.
అమ్మా, పది రూపాయలు ఇవ్వమ్మా, రెండు రోజుల నుంచీ అన్నం తినలేదు అని అడుక్కుంటున్నాడు ఓ ముష్టివాడు… అయ్యో, అదేం పాపం..? అన్నం దొరక్కపోతే కనీసం పిజ్జాయో బర్గరో కొనుక్కుని తినకపోయావా అందట ఓ మహాధనిక వయ్యారి…!
ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సంబంధించిన వార్త ఒకటి చదువుతుంటే అదే స్పురించింది హఠాత్తుగా, ఎందుకో తెలియదు గానీ… ముందుగా ఆ వార్ద చదువుదాం.,.. బోస్టన్‌లో అనుకుంటా, ఏదో మీట్‌లో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు బాసిణి…
Ads
‘‘మాకు ఓ ఫిక్స్‌డ్ బడ్జెట్ ఉంటుంది, అందులో నుంచే ఆటగాళ్ల కొనుగోలు వ్యయం భరించాలి… అందుకని దేశీయ క్రికెట్ పోటీల్లో ఆడే క్రీడాకారుల్లో టాలెంట్ హంట్ చేస్తుంటాం… రంజీ పోటీలే కాదు, డొమెస్టిక్ పోటీలన్నీ గాలిస్తుంటాం…
హార్డిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా (ఇద్దరూ అన్నదమ్ములు) చాలా పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు… నాకు పరిచయం చేసినప్పుడు బక్కపలుచగా నీరసంగా కనిపించారు… వాళ్లే చెప్పారు నాకు… మూడేళ్లుగా తినడానికి ఏమీ దొరక్కపోతే మ్యాగీ నూడుల్స్ తిని బతికాం అని… హార్డిక్‌ను మేం జస్ట్ పది వేల డాలర్లకు కొన్నాం 2015లో… ఇప్పుడు చూడండి, మా జట్టుకు తను కెప్టెన్…
(మధ్యలో ఒకటీరెండేళ్లు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి విడిపోయి గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు ఆడాడు, మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టులోకి ఘర్ వాపసీ తను…)
ఆకలి, పట్టుదల, నిబద్ధత, శ్రమల నుంచి ఎదిగాడు… సేమ్, బుమ్రాను కూడా ముంబై ఇండియన్స్ టీమ్ దేశవాళీ పోటీల నుంచి వెతికి పట్టుకుంది… ఇప్పుడు స్టార్ ప్లేయర్ తను… వర్తమాన స్టార్ తిలక్ వర్మ కూడా అలాగే టాలెంట్ హంట్‌లో పట్టుకున్నవాడే… అలా చాలామంది… సరే, ఆమె మంచి భావనతోనే, ఓ స్పూర్తి కథను చెబుతున్నట్టే చెప్పింది, బాగుంది… ముంబై ఇండియన్స్ జట్టుది ఐపీఎల్‌లో ఓ చరిత్ర కూడా…
ఐతే, ఆ వార్త చదువుతుంటే అకస్మాత్తుగా ఓచోట చూపు నిలిచిపోయింది… మూడేళ్లు మ్యాగీ తిని బతికారనే వాక్యాల దగ్గర… లిటరల్‌గా అది సాధ్యమేనా..? పైగా క్రికెట్ ఆటకు ఫిట్‌నెస్ ముఖ్యం… మ్యాగీ నూడుల్స్‌తో మూడేళ్లు..?!! సరే, ఆమె కొంత ఎగ్జాగరేట్ చేసిందీ అనుకుందాం… కానీ మ్యాగీ కూడా ఉచితంగా ఏమీ దొరకదు… పుణ్యానికి ఎవరూ ఇవ్వరు…
ఒకరకంగా అదీ ఖరీదైన రెడీటుకుక్ బాపతు సరుకే… వాళ్లది ఒరిజినల్‌గా బరోడా… గుజరాత్, మహారాష్ట్రలలో ఏ ఏరియాకు వెళ్లినా ఆ మ్యాగీ నూడుల్స్ ధరకే… ఇంకాస్త తక్కువకే వీథుల్లో బండ్ల మీద పోహా, డోక్లా, వడ పావ్, పావ్ బాజీ తదితర వంటకాలు ఉదయం నుంచే దొరుకుతాయి… మన సౌత్ రాష్ట్రాల్లో ఇడ్లీలాగే..!
ఉన్నప్పుడు తిన్నారు లేదా కడుపులు మాడ్చుకున్నారు లేదా సరిగ్గా తిండి కూడా దొరికేది కాదు అన్నట్టుగా ఏదో చెబితే సరిపోయేదేమో… మరీ మూడేళ్లు మ్యాగీ నూడుల్స్ తింటూ బతకడం ఏమిటమ్మా… నువ్వు కూడా ఓ మధ్యతరగతి ఇంట్లో పుట్టినదానివే… not born with golden spoon… మరీ అంటీలియా రాజభవనంలోకి వెళ్లాక ఇలా తయారయ్యావా ఏమి.,.?!
Share this Article