నిహారిక ఎన్ఎం… ఈమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది, అదీ గీతా ఆర్ట్స్ వాళ్ల చిత్రం కోసం, అదృష్టమంటే ఆమెదే సుమీ, భలే చాన్స్ కొట్టేసింది, ఆమెకు స్వాగతం పలుకుతూ అప్పుడే గీతా ఆర్ట్స్ వాళ్లు వెల్‌కమ్ చెబుతూ సోషల్ పోస్టు పెట్టేశారు, ఆమె బర్త్ డే సందర్భంగా, నక్కతోక తొక్కింది… ఇలా బోలెడు రాసేస్తున్నారు తెలుగు జర్నలిస్టులు… వార్త ఏదైనా సరే భజన ఉండాల్సిందే కొందరు రాసే వార్తల్లో…
నిజమా… మరీ అంత నక్కతోక తొక్కినట్టేనా..? మురిసిపోవాల్సిందేనా..? అంత సీనేమీ లేదు… నిహారిక గురించి తెలిసినవాళ్లు నవ్వుకుంటారు… ఆమె దూకే జలపాతం టైపు… ఇలాగే పారాలి, ఇటువైపే ప్రవహించాలి వంటి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మన్నూమశానం ఏమీ తెలియవు ఆమెకు… ఆ క్షణం తనకు ఏది తోస్తే, ఏది నచ్చితే అటువైపు దూకేస్తుంది, అంతే… సీరియస్‌గా కాదు, సరదాగా… అందరినీ ఆహ్లాదపరుస్తూ…
అలాగని ఆమెకు ఇదేమీ తొలి సినిమా కాదు, ఆల్రెడీ తమిళంలో ఓ సినిమా అంగీకరించి చేస్తోంది… ఈ సినిమాలు, అవకాశాలు నిజం చెప్పాలంటే ఆమెకు జుజుబీ… ఎందుకంటే..? ఇలాంటి చాన్సులకు హబ్బ, ఇక బతుకెంత బంగారమో అని పొంగిపోయే కేరక్టర్ కాదు ఆమె… ఇంతకీ ఎవరామె..?
Ads
బేసిక్‌గా బెంగుళూరు రూట్స్, ఎక్కడో తెలుగు మూలాలు కూడా కలిసినట్టు డౌట్… అప్పుడప్పుడూ ఆమె వీడియోల్లో హఠాత్తుగా ఏవో తెలుగు మాటలు ఫ్లోలో వచ్చేస్తుంటాయి… పుట్టిందేమో చెన్నై… తరువాత ముంబైలో ఉంది… ఫుల్ అకడమిక్ మెరిట్ ఉంది… ఇంజనీరింగ్ చేసింది… అందరిలాగా అమెరికా వెళ్లి ఎంఎస్ చేయలేదు, కాలిఫోర్నియాలోని ఓ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది…
సరే, మళ్లీ టెక్ సైడ్… గూగుల్‌లో జాబ్ వచ్చింది… ఈలోపు ఆమె ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి, తన అకడమిక్ ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం సరదా వీడియోలు చేయసాగింది… అవి పాపులరయ్యాయి… ఈ తొక్కలో జాబ్స్ దేనికి..? క్రియేటివ్ సైడ్ నడుద్దాం అనుకుని ఆ జాబ్‌లో చేరకుండా… సోషల్ మీడియాను దున్నేయడం మొదలుపెట్టింది… లక్షల మంది ఫాలోవర్స్… ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్… దేన్నీ వదల్లేదు… తనే ఓ బ్రాండ్ కావాలనుకుంది… అయ్యింది కూడా..,.
సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్… అలాగని ఒకే తరహా వీడియోలకు కట్టబడదు… ఆమధ్య కొన్ని హిందీ, తెలుగు సినిమాలకు కూడా ప్రమోషనల్ రీల్స్ చేసి ఇచ్చింది… భిన్నంగా, సరదాగా బాగుంటయ్… మహేశ్ బాబుకు కూడా ఓ యాడ్ చేసింది… ఆమధ్య కాఫీ విత్ కరణ్ షోలో కూడా పాల్గొంది… ఎక్కడో మాయమవుతుంది, ఇంకెక్కడో తేలుతుంది… అలాగే హఠాత్తుగా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో హంగామా చేసింది… ముందే చెప్పుకున్నాం కదా… అదొక జలపాతం… ఆమె వీడియోల్లో కూడా ఆమె ఫ్లో దడదడ సాగిపోతూనే ఉంటుంది…
సరే, గీతా ఆర్ట్స్ వాళ్లు ఏ సినిమా కోసం ఏ పాత్ర కోసం తీసుకున్నారో ఇంకా క్లారిటీ లేదు, వివరాల్లేవు గానీ… రావమ్మా… తెలుగు తెరకు ఓ పెద్ద హాయ్ చెప్పు… కానీ చిన్న డౌట్… రొటీన్ పాత్రలు ఆమెకు సూట్ కావు, వాటిల్లో ఆమె ఫిట్ కాదు, ఆమె ఫ్లో, ఆమె ఎనర్జీకి తగినట్టు పాత్ర అయితేనే నాలుగురోజులు టాలీవుడ్ మజిలి… లేదంటే ఇంకెక్కడో తేలుతుంది… ఆమెను ఆపలేం..!!
Share this Article