కామెడీ స్కిట్లకే ఇప్పటికీ ప్రాధాన్యం… ఈ షో నిర్మాతలు మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లకు తెలియదా..? తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, చూసేవాడు చూస్తూనే ఉంటాడు… అందుకే జబర్దస్త్ పేరిట మూడునాలుగు కార్యక్రమాల్ని కుమ్ముతూనే ఉంటారు…
Ads
బిగ్‌బాస్ మీద విపరీతమైన విమర్శలు… బిగ్‌బాస్ ఫాలో అయ్యేవాళ్లను కూడా గేలిచేసేలా సోషల్ వ్యాఖ్యలు… కానీ ఆగిందా..? ఆగలేదు, ఆగదు… మాటీవీ వాడికి బుద్ధి లేకకాదు, ఆ షో టైమింగును పది గంటలకు మార్చింది… బిగ్‌బాస్ చూసేవాడు ఆ టైమ్‌లోనైనా చూస్తాడు, 8, 9 గంటల ప్రైమ్ టైంలో తన సీరియళ్లను వేసుకుంటాడు, డబుల్ ధమాకా… రెండింటికీ యాడ్స్… బిగ్‌బాస్ షో ఓ గంజాయి పంట… అందులో డబ్బుంది… ఆ డబ్బు టీవీవాడికి కావాలి… అదొక్కటే ఈక్వేషన్… లేకపోతే అంత భారీ ఖర్చు ఎందుకు పెడతాడు..? వాడేమైనా పిచ్చోడా..?! జీటీవీలో పొద్దున్నే కొన్ని షోలు వస్తాయి… ఆధ్యాత్మికం పేరిట నడుస్తుంటయ్… వాటంత దిక్కుమాలిన, నష్టదాయక కార్యక్రమాలు బహుశా ఏ టీవీల్లోనూ లేవేమో… సొసైటీని ఇంకా వెనక్కి వెనక్కి తీసుకుపోయే షోలు అవి… ఐతేనేం, చూసేవాళ్లున్నారు, వాడు చూపిస్తున్నాడు… డబ్బు, డబ్బు… అదే టీవీల్ని నడిపించేది… అంబానీకి ఏం పుట్టింది..? డబ్బు లేదా..? దేశాన్ని, సొసైటీని, ప్రభుత్వాన్ని, చట్టాల్ని మోసం చేస్తూ లక్షల కోట్లకు ఎదిగాడు కదా… ఈరోజుకూ తన టీవీ18- న్యూస్18 సైట్లను చూడండి, అన్నీ బూతులే… పరమనాసిరకం… ఆసియానెట్, వన్ ఇండియా… చివరకు ఈటీవీ భారత్, ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ సైట్లు కూడా అలాగే మారిపోతున్నయ్… యూట్యూబ్ చానెళ్లు-వీడియోల సంగతి చెప్పనక్కర్లేదు… ఓసారి సరయు వీడియోలు చూడండి… ఓటీటీల్లోని వీడియోలు చూడండి, అరాచకం… ఎలాగూ సెల్ఫ్ సెన్సార్ లేదు, సర్కారీ సెన్సార్ లేదు… వాటికి సెన్సూ లేదు… సో… భాష, సంస్కారం, సొసైటీ, విలువలు, డీసెన్సీ, ప్రమాణాలు… ఇవన్నీ చెప్పడానికే…!! దందా, మాఫియా విలువల్ని అనుమతించవు…!!
Share this Article