.
మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ.., ది ఆల్కమిస్ట్… ఈ పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధం… మార్మికంగా జీవన తత్వాన్ని చెప్పే పుస్తకాల్లో చాలా పాపురల్ ఇవి… మరి మనకు లేవా ఆ ధోరణిలో సాగే పుస్తకాలు..? భారతీయ తత్వాన్ని ఆవిష్కరించే పుస్తకాలు లేవా..? ఎందుకు ఉండవు..? చాలా ఉన్నాయి… నేను ఒక పరిచయం చేస్తాను మీకు…
నిజం చెప్పాలంటే … ఒక యోగి జ్ఞాపకాల పరంపర… ఇదీ ఆ పుస్తకం పేరు… చదువుతూ ఉంటే గాఢమైన ఆలోచనల్లోకి… ఆత్మమథనంలోకి, ఆధ్యాత్మిక అన్వేషణలోకి మనల్ని తీసుకెళ్తుంది… ఒక పంజాబీ యువకుడు తాను కోరుకున్నట్లుగా తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడో చెప్పే కథ… కాదు, ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణం… గొప్ప మార్మిక వచన కావ్యం కూడా !
Ads
ఒక సాధారణ పంజాబీ కుటుంబం… అమిత్ మూడవ సంతానం… తన ఐదవ యేట, బొమ్మలను చూడడంతో ప్రారంభించి, ఏకబిగిని చదివేస్తుంటాడు కామిక్ పుస్తకాలు…, పండుగలప్పుడు కూడా పుస్తకాలను బహుమతిగా అడిగి పొందుతాడు.., తమ గ్రంథాలయంలోని పుస్తకాలను అత్యంత వేగంగా చదివి, గ్రంథాలయాధికారి చేత మిఠాయి డబ్బాను బహుమతిగా పొందుతాడు…
తరగతిలో అధిక మార్కులను సంపాదించడమే గాక, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, మంత్ర శాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదిస్తాడు.., అసాధారణ ధారణ శక్తి తనది… చిన్నతనం నుండీ అమ్మ చెప్పే కథలు, చేసే పూజల ద్వారా భగవంతుడు ఉన్నాడని నమ్మినవాడు…
అలా మనసులో ఓ కోరిక స్థిరపడిపోయింది… భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవాలి… అదే జీవిత ధ్యేయం… కానీ ప్రతి దానికీ ఓ సమయం వస్తుంది… అక్కడి వరకూ ఆగాలి… మెల్లిమెల్లిగా తనలోని ఓ యోగి బయటపడుతున్నాడు…
ఒక సాధువు ద్వారా లభించిన ‘సియార్ సింఘీ’ (నక్క శరీరంపై పెరిగే ఒక గడ్డ వంటిది) సాయంతో, తమ యింటిలోని పనిమనిషి కుమారుని కుష్టు రోగాన్ని నయం చేస్తాడు… సంవత్సరంలో దాదాపు నాలుగు మాసాలు ఆస్తమాకు గురవుతాడు… ఐనా సరే, రోజులో అత్యధిక గంటలు ధ్యానం చేస్తూ, ఆత్మ సాక్షాత్కారం దిశగా తన ప్రయాణం కొనసాగక తప్పదని గుర్తిస్తాడు… మాస్టర్స్ చదువు పేరిట ఆస్ట్రేలియాకు తన పద్దెనిమిదవ యేట ప్రయాణం అవుతాడు…
“మానవుడెప్పుడూ ఒంటరి కాదు. మనకు తెలియని దేశాలలో కూడా మనకు ఎవరో ఒకరు సాయపడుతూనే ఉంటారు. అది సృష్టి నైజం” అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పినట్లు.., ఆస్ట్రేలియాలో కూడా అమిత్‌కు సాయపడిన వాళ్లు అనేకులు… “అసంఖ్యాకులైన వ్యక్తులు నాకు చేసిన సహకారాన్ని గుర్తించడం నా భావ వ్యక్తీకరణకు మించినది… శరీరం లెక్కలేనన్ని కణాల యొక్క సముదాయం అయినట్లే, నా జీవితం ఇతరులు చేసిన ఉపయోగాల యొక్క క్రోడీకరణ…’’ అంటాడు తను…
తన సంపాదనతోనే చదువుకోవాలి అన్న నియమం పెట్టుకున్నాడు.., అదీ తన వ్యక్తిత్వం… మూడేళ్ళ చదువును రెండేళ్లలో ముగించేలా అనుమతిని పొందడమే కాదు, కేవలం పద్దెనిమిది నెలలలోనే కోర్సును పూర్తిచేసుకున్నాడు…
75000 డాలర్లు జీతంగా ఇస్తానన్నా సరే క్యాసినోవా ఉద్యోగాన్ని తిరస్కరిస్తాడు… మనిషికి, సమాజానికి చేటు చేసే పని చేయకూడదనేది తన నియమం… అతి తక్కువ సమయంలోనే, తన సొంత కంపెనీని ప్రారంభిచడమే కాదు, వాటి శాఖలను, కాలిఫోర్నియా, కెనడా. ఇంగ్లండ్, భారత దేశాలలో వ్యాపింపజేస్తాడు…
తన ఇరవై యెనిమిదవ యేట భారతదేశానికి తిరిగివచ్చి… జ్యూస్ బార్ల చైన్ ప్రారంభించడమే కాదు, ఒక ఆయుర్వేద కంపెనీని కూడా కొనుగోలు చేస్తాడు.., సమయం ఆసన్నమైంది… ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయాణం కోసం… తన 31వ జన్మదినాన వారణాసికి చేరుకున్నాడు అమిత్…
మొదట గురువు కోసం అన్వేషణ… ఒక నాగ సాధువును గురువుగా అంగీకరించి, అతని నుండి దీక్షను స్వీకరిస్తాడు… తరచూ అభోజనంగా ఉంటాడు… ఆ ప్రాంతంలోని విషపురుగులు కుడితే… కొన్నిసార్లు మరణపు అంచుల దాకా వెళ్లివస్తాడు… కానీ ఒకటి చెబుతాడు… ‘‘ఇవన్నీ నాకు పరీక్షలు… దైహికంగా, మానసికంగా తనను గట్టిపరిచేవి’’…
హరిద్వార్, జోషీమఠ్, బద్రీనాథ్ వెళ్తాడు… హిమాలయ పర్వత ప్రాంతాలలో తారసపడిన భైరవి సూచన ప్రకారం, ఒక గుహను ఎన్నుకుంటాడు.., కొన్నిసార్లు రోజుకు 22 గంటలు ధ్యానంలోనే… తద్వారా తనలోని అంతఃచేతనను మరింత జాగృతం చేసుకోవడం…
శ్రీయంత్రం మంత్రంతో జగన్మాతను ధ్యానం చేయడం ప్రారంభించిన సరిగ్గా నలభై రోజులకు, 13 ఫిబ్రవరి 2011 నాడు జగన్మాత దర్శనాన్ని పొందగలిగాడు అమిత్ అన్న ఈ సాధకుడు. ఓ హిమాలయ యోగి…
(హిమాలయాల్లో యోగి ఆత్మ- పరమాత్మల సాక్షాత్కారం పొందిన ప్రాంతం)
జగన్మాత సాక్షాత్కారం తరువాత తన యింటనే మొదటిసారి భిక్షను స్వీకరించాలనుకుని 2011 అక్టోబర్ 7వ తారీఖున తన యింటికి చేరుకున్నాడు… తనను చూసి చేతులను జోడించిన తన తల్లిని అలా చేయవద్దని వారించి… తాను కనుగొన్న జగన్మాత ఒడికన్నా తన మాతృమూర్తి ఒడి తక్కువది కాదు అంటాడు…
తనేమంటాడంటే… జీవితం చాలా చిన్నది… ఒక వేడుకగా జీవించాలి… ఎదుర్కునేందుకు ఇదేమీ సవాల్ కాదు… పోరాడటానికి ఇదేమీ శత్రువు కూడా కాదు… పరిష్కరించడానికి సమస్య కాదు… ఇదొక ప్రవాహం… మనం చేయవలసిందల్లా ఆ ప్రవాహంతోపాటు మనమూ ప్రవాహించడమే… జీవించాలి, ప్రేమించాలి, నవ్వాలి, ఇవ్వాలి…’’
తాను జన్మించక ముందే ‘నీ మూడవ కుమారుడు యోగి అవుతాడు.’ అని ఒక సాధువు తన తల్లితో చెప్పాడట… ఈ యోగి ఆధ్యాత్మిక అనుభవాలు, ఆ ప్రయాణంపై రాయబడిన “If truth be told A monk’s memoir”కు తెలుగు అనువాదమే ఈ నిజం చెప్పాలంటే … ఒక యోగి జ్ఞాపకాల పరంపర… జోశ్యుల పబ్లికేషన్స్ వారి ప్రచురణ… ప్రతులకు: జోశ్యుల పబ్లికేషన్, 9704683520
Share this Article