.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఆశాభంగమే ఇది… అఖండ2 తాండవం సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు… ఇది ఎవరో కాదు, సాక్షాత్తూ నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ సంస్థ తనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది… నో రూమర్, నో గాసిప్…
అఖండ సూపర్ హిట్ తరువాత దాని సీక్వెన్స్‌గా దీన్ని నిర్మించారు… ప్రజెంట్ మూవీ ట్రెండ్ పౌరాణికం, దైవశక్తి టచ్ చేస్తూ సాగే హైవోల్టేజీ యాక్షన్ సినిమాగా ప్రచారం జరుగుతూ ఉంది ఇన్నాళ్లుగా… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అత్యంత ఉదారంగా స్పెషల్ షో, టికెట్ రేట్ల భారీ హైక్ ప్రసాదించాయి కూడా…
Ads

నందమూరి థమన్ మరోసారి రెచ్చిపోయాడనీ…, సింహ- లెజెండ్ – అఖండ వంటి సినిమాల కాంబో కదా, బోయపాటి శ్రీను ఈ సీక్వెన్స్‌లో బాలయ్యను మరింతగా ఎలివేట్ చేశాడనీ… నాన్ – థియేటర్ వ్యాపారం కూడా భారీగా సాగిందనీ వార్తలు వచ్చాయి… పర్టిక్యులర్‌గా ఏపీ జిల్లాలో అనేకచోట్ల బాలయ్య ఫ్యాన్స్ (అమెరికాలో కూడా) రిలీజ్ జైబాలయ్య ఉత్సవాలు స్టార్ట్ చేశారు… కానీ..?

ఇక్కడి వరకూ బాగానే ఉంది… కానీ హఠాత్తుగా ప్రీమియర్ షోలు ఆపివేయబడ్డాయి… అబ్బే, ఏదో టెక్నికల్ సమస్య, అబ్రాడ్‌లో యథాతథంగా ఉంటాయి, అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాం అని చెప్పింది ఆ నిర్మాణ సంస్థ… మరోవైపు అసలు ప్రీమియర్ల బుకింగే అంతంతమాత్రంగా ఉండి ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తూనే ఉంది…

ఇప్పుడు ఇక తాజాగా రిలీజ్ సాధ్యం కావడం లేదనీ, తమ చేతుల్లో ఉన్నవన్నీ ప్రయత్నిస్తున్నామనీ, సమయానికి రిలీజ్ చేయకపోతున్నందుకు క్షమించాలని అర్ధరాత్రి దాటాక 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన కనిపించింది…

అసలు జరిగింది ఏమిటి..? ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International) సంస్థ, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ (ప్రస్తుతం 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ‘అఖండ 2’ నిర్మితమైంది) పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది… (తమ పాత బకాయిల పంచాయితీ తేల్చుకోవడానికి ఇదే సరైన సమయమనీ, ఇప్పుడు ఒత్తితేనే సమస్య సాల్వ్ అవుతుందనీ, 14 రీల్స్ ప్లస్ దిగివస్తుందని ఆ నిర్మాణ సంస్థ అనుకుంది)…

గతంలో ఈ రెండు సంస్థలు కలిసి నిర్మించిన ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి సినిమాల నష్టాలకు సంబంధించి రూ. 28 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఈరోస్ ఆరోపించింది… ఈ వివాదం కారణంగా, కోర్టు ‘అఖండ 2’ సినిమా విడుదలను నిలిపివేయాలని (Stay) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది…

తీరా ఇప్పుడు సమయానికి కోర్టు బయట సమస్యను, వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం ఏదో జరిగింది గానీ వర్కవుట్ కాలేదు… పీఠముడి బిగిసింది ఎక్కడో… ఈ బకాయిలు చెల్లించే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా ఏ రూపంలోనూ విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది…

ప్రస్తుతానికి, ఈ లీగల్, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు… నిర్మాతలు కోర్టులో ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటేనే కొత్త విడుదల తేదీ ఖరారవుతుంది…

భారీ సినిమాల రిలీజుకు ముందే ఏమేం సమస్యలున్నాయో అన్నీ పరిష్కరించుకోకుండా… నిర్లక్ష్యం వహిస్తే, ఏమీకాదులే అనే ధీమా కనబరిస్తే ఏమవుతుందీ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ… తమిళంలో ఏదో కార్తి సినిమా రిలీజుపై కూడా కోర్టు స్టే ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి…

అవును, సినిమా అంటేనే ఓ దందా… వినోద వ్యాపారం… ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి, తేడా వచ్చినప్పుడు కోర్టులు, పంచాయితీలు తప్పవు… ఇక్కడ జరిగిందీ అదే… ప్రభుత్వాలు అత్యంత ఉదారంగా భారీగా ప్రేక్షకుల నుంచి డబ్బు కొట్టేయండి అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సరే, అననుకూల పరిస్థితులు ఇదుగో ఇలా తరుముకొస్తాయి… సినిమా కథలోలాగా ఇందులో ఏ అఖండ దైవశక్తీ వాళ్లకు సాయపడదు..!!

ఆమధ్య ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీమియర్ల రోజున కూడా ఇలాంటి టెన్షన్ వాతావరణమే కనిపించింది… చివరి క్షణాల్లో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో క్లియరెన్స్ వచ్చింది… ఈసారి కూడా అలానే జరుగుతుందని అనుకొన్నారు… కానీ వర్కవుట్ కాలేదు…

Share this Article