.
నో చెప్పడం ఈజీనే.. కానీ ఆ తర్వాత ?
నో చెప్పడం చాలా కష్టమని అంటుంటారు. అది నిజమే. కానీ బడా వ్యాపార సంస్థలు చాలా ఈజీగా నో చెప్పేస్తుంటాయి. తమ వ్యాపార సామ్రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. తామే కింగులమనే పొగరుతో.. వచ్చే ప్రతీ ప్రపోజల్‌ను.. కింద స్థాయి ఉద్యోగులు ఇచ్చే సలహాలను పక్కకు పెట్టి ఈజీగా నో చెప్తుంటాయి.
Ads
ఇలా నో చెప్పి కంపెనీనే మూసేసుకున్న కొడాక్ సంస్థ గురించి చాలా సార్లు చదివాం. కంపెనీలో పని చేసే ఒక ఉద్యోగి డిజిటల్ కెమేరా తయారు చేసి.. టాప్ మేనేజ్‌మెంట్‌కు చూపిస్తే.. ఘాటుగా తిరస్కరించడం.. ఆయన ఆ కెమేరా మోడల్ తీసుకెళ్లి సోనీ సంస్థకు ఇవ్వడం. అంతిమంగా కొడాక్ సంస్థ దివాళా తీయడం మన కళ్ల ముందు జరిగిన చరిత్రే.
ఇలాగే నో చెప్పి.. తన వ్యాపార సామ్రాజ్యాన్నికుప్పకూల్చుకున్న మరో సంస్థ కూడా ఉంది. అదే ఆడిడాస్.
1984లో బాస్కెట్‌బాల్‌ను రెండు కంపెనీలు కంట్రోల్ చేసేవి. అవే ఆడిడాస్ అండ్ కన్వర్స్. బాస్కెట్ బాల్ ప్లేయర్లను ఈ రెండు కంపెనీలే స్పాన్సర్‌షిప్ ఇస్తూ.. ఆ ఆటను, ఆ ఆటగాళ్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నాయి.
ఎనబైలలో కన్వర్స్‌కి లారీ బర్డ్, మాజిక్ జాన్‌సన్ అనే బాస్కెట్‌బాల్ ప్లేయర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవారు. మ్యాజిక్ అండ్ బర్డ్ జంటగా వారిద్దరు చాలా ఫేమస్. అలాగే ఆడిడాస్ కంపెనీకి కరీమ్ అనే ప్లేయర్ బ్రాండ్ అంబాసిడర్. కరీమ్ పూర్తి పేరు కరీమ్ అబ్దుల్ జబ్బార్. ఈ రెండు సంస్థలకు ఈ ముగ్గురే బ్రాండ్ అంబాసిడర్లు. పైగా అప్పట్లో వాళ్లకే ఫ్యాన్ బేస్ ఎక్కువ.
అయితే ఈ రెండు కంపెనీలను బీట్ చేయాలని నైకీ మొదటి నుంచి ప్రయత్నించేది. కానీ దాని వల్ల కాలేదు. అలాంటి సమయంలో ఒక అద్భుతమైన నిర్ణయం నైకీ సంస్థ గతినే మార్చేసింది. ఇక్కడ ఆడిడాస్‌కు ఎప్పటి నుంచో కరీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అయితే అతను రిటైర్మెంట్‌కు దగ్గర పడుతుండటంతో మరో క్రీడాకారుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుందామని ఆడిడాస్ మేనేజ్‌మెంట్‌కు ఉద్యోగులు చెప్పారు.
అంతే కాకుండా.. అప్పుడే కాలేజీ లెవెల్‌లో స్టార్‌గా మారిన ఒక యువ ఆటగాడిని తీసుకొని వచ్చి.. ఇతనితో ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పారు. ఆ యువ క్రీడాకారుడితో ఫైనల్ చర్చల వరకు కూడా సాఫీగానే సాగాయి. కానీ చివరి నిమిషంలో ఆ కుర్రాడిని రిజెక్ట్ చేసి.. మళ్లీ కరీమ్‌నే కొనసాగించింది ఆడిడాస్. కట్ చేస్తే..
అదే కుర్రాడితో నైకీ ఒప్పందం కుదుర్చుకుంది. మామాలుగా ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చింది. అంతే కాకుండా అతని కోసం ప్రత్యేకంగా షూస్ తయారు చేసి ఇస్తామని.. అతే కాకుండా అతని షూ డిజైన్ విషయంలో పూర్తిగా ఆ కుర్రాడి నిర్ణయాలే ఫైనల్ అని కూడా ఒప్పందం చేసుకుంది.
ఆనాడు ఏడాదికి ఒక లక్ష డాలర్లు ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే.. ఆ కుర్రాడికి ఏకంగా ఐదు లక్షల డాలర్లు ఇచ్చి మరీ నైకీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఎన్‌బీయే (నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్) చరిత్రలోనే ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు.
ఆడిడాస్ వదిలేసిన ఆ కుర్రాడే మైఖెల్ జోర్డన్. బాస్కెట్‌బాల్ అంటే క్రేజ్ లేని దేశాల్లో కూడా మైఖెల్ జోర్డాన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరో విషయం..
నైకీతో ఒప్పందం అనంతరం తొలి సారిగా 1984 అక్టోబర్ 18న మైఖెల్ జోర్డాన్ కొత్త కిట్‌తో బాస్కెట్‌బాల్ బరిలోకి దిగాడు. కానీ జోర్డాన్ వేసుకున్న షూస్‌పై ఎన్‌బీఏ అభ్యంతరం చెప్పింది. ఎన్‌బీయే రూల్స్ ప్రకారం.. క్రీడాకారులు కేవలం వైట్ షూస్ మాత్రమే వేసుకోవాలి. కానీ జోర్డాన్.. బ్లాక్ అండ్ రెడ్ నైకీ షూస్‌తో కోర్టులోకి వచ్చాడు.
జోర్డాన్ అలా రావడానికి వీల్లేదని.. షూస్ కలర్ అయినా వైట్‌గా మార్చు.. లేదటే ప్రతీ గేమ్‌కి 5వేల డాలర్లు ఫైన్ కట్టమని చెప్పారు. ఇక్కడ కూడా నైకీ భిన్నంగా ఆలోచించింది. ఒక సీజన్‌లో జోర్డన్ ఆడే అన్ని ఆటలు వైట్ షూస్ వేసుకోకపోతే దాదాపు నాలుగు లక్షల డాలర్లు ఫైన్ కట్టాలి.
అసలు దీన్నే తమ మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చుకుంటే బాగుంటుందని భావించింది. జోర్డాన్ తనకు ఇష్టమొచ్చిన రంగు షూస్ వేసుకొని కోర్టులో ఆడటానికి అనుమతి ఇచ్చింది. ప్రతీ మ్యాచ్‌కు ఫైన్‌ను నైకీనే కట్టింది.
కోర్టులో జోర్డాన్ రంగు రంగుల నైకీ షూస్ ధరించి ఆడుతుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అట్రాక్ట్ అయ్యారు. రంగురంగుల షూస్ కోసం నైకీ షోరూమ్‌లపై ఎగబడ్డారు.
Kids Wanted the shoes the NBA didn’t want them to have అంటూ భారీ క్యాంపెయిన్ నడిపింది. ఇది అమెరికాలోనే కాకుండా.. బాస్కెట్‌బాల్ ఆడే ప్రతీ దేశంలో ఒక స్లోగన్‌లా మారిపోయింది. ఆ దెబ్బకు నైకీ సేల్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి.
జోర్డాన్‌ను ఎంగేజ్ చేసుకొని.. అతని ద్వారా 3 మిలియన్ డాలర్లు సంపాదించాలని నైకీ టార్గెట్ పెట్టుకుంటే.. ఆ ఏడాది ఏకంగా 126 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. కేవలం నాలుగు లక్షల ఫైన్ కట్టి.. అంతేలేని మార్కెటింగ్‌ను నైకీ అప్పనంగా తెచ్చుకుంది. 1984లో 40 మిలియన్ డాలర్లుగా ఉన్న నైకీ అమ్మకాలు..
జోర్డాన్ వచ్చిన తర్వాత 1985లో 126 మిలియన్ డాలర్లకు.. 1990 నాటికి ఒక బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నైకీ ఒక వైపు అమాంతం సేల్స్ పెంచుకుంటుండగా.. ఆడిడాస్ తన వ్యాపార సామ్రాజ్యానికి తానే బీటలు వారేలా చేసుకుంది.
తాము వద్దు అనుకున్న కుర్రాడు.. ప్రత్యర్థి సంస్థకు బిలియన్ల కొద్దీ డాలర్లను సంపాదించి పెడుతుండటం ఆడిడాస్ చూస్తూ ఉండిపోయింది. ఒక విషయం ఏంటంటే.. నైకీ కేవలం జోర్డాన్ బ్రాండ్ మీద 5.1 బిలియన్ డాలర్లు సంపాదించింది. ఇందులో జోర్డాన్‌కు వెళ్లిన షేరే 1.7 బిలియన్ డాలర్లు.. అందుకే నో చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. #భాయ్‌జాన్ ….. జాన్ కోరా (ఆండ్రాయిడ్‌ను కాదనుకుని దెబ్బతిన్న నోకియా కథ కూడా ఇదే)
Share this Article