3 కేబినెట్ పదవులు, 2 సహాయ మంత్రులు, ఒక స్పీకర్ కావాలట చంద్రబాబుకు… ఈ డిమాండ్ నిజమో కాదో తెలియదు గానీ, గతంలోలాగే స్పీకర్ పదవిని ఇస్తే బహుశా చంద్రబాబు అంగీకరించవచ్చు… ఎందుకంటే, అక్కడ కేబినెట్ మంత్రుల రూపంలో ఢిల్లీలో వేరే పవర్ సెంటర్స్ ఉండటాన్ని తను ఇష్టపడడు…
గతంలో కూడా బాలయోగిని స్పీకర్ చేస్తే ఇంకేమీ అడగలేదు… కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం మీదెక్కి స్వారీ చేశాడు… అదెలా ఉంటుందో మోడీ బయట నుంచి చూశాడు… గుజరాత్ ముఖ్యమంత్రిగా చూశాడు… గుజరాత్ అల్లర్లకు సంబంధించి వాజపేయి ఎలాగూ మోడీతో రాజీనామా చేయిస్తాడని నమ్మి, ఆ క్రెడిట్ తను తీసుకోవాలని భావించి, మోడీ రాజీనామాకు డిమాండ్ చేశాడు… కాకపోతే అద్వానీ అడ్డుపుల్ల వేయడంతో మోడీ సేఫ్…
తరువాత కూడా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు కలిసి ఏమేం చేశారో, ఎలా యూటర్న్‌లు తీసుకోబడ్డాయో… చంద్రబాబు వెళ్లి కాంగ్రెస్ క్యాంపులో చేరడం, డబ్బు సర్దుబాటు ఎట్సెట్రా అన్నీ మోడీకి తెలుసు… ఐనాసరే, మళ్లీ ఎన్డీయే కూటమిలోకి తీసుకోవడానికి కారణం జగన్ పట్ల జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను ముందే పసిగట్టడం…
Ads
ఎస్, సంకీర్ణ శకంలో బీజేపీ గత పదేళ్లలో తీసుకున్నట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు… బీజేపీ ప్రణాళికలన్నీ తాత్కాలికంగా అటకెక్కినట్టే… మరోవైపు ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఎన్డీయేతో ఉన్నా సరే, కాంగ్రెస్ తనను ఎప్పుడూ రారమ్మని ఊరిస్తూనే ఉంటుంది… ఠాక్రే శివసేన, ఆర్జేడీ బహిరంగంగా నితిశ్, చంద్రబాబులకు ఆహ్వానం పలుకుతున్నాయి… అదే జరిగితే..?
నితిశ్ 12, బాబు 16… జనసేన కూడా కలిపితే 30… వీళ్లు బయటికొస్తే ప్రస్తుత 292 బలం కాస్తా 262కు పడిపోతుంది… అంటే, మోడీ ప్రధాని కుర్చీ ఖాళీ చేయాల్సిందే… లేదా చిన్నాచితకా ఇతర పార్టీలను కూడగట్టుకోవాల్సి ఉంటుంది… ఆల్రెడీ ఠాక్రే శివసేనతో పాత దోస్తీ పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు… అది సాధ్యమో కాదో తెలియదు గానీ… ప్రస్తుతానికి నితిశ్, చంద్రబాబుల నుంచి లిఖితపూర్వక మద్దతు తీసుకున్నాడు మోడీ…
నితిశ్ జంపింగుల్లో సిద్ధహస్తుడు… తను ఎప్పుడూ బీజేపీతో సయోధ్యతో ఉంటాడని ఏమీ లేదు… అదీ కాస్త తిక్కమేళమే… సో, మోడీ ఎప్పుడూ ప్లాన్-బి ఆలోచనల్లో ఉండాల్సిందే… ఒకవేళ చంద్రబాబు, నితిశ్ అలా కాంగ్రెస్ కూటమిలోకి జంపినా సరే వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ ఏమీ రాదు… ఐనాసరే, ఇతరుల కేటగిరీలో ఉన్న 17 మందిలో ఓ పది మందిని కూడగట్టడం సమస్యేమీ కాదు…
అదే జరిగితే జగన్ 4 సీట్లు మోడీ వైపు వస్తాయి… చంద్రబాబు దూరమైతే జగన్ దగ్గరవ్వాలి కదా మరి… సో, మరో అయిదారు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు సీరియస్‌గా అమిత్ షా రంగంలోకి దిగితే… ఐనాసరే, మోడీ ప్రతిపక్షంలోకి సిద్ధపడితే… అప్పుడు ఉంటుంది తమాషా… స్టాలిన్, తేజస్వి, శరద్ పవార్ వంటి నేతలతో కాదు గానీ… అఖిలేష్, మమత, కేజ్రీవాల్ పెట్టే షరతులు, వాళ్లు చేసే స్వారీతో, కొట్లాటలతో నిత్యం ఆసక్తికరమైన సినిమా చూడొచ్చు మోడీ…
వీటన్నింటికన్నా బీజేపీ హైకమాండ్ చంద్రబాబు, నితిశ్ తోకజాడించినా ప్రమాదం లేని ఏదో ప్లాన్‌కు రూపకల్పన చేసుకుని, అన్నిరకాలుగా సిద్ధం కావడమే… ఎందుకంటే… యూటర్న్ అనే పదానికి ఐకన్స్ నితిశ్, చంద్రబాబు..!!
Share this Article