అందుకే అంటారేమో… సినిమాను సినిమాలాగా మాత్రమే చూడు, లాజిక్కుల్లోకి, లా పాయింట్లోకి వెళ్తే మ్యాజిక్కు మిస్సవుతాము అని… రాఘవేంద్రరావే అనుకుంటా ఇలా అన్నది…! ఐనాసరే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఏదో ఓ పాయింట్ దగ్గర, ఏంటి కథారచయిత, దర్శకుడు ఇలా తప్పులో కాలేశారు అని అనిపిస్తే చాలు, ఇక సినిమా మొత్తమ్మీద ఫీల్ చెడిపోతుంది…
వరుణ్ సందేశ్ నటించిన నింద సినిమానే తీసుకుందాం… సినిమా కథలో హీరో తండ్రి ఓ జడ్జి… తన ముందుకు ఓ మర్డర్ కేసు వస్తుంది… ఒక యువతిపై లైంగిక దాడి చేసి, హతమార్చిన కేసు… పోలీసులు ఓ నిందితుడిని ప్రవేశపెడతారు, డీఎన్ఏ రిపోర్ట్స్ తోపాటు బలమైన సాక్ష్యాలు, వాదన ప్రజెంట్ చేస్తారు…
అవన్నీ నిందితుడి మెడ చుట్టూ బిగుసుకునేలా ఉంటాయి… దాంతో జడ్జి ఒకవైపు ఆ నిందితుడు అసలైన నేరస్తుడు కాదని నమ్ముతూనే ఉరిశిక్ష విధిస్తాడు… కానీ తన తీర్పు సరికాదనే వేదనతో జాబ్ వదిలేస్తాడు, చివరకు అదే బాధతో కన్నుమూస్తాడు… సరే, తరువాత హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో పనిచేసే హీరో వచ్చి, సొంత దర్యాప్తు మొదలుపెడతాడు, అదంతా వేరే కథ…
Ads
జడ్జి కుర్చీలో కూర్చున్నాక… తన ఎదుటకు ఎలాంటి ఆధారాలు వచ్చాయో మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటాడు… తన నమ్మకాలు, ఫీలింగ్స్ ముఖ్యం కాదు… ప్రాసిక్యూషన్ ఎంత బలంగా నేరం నిరూపించడానికి ప్రయత్నిస్తుందనేదే ప్రధానం… సో, ఇక్కడ జడ్జి మనో వేదనను అంత తీవ్రంగా చూపించడం ఎందుకో సరైందిగా అనిపించలేదు… మరీ ఆ బాధతో మరణించేంతగా..!! ఒకవేళ తను ఓ నిరపరాధిని శిక్షిస్తున్నానేమో అనే ఫీలింగ్ ఏర్పడితే… బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో శిక్ష తీవ్రంగా ఉండకుండా జాగ్రత్తపడతారు… మరీ ఉరిశిక్షను విధించరు…
చాలామంది జడ్జిలు ఇలాంటి కేసుల్లో యావజ్జీవం వేస్తున్నట్టు మనం గమనించొచ్చు… రెమిషన్లు ఎట్సెట్రా పోతే పదీపన్నెండేళ్లలో బయటికొస్తున్నారు, ఏమో, ఏ అధికార పార్టీయే కరుణిస్తే ఇంకా ఆలోపే బయటికి రావచ్చు కూడా… సినిమాలో ఈ పార్ట్ అంత కన్విన్సింగుగా అనిపించకపోయేసరికి ఇక సినిమా మీద ఇంట్రస్టు పోతుంది…
నిజానికి ఇది డిఫరెంట్ స్టోరీయే… పైగా క్లీన్ సినిమా… వరుణ్ సందేశ్ హేపీడేస్, కొత్తబంగారులోకం తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరే, ఒక్కటీ క్లిక్కవడం లేదు… ఇది కొంత డిఫరెంట్ జానర్‌గా, కొత్తకొత్తగా కథ ఉంది, ఈ మర్డర్‌కూ ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ముడేసి ఓ కథ రాసుకున్నాడు దర్శకుడు… చివరి వరకూ కథలో సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగానే మెయింటెయిన్ చేశాడు…
సరే, కథనం, సీన్లు అంత పకడ్బందీగా అనిపించకపోయినా… స్థూలంగా సినిమా వోకే… వరుణ్ సందేశ్ ఇన్నేళ్లుగా ఫీల్డ్‌లో ఉన్నాడు గానీ ఇంకా ఇప్పుడిప్పుడే కొత్తగా నటిస్తున్నాడు అన్నట్టుగా ఉంటాయి కొన్నిచోెట్ల తన భావోద్వేగ ప్రదర్శనలు… ఇతర నటీనటులు కూడా వోకే… అన్నీ బాగా చేసింది… ఓవరాల్‌గా సినిమా పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా, మరీ తీసిపారేసే సినిమా అయితే కాదు..!
Share this Article