ఓ మిత్రుడి వాల్ మీద ఓ పాత క్లిప్పింగ్ కనిపించింది… అదేలెండి, ఈనాడు… చంద్రబాబు పోలవరం మీద పార్టీ వాళ్లకు ఏదో ప్రజెంటేషన్ ఇస్తూ, పోలవరం పూర్తి చేస్తే అది చైనాలోని త్రీగార్జెస్‌ను మించిన ప్రాజెక్టు అవుతుంది… రోజుకు 500 టీఎంసీల నీటిని తీసుకెళ్లవచ్చు… మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇక సస్యశ్యామలం అంటూ కోతలు కోస్తున్నాడు.,. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికీ ఈ రేంజ్ కూతలు, కోతలు సాధ్యం కావు…
పోలవరం స్థాయి త్రీగార్జెస్ అట, 50 లక్షల క్యూసెక్కులను ఆ పాయింట్ నుంచి తరలించవచ్చునట… సారు గారి కోతలు, కూతలు చాలా విన్నాం గానీ బహుశా ఇది అల్టిమేట్ అయి ఉంటుంది… అది చదువుతుంటే అప్పుడెప్పుడో 2000లో కావచ్చు, ఈయన గారి విజన్ అంచనాలు విని స్విస్ ఆర్థికమంత్రి పాస్కల్ కొచెపిన్ మూర్ఛబోయినంత పనిచేశాడు… మా దేశంలో ఇలా ఎవరైనా చెబితే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తాం లేదా జైలుకు పంపిస్తాం అని అక్కడికక్కడే, చంద్రబాబు ఎదుటే కుండబద్ధలు కొట్టేసిన తీరూ గుర్తొచ్చింది…
Ads
సరే, ఈ కథనం ఆయన గారి ఏతులు (గొప్పలు), కూతలు, కోతల గురించి కాదు… అదే పోలవరం గురించే చెప్పుకుందాం ఓసారి… అది ఏపీ ప్రజలకు ఓ స్వప్నం… వైఎస్ పీరియడ్‌లో స్టార్ట్ చేసి ఓ దిక్కుమాలిన కంట్రాక్టర్‌కు అప్పగించాడు… సదరు కంట్రాక్టర్ తత్వం తెలిసిందే కదా, ఇటు పుల్ల అటు కదల్లేదు, వందల కోట్లకు రెక్కలొచ్చాయి… రాష్ట్రం విడిపోయింది, బాబు గారు వచ్చారు…
వారం వారం సమీక్ష అన్నాడు, అదుగో పోలవరం చూడండి అంటూ వేలాది మంది టూరిస్టులను తరలించాడు… అదుగో ఆ రికార్డు, ఇదుగో ఈ రికార్డు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊదరగొట్టాయి… తీరా ఏమైంది..? జగన్ వచ్చేనాటికి ప్రాజెక్టు మొదటి దశ కూడా పూర్తి కాలేదు… కాఫర్ డ్యామ్ కట్టి గ్రావిటీ ద్వారా నీళ్లు పారించి, అదే పోలవరం అని భ్రమపెట్టాలనీ అనుకున్నాడు, అదీ జరగలేదు… పైగా కాఫర్ డ్యామ్ మాత్రమే కాదు, డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిన్నది… ఈలోపు పట్టిసీమ అనే నిధుల ఎత్తిపోతల చేపట్టి, మేఘా వాళ్ల కోసం, తన కోసం కష్టపడిపోయాడు…
మరి జగన్ వచ్చాక ఏం జరిగింది..? తెలుగుదేశం ఆర్థికస్థంభం నవయుగను పోలవరం నుంచి తప్పించాడు… మస్తు ఎలక్టోరల్ బాండ్స్ కొంటాడు కదా, మేఘాను తీసుకొచ్చారు… పోలవరం ప్రాజెక్టు కాస్తా భూసేకరణ వ్యయం భరించలేమనే భావనతో కేంద్రం దాన్ని రెండు దశలుగా చేసింది… ఉత్తదే మాయ… మొదటి దశను జస్ట్ ఓ బరాజ్ స్థాయికి మార్చింది… రెండో దశ అలా కాగితాలపై ఉండిపోతుంది… పోనీ, అదయినా పూర్తయిందా..? లేదు..! అసలు దాని ప్రోగ్రెస్ ఏమిటో ఎవరికీ తెలియదు… కాఫర్ డ్యామ్స్ లేవు, డయాఫ్రమ్ వాల్ దుస్థితి మీద కూడా సమగ్ర అధ్యయనమూ లేదు, రిపేర్లు లేవు…
దేవెగౌడను నిద్రమొహం ప్రధాని అంటుంటాం గానీ… ప్రధానిగా ఉన్న కొద్దిరోజుల్లోనే తన రాష్ట్రానికి సంబంధించి బృహత్తర ప్రాజెక్టు ఆలమట్టి స్టార్ట్ చేశాడు… ఇప్పుడది కర్నాటకకు జీవగర్ర… దాని ఎత్తు కూడా పెంచబోతున్నారు… రాష్ట్రం కోసం పనిచేయడమంటే అదీ… కావేరి జలాల మీద కర్నాటక ప్రయోజనాల కోణంలో నో కాంప్రమైజ్ అన్నాడు…
ఇప్పుడిది చెప్పుకోవడం దేనికంటే..? అంతటి ప్రధాన ప్రాజెక్టు ఈరోజుకూ ఈ ఎన్నికల్లో ఓ ప్రచారాంశం కాలేదు… ఇద్దరివీ వైఫల్యాలే కదా… సో, రెండు క్యాంపులూ సైలెంట్… అసలు ఇదే కాదు, గోదావరి టు పెన్నా వయా కృష్ణా అన్నారు, ఏమీ లేదు… ఏమాటకామాట… అడ్డగోలు కమీషన్ల కోసమా, డిజైన్ల లోపాలా, నాణ్యతాలోపాలా, నాసిరకం పనులా అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే కేసీయార్ కాళేశ్వరం ప్రాజెక్టు బుల్లెట్ స్పీడుతో కట్టి చూపించాడు… సరే, ప్రాజెక్టు ఫెయిల్యూర్లు, కేసీయార్ శాపాలు అనే చర్చ ఎలా ఉన్నా… అంతటి పోలవరం దిశలో పదేళ్ల ఏపీ ప్రభుత్వాలు ఏం చేయగలిగినట్టు..?! దురదృష్టవశాత్తూ ఏపీ ప్రజలు కూడా ఇక ఆశలు వదిలేసుకున్నట్టున్నారు..!!
Share this Article