Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ విధంగా మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఓ ఇబ్బంది తప్పిపోయింది…

December 16, 2023 by M S R

Nancharaiah Merugumala…….   తెలంగాణ అసెంబ్లీలో తొలి, చివరి ఆంగ్లో ఇండియన్‌ ఎల్విస్‌ స్టీవెన్సన్‌! 2019 రాజ్యాంగ సవరణతో ‘ఆంగ్లో ‘ను నామినేట్‌ చేయించాల్సిన పని సీఎం రేవంత్ రెడ్డికి తప్పింది!

……………………………

లోక్‌ సభలో ఇద్దరు, రాష్ట్రాల శాసనసభల్లో ఒక్కొక్కరు చొప్పున ఆంగ్లో ఇండియన్లను వరుసగా నామినేట్‌ చేసే నిబంధనను నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ బీజేపీ సర్కారు తొలగించింది. దీంతో పార్లమెంటు ఎన్నికలవ్వగానే కేంద్రంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌ సభకు నామినేట్‌ చేసే ఆనవాయితీకి తెరపడింది.

Ads

అలాగే, దేశంలో ఆంగ్లో ఇండియన్లు చెప్పుకోదగ్గ లేదా ఒక మోస్తరు సంఖ్యలో ఉండే రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రికమండ్‌ చేసే ఒక్కొక్కరిని ఆయా అసెంబ్లీల సభ్యులుగా గవర్నర్లు నియమించే లేదా నామినేట్‌ చేసే సదుపాయం రద్దయిపోయింది. 2019 డిసెంబర్‌ లో పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభలు ఆమోదించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లు–2019తో (ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం పేరుతో అమల్లోకి వచ్చింది) దేశంలో ఆంగ్లో ఇండియన్లకు కేంద్ర, రాష్ట్ర దిగువ చట్టసభల్లో (లోక్‌సభ, అసెంబ్లీలు) నామినేషన్‌ ప్రక్రియ ద్వారా చోటు సంపాదించే వెసులుబాటు లేకుండా పోయింది.

ఎస్సీలు, ఎస్టీలకు భారత చట్టసభల్లో కోటా కల్పించే రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రతి పదేళ్లకూ పార్లమెంటు తాజాగా ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో 2019 డిసెంబర్‌లో ఈ సవరణ బిల్లులో ఎస్సీ, ఎస్టీలతోపాటు ప్రతి దశాబ్దంలో నామినేషన్‌ కోటా పొందుతున్న ఆంగ్లో ఇండియన్ల పేరు చేర్చకపోవడంతో ఈ ప్రత్యేక వర్గానికి 2020 నుంచీ ఈ మాత్రం స్వల్ప కోటా కూడా లేకుండా పోయింది.

దీనికి కారణాన్ని నాటి కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా వివరిస్తూ, ‘2011 దేశ జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో కేవలం 296 మంది ఆంగ్లో ఇండియన్లు మాత్రమే ఉన్నారని తేలింది. అందుకే వారికి ఉన్న నామమాత్రపు నామినేషన్‌ కోటాను ఈ సవరణ బిల్లులో చేర్చలేదు,’ అని వివరించారు.

ఆంగ్లో ఇండియన్ల జనాభా లక్షపైనే ఉంటుందని అంచనా

……………………………………………………………..

దేశంలో ఆంగ్లో ఇండియన్ల జనాభా లక్షన్నర వరకూ ఉంటుందని కొందరు అంచనా వేస్తే, కాదు, వారు కనీసం 75 వేల నుంచి లక్ష మంది వరకూ ఉన్నారని మరి కొందరు లెక్కలేసి చెబుతున్నారు. 1498లో పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డా గామా కేరళ తీరానికి వచ్చిన తర్వాత ఐరోపా దేశాల జనం భారతదేశానికి రావడం పెరిగింది. ఐరోపా పురుషులకు భారత స్త్రీలకు పుట్టిన సంతానాన్ని ఆంగ్లో ఇండియన్లు అని పిలవడం మొదలుబెట్టారు.

ఇంకా భార్యాభర్తలిద్దరూ నూరు శాతం బ్రిటిషర్లయి ఉండి ఇండియా వచ్చి స్థిరపడిపోయినా వారిని ఆంగ్లో ఇండియన్లు అనేవారట. భారత స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడే ఈ జాతీయుల జనాభా మూడు లక్షల వరకూ ఉండేది. కాని, తమ రక్తసంబంధీకులైన బ్రిటిష్‌ వారు ఇండియా విడిచి 1947 ఆగస్టు నుంచి స్వదేశానికి వెళ్లిపోయాక, భారతదేశంలో క్రైస్తవ మతస్తులైన ఈ ఆంగ్లో ఇండియన్లకు గౌరవ మర్యాదలు తగ్గిపోయాయి. వారికి ఉన్న ఆంగ్ల పరిజ్ఞానం, ఉన్నత చదువుల కారణంగా ఇంగ్లిష్‌ భాషా దేశాలైన ఇంగ్లండ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ వంటి దేశాలకు భారత ఆంగ్లో ఇండియన్లు వలసపోయి స్థిరపడ్డారు.

మొదట్లో స్టీమ్‌ ఇంజన్‌ (బొగ్గును కాల్చి ఆవిరితో నడిచే పాత రైలింజన్లు) రైలు డ్రైవర్లుగా ఆంగ్లో ఇండియన్లే ఎక్కువ మంది భారత రైల్వేల్లో పనిచేశారు. పెద్దగా కొందరు ఈ వర్గం మహిళలు కనీస చదువుతోనే టెలిఫోన్‌ ఆపరేటర్లుగా (ఈపీబీఎక్స్‌), కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల పీఏలుగా, స్టెనోగ్రాఫర్లుగా పనిచేసేవారు. మరి కొందరు ఆంగ్లో ఇండియన్‌ యువతులు, మహిళలు పెద్ద పెద్ద లగ్జరీ రెస్టారెంట్లలో డాన్సర్లుగా పేరు తెచ్చుకున్నారు.

ఆంగ్లో ఇండియన్లకు కేంద్రం సికింద్రాబాద్‌ మెట్టుగూడ, బోయిగూడా ప్రాంతాలు

………………………………………………………………………………………..

నిజాం రైల్వే, తర్వాత ఇండియన్‌ రైల్వేస్‌ లో ప్రధానమైన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కేంద్రస్థానమైన సికింద్రాబాద్‌లో సహజంగానే ఆంగ్లో ఇండియన్లు పెద్ద సంఖ్యలో ఉండేవారు. మెట్టుగూడకు చెందిన ఆంగ్లో ఇండియన్‌ యువతి డయానా హేడన్‌ (పుట్టింది 1973 మేడే రోజున) 1997లో మిస్‌ వరల్డ్‌ గా ఎంపికై (ప్రపంచ సుందరి రుజువు చేసుకున్న మూడో భారత మహిళ డయానా) సంచలనం సృష్టించారు.

మెట్టుగూడకు గొప్ప గుర్తింపు వచ్చింది ఈ ఆంగ్లో ఇండియన్‌ మహిళ వల్ల. ఇక అసలు విషయానికి వస్తే–2014 జూన్‌ 2న తెలంగాణ పుట్టాక రాష్ట్ర తొలి సీఎం అయిన కేసీఆర్‌ కొత్త స్టేట్‌ అసెంబ్లీకి మొదటి ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిగా ఎల్విస్‌ స్టీవెన్సన్‌ (1957 ఏప్రిల్‌ 12లో పుట్టుక) పేరును నాటి గవర్నర్‌కు సిఫార్సు చేయగా ఆయన నామినేట్‌ చేశారు. 119 మంది సాధారణ సభ్యులు ప్రమాణం చేశాకే స్టీవెన్సన్‌ నియామకం జరిగింది.

అయితే, 2015లో రాష్ట్ర అసెంబ్లీ నుంచి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నికల సందర్భంగా నాటి టీడీపీ ఎమ్మెల్యే, యువ నేత ఎనుముల రేవంత్‌ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ సభ్యుడు ఎల్విస్‌ స్టీవెన్సన్‌ తో ఆయన నివాసంలో భేటీ కావడం అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. స్టీవెన్సన్‌ అప్పుడు తెలంగాణ పాలకపక్షం నేతలు చెప్పినట్టు నడుచుకోవడం– హైదరాబాదులో నాటి సీఎం ఎన్‌ చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా తట్టాబుట్టా సర్దుకుని ఏపీ సర్కారును బెజవాడ మోసుకుపోవడానికి, అవశేషాంధ్ర ప్రదేశ్‌ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించి అప్రదిష్ఠపాలవడానికి దారితీసింది.

సరిగ్గా నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి బద్ధ శత్రువైన బీజేపీ సర్కారు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఫలితంగా తెలంగాణ తొలి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తనను జీవితాంతం గుర్తుంచుకునేలా చేసిన ఆంగ్లో ఇండియన్‌ వర్గానికి చెందిన గడ్డం ఉన్న మరో వ్యక్తిని నామినేట్‌ చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కు సిఫార్చు చేయాల్సిన బాధ తప్పింది.

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో డైనమిక్‌ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయించడానికి తోడ్పడినందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు తన రుణం తీర్చుకున్నారు. 2018 డిసెంబర్‌ తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్‌ రెండోసారి విజయం సాధించాక కేసీఆర్‌ మంత్రివర్గం మరోసారి స్టీవెన్సన్‌ ను అసెంబ్లీకి నామినేట్‌ చేయించాలని నిర్ణయించింది. 2019 జనవరి 17న ఇతర సభ్యులతోపాటు స్టీవెన్సన్‌ ప్రమాణం చేయడం విశేషం. దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions