.
66 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాల మహాకుంభమేళా అయిపోయింది.., ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక మేళా మొన్నటి మహాశివరాత్రి స్నానాలతో ముగిసింది… కానీ ఇంకా ఆ పట్టణం పూర్ణ పారిశుద్యంతో ఓ కొలిక్కి రానేలేదు… అప్పుడే తదుపరి కుంభమేళా ఎప్పుడు అనే తాజా చర్చకు తెరలేచింది…
అదేమిటి..? 144 ఏళ్ల తరువాత మళ్లీ మహాకుంభమేళా వచ్చేది, అప్పుడే చర్చ ఏమిటి అంటారా..? మీ ప్రశ్న సబబే, హేతుబద్దమే… అవును, మహాకుంభమేళా వచ్చేది మరో 144 ఏళ్ల తరువాతే… కానీ రెండేళ్లలో వచ్చేది అర్థకుంభమేళా…
Ads
కుంభమేళాల్లో రకాలుంటయ్… ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినిలలో జరిగేవి మొదటిరకం… ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని కుంభమేళా అని, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు…
అదేవిధంగా ప్రతి 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఉత్సవాన్ని పూర్ణ కుంభమేళా అని మరియు ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన దానిని మహా కుంభమేళా అని పిలుస్తారు, ఇది 144 సంవత్సరాల విరామం తర్వాత జరుగుతుందని నమ్ముతారు…
ఇప్పుడు రాబోయేది అర్ధకుంభమేళా…అనగా ఆరేళ్లకు ఓసారి వచ్చేది… అది మహారాష్ట్రలోని, నాసిక్‌లో జరగబోతోంది… అంటే గోదావరి నది జన్మస్థలి… త్య్రంబకేశ్వరం అంటాం… 2027లో జరిగే నాసిక్ కుంభమేళా జూలై 17 నుండి ఆగస్టు 17, 2027 వరకు జరగనుంది… ఈ కుంభమేళా జరిగే ప్రదేశం నాసిక్ నుండి దాదాపు 38 కి.మీ దూరంలో ఉంటుంది…
త్రివేణీ సంగమం నిజానికి పుణ్యస్నానాలకే కాదు, పితృకర్మలకు సరైన స్థలం… (ఈ కర్మలకు గయ కూడా మరో ప్రధాన కేంద్రం)… ఐతే త్రివేణీ సంగమంకన్నా త్య్రంబకేశ్వర్‌కు పితృకర్మల కోణంలో మరింత ప్రాధాన్యం, పవిత్రత ఉంటుంది హిందూ మతవిశ్వాసంలో… ఇదీ శైవక్షేత్రమే…
ఇప్పుడు సరళీకరించారు గానీ… కొన్నాళ్ల క్రితం వరకూ త్య్రంబకేశ్వర్‌లో విశిష్ట పితృకర్మలు జరిపించేవారు… ఆరేడు రోజులు… మద్యం, మాంసభోజనాలకు దూరంగా, సరళ, నిరాడంబరంగా గడపాలి… స్మశానంలో పితృదేవతలకు కర్మలు చేయించి, తరువాత గుళ్లో శాంతి పూజలు చేయిస్తారు… తద్వాారా ఏడు తరాల పితృదేవతలకు కర్మల్లో ఏవైనా లోపాలున్నా, జరిపించకపోయినా అన్నింటికీ నివారణ అన్నమాట…
ఇప్పుడు సింప్లిఫై చేశారు, అది వేరే చర్చ… కానీ త్రివేణీ సంగమం దగ్గర కుంభమేళా వేరు… కానీ రిమోట్ త్య్రంబకేశ్వరంలో ఏర్పాట్లు ఎలా..? మొన్నటి మహాకుంభమేళాకు 40 కోట్లు అనుకుంటే 66 కోట్ల జనం వచ్చారు… సో, త్య్రంబకేశ్వర్‌కూ పోటెత్తుతారు… అందుకని ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ అప్పుడే ఏర్పాట్లపై దృష్టి పెట్టాడు…
నాసిక్ కలెక్టర్, అధికార యంత్రాంగంతో భేటీ వేసి… ఈసారి క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించుకోావలని సూచించాడు… ఏర్పాట్ల ప్లానింగ్ కోసం వెంటనే ఓ అథారిటీని ఏర్పాటు చేయమన్నాడు,.. ఆల్రెడీ ఒక అధికారిక బృందం మొన్నటి మహాకుంభమేళాకు వెళ్లి వచ్చింది… నాసిక్ కుంభమేళాకు ఏమేం చేయాలో ఓ రిపోర్ట్ కూడా రూపొందించింది…
మరీ ప్రయాగరాజ్ స్థాయిలో వేల ఎకరాల్లో టెంట్ సిటీ ఎట్సెట్రా భారీ ఏర్పాట్లు అవసరం లేకపోయినా సరే… ఫడ్నవీస్‌కు ఈ ఏర్పాట్లు ఓ టాస్కే… మరీ యూపీ సీఎం యోగీతో పోలిక అవసరం లేదు గానీ, నాసిక్‌లో ఏమాత్రం తొక్కిసలాటలకు అవకాశం లేని ముందు జాగ్రత్త చర్యలే అసలైన పరీక్ష..!
అన్నట్టు ఈ మే నెల 15 నుంచి 26 వరకు తెలంగాణ, కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయి… ఇదీ త్రివేణీ సంగమమే అంటుంటారు… ప్రాణహిత, గోదావరితోపాటు సరస్వతి అంతర్వాహినిగా ఇక్కడే కలుస్తుందంటారు… మరి ప్రయాగరాజ్, త్రివేణీ సంగమంలో అంతర్వాహినిగా ఉండే సరస్వతి నదీ, ఈ కాలేశ్వరం సరస్వతి నది వేర్వేరా..? ఒక్కటేనా..? ఎలా..?
పైగా గోదావరి పుష్కరాలు వేరు, ప్రాణహిత పుష్కరాలు వేరు… నిజానికి ప్రధాన నదులకే తప్ప ఉపనదులకు ప్రత్యేకంగా, విడిగా పుష్కరాలు ఉండవు అంటారు… మరి ఈ లాజిక్కులేమిటో ఎవరైనా ప్రవచనకర్తలు క్లారిటీ ఇవ్వాల్సిందే… ఐనా విశ్వాసాలకు హేతువులేమిటీ అంటారా..? అంతేలెండి… నదీస్నానం ఎప్పుడైనా మంచిదేగా..!!
Share this Article