.
ముందుగా ఓ వార్త చదవండి… వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది… బాగా హాశ్చర్యం వేసింది సుమా…
జగిత్యాల న్యాయవాది మ్యాన మహేష్ కుమార్ గారికి గౌరవ డాక్టరేట్.
Ads
జగిత్యాల పట్టణానికి చెందిన న్యాయవాది, సామాజిక సేవకుడు మ్యాన మహేష్ కుమార్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు, సికింద్రాబాద్, సిటీ కల్చరల్ ఆడిటోరియంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అకాడమీ, స్పూర్తి సకల కళా వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులచే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
మ్యాన మహేష్ కుమార్ “ప్రేరణ ఫౌండేషన్ “ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని నిర్వాహకుడు ఆకుల రమేష్ తెలిపారు. హైకోర్టు న్యాయవాదిగా, రాష్ట్ర యువజన సంఘాల సమైక్య అధ్యక్షులుగా, జగిత్యాల జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా ఏబీవీపీ, బిజేవైయమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీజేపీ నిర్మల్, మంచిర్యాల జిల్లాల ఇంచార్జిగా పనిచేసి సామాజిక సేవతో పాటు పలు సంఘాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నందుకుగాను గౌరవ డాక్టరేట్ మ్యాన మహేష్ కుమార్ కు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న మ్యాన్ మహేష్ కుమార్ ను న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు, పలువురు మిత్రులు అభినందించారు…
గుడ్… గుడ్… కంగ్రాట్స్ మిత్రమా… కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే..? సందేహం ఏమిటంటే…? స్వచ్చంద సంస్థలు కూడా తమకు నచ్చినవారికి డాక్టరేట్లు ఇవ్వవచ్చా అనేది..?
సరే, సీనియర్ నరేష్ ఇప్పటికీ తన లెటర్ హెడ్ మీద హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకుంటాడు… అదేమిటంటే..? ఆ అవకాశాన్ని, సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని వారెవరో ఇచ్చారు అంటాడు… మామూలుగా గవర్నర్లు, రాష్ట్రపతి తదితరులకు మాత్రమే హిజ్ ఎక్సలెన్సీ వాడతాం కదా… మరి ఇదేమిటో..?
విదేశీ యూనివర్శిటీలు కూడా డాక్టరేట్లు ఇస్తుంటాయి, అవీ విన్నాం, చదివాం… తృణమో పణమో ఖర్చు అవుతుందట… రెగ్యులర్ యూనివర్శిటీలు కూడా రకరకాల లెక్కలకు లోబడి గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి… దానికీ కొంత కర్చు ఉంటుందంటారు… ఇవేకాదు, యూనివర్శిటీల్లో డాక్టరేట్ దందాల మీద కూడా వార్తలు వస్తుంటాయి అప్పుడప్పుడూ… తెలంగాణలోని ఓ యూనివర్శిటీ అధికార పార్టీకి దగ్గరగా ఉన్న కొందరికి ఉదారంగా డాక్టరేట్లు ప్రదానం చేసిందని ఆమధ్య కొన్ని వార్తలు చదివినట్టు గుర్తు…
కానీ స్వచ్చంద సంస్థలు కూడా డాక్టరేట్లు ఇవ్వవచ్చునా..? వాటికి ఉండే చెల్లుబాటు ఎంత..? కొన్ని లక్షల స్వచ్చంద సంఘాలున్నాయి… ఎవరికైనా ఇవ్వచ్చా..? ఇక అంతేమిటి..? అసలు రూల్స్ ఏమిటి..? ఇదే జరుగుతూ ఉంటే… నిజంగా ఏదైనా అంశంలో సీరియస్ వర్క్ చేసి, నానా కష్టాలకోర్చి డాక్టరేట్లు పొందేవారు, మెడికల్ ఫీల్డులో వర్క్ చేసే రియల్ డాక్టర్లు… ఏమనుకోవాలి..? దీనికి నిజంగానే ఓ విధివిధానం అంటూ లేదా..? నిజంగా తెలియకే అడుగుతున్నా..!!
Share this Article