ఒక రాజకీయ నాయకుడు వేరు… అందులోనూ ప్రజల ఉద్యమ ఆకాంక్షల నుంచి ఎదిగి, ప్రభుత్వంలోకి వచ్చిన నాయకుడు వేరు.., అదేసమయంలో ఒక బ్యూరోక్రాట్ వేరు… కేసీయార్ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడే కానీ తను ఇప్పుడు అలా లేడు… బ్యూరోక్రాట్ల నడుమ బందీ..! ఎక్కువ శాతం బ్యూరోక్రాట్లు జనహితానికి దూరంగానే నిర్ణయాలు, ప్రణాళికలు రచిస్తుంటారు… వాళ్లకు పోయేదేమీ లేదు కదా… క్వార్టర్లు, అడ్డగోలు జీతాలు, అట్టహాసాలు, ఆడంబరాలు, అధికారాలు, కమీషన్లు గట్రా… కానీ నాయకుడు వాళ్లకు భిన్నంగా ఉండాలి…
తను రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి… వాటిని అమలు చేయించాలి… ప్రజలకు దూరమైన కేసీయార్ దుబ్బాక, గ్రేటర్ చేదు అనుభవాల తరువాత ఒక్కసారిగా జనంలోకి వచ్చిపడ్డాడు… నేల మీదకు దిగివచ్చాడు… కానీ ఈరోజుకూ తను ఓ ఉద్యమనాయకుడిగానో, ఓ రాజకీయవేత్తగానో గాకుండా ఓ బ్యూరోక్రాట్ మనస్తత్వాన్నే ప్రదర్శిస్తున్న తీరు ఓ విషాదం… ఉదాహరణకు ఎల్ఆర్ఎస్..
Ads
.
కరోనా సమయంలో ప్రజల మీద వేల కోట్ల భారం వేయడానికి సై అన్న కేసీయార్ క్షేత్ర వాస్తవాల్ని ఓ నాయకుడిగా గుర్తించలేకపోయాడు… 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అంటే అది తప్పనిసరై… ఏడవలేక, ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు బందు పెట్టి, మెడ మీద కత్తిపెడితే, దిక్కులేక దరఖాస్తులు పెట్టుకున్నారు… అందులోనూ 100 నుంచి 200 గజాల ప్లాట్లే అధికం… రిజిస్ట్రేషన్లు ఆగిపోయి మొత్తం వ్యవహారమంతా ఓ చిక్కుముడిలా తయారైంది,., అందులో కేసీయార్ కూరుకుపోయాడు…
అవన్నీ ఎప్పుడు సార్టవుట్ కావాలి..? ఇంకా దరఖాస్తు చేయనివీ లక్షల్లో ఉంటాయి… అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు సంబంధం లేని ప్రాంతాల్లో ఒక పంచాయతీ ఒక లేఅవుట్‌కు పర్మిషన్ ఇస్తే అది చట్టవిరుద్ధం ఎలా అవుతుంది..? పోనీ, ఆ క్లారిటీ తాజా ఆదేశాల్లో ఇచ్చారా..? ఇవ్వలేదు…! ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు… ‘‘అనుమతి లేని కొత్త ప్లాట్లకు’’ మాత్రం నో రిజిస్ట్రేషన్ అంటున్నారు… అనుమతి ఇచ్చే అధికారం ఎవరిది..? పోనీ, వాటికి పక్కా గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చారా..? అదీ లేదు… ఈ లేఅవుట్ల అనుమతులు, అధికారాలపై అంతులేని గందరగోళం… ఆ పాలసీలోనే అయోమయం… అది కదా సరిదిద్దాల్సింది…
ఓ ఊళ్లో… నగరాలకు, పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో లేఅవుట్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు..? ఖాళీ స్థలాల పన్ను అనగానేమి..? ఎల్ఆర్ఎస్, బీపీఎస్, బీఆర్ఎస్ పథకాలన్నీ జరిగిన తప్పులను రాటిఫై చేస్తున్నవే తప్ప… ఆ లేఅవుట్లు పడకుండా చేసే పద్ధతులేమీ కావు ఇవి… అంటే తప్పు జరుగుతూనే ఉండాలి, ఆ తప్పును ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తూ, క్రమబద్ధం చేస్తూ ఉండాలి… ఇదేం పద్ధతి..?
ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేస్తాం అంటున్నారు… వోకే… ఓ ఉపశమనం… కానీ ఎల్ఆర్ఎస్ కత్తి మాత్రం ప్లాట్ల ఓనర్లపై వేలాడుతూనే ఉంటుంది… ఇప్పుడు దానిపై ఏమీ నిర్ణయం లేదు… రద్దు కాదు… ఎప్పుడో ఆ భూతం మళ్లీ విరుచుకుపడకపోదు… కేసీయార్ గనుక కాస్త శ్రద్ధగా ఆలోచిస్తే… ఓ రాజకీయ నాయకుడిగా ఎల్ఆర్ఎస్ రద్దు చేసేసి, కొత్త లేఅవుట్లకు సరైన పద్ధతులను తీసుకొచ్చేవాడు… అప్పుడు తనపై ప్రజల ఆదరణ పెరిగేది…
అయినా…. డబ్బు కావాలంటే… ప్రజల్ని ఇలా అధికారుల గుప్పిట్లోకి, నిబంధనల చట్రాల్లోకి తరమకుండా… మార్కెట్ రేట్లకు సమానంగా రిజిష్టర్డ్ విలువలు మార్చి చూడండి… రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ కొత్త రేట్లకే జనం ఛార్జీలు కడతారు… ఇలాంటి మార్గాలు బోలెడు… అందుకే చెప్పేది, కేసీయార్ ముందుగా తన కీలకాధికారుల్ని మార్చేసి, కాస్త తన కోణంలో ఆలోచించగల, జనహితులను దగ్గరకు తీయాలి… కానీ ఆ మాట తనకు చెప్పేవారెవరు..? అదే కదా అసలైన విషాదం…! స్తుతిమంతులే తనకు ఇష్టులు… ఎవరైనా మంచి చెబితే మాత్రం ‘‘కంటు’’…!!
Share this Article