నా చిన్నప్పటి ప్రియురాలు…! ఆమే అందరికన్నా గొప్ప అందగత్తెయా..? కాదు…! సెవెన్టీస్‌లో అందరికీ హేమమాలిని డ్రీమ్ గాళ్… కానీ ఆమె ఏమైనా అత్యంత అందగత్తె అయిన దేవతా..? నిజంగానే కాదు…! జీనతే పెద్ద అందగత్తె…! పోనీ, ఇండస్ట్రీలో ఆమె ఏమైనా పర్‌ఫెక్ట్ దేహమా..? కానే కాదు…! పర్వీన్‌ను అందులో మించినవారు లేరు…! కానీ ఎందుకో… నాకు స్మితా పాటిల్ మాత్రమే అందంగా, ఆకర్షణీయంగా కనిపించేది…!
నాకు ఇప్పటికీ గుర్తుంది… దూరదర్శన్‌లో జైత్ రే జైత్ సినిమా చూసిన కాలం… అప్పట్లో దాన్ని ఆర్ట్ ఫిలిమ్ అనేవాళ్లు… ప్రతి శనివారం దూరదర్శన్‌లో ఓ మరాఠీ మూవీ చూపించేవాళ్లు… మా చెల్లెళ్లు, స్నేహితులందరికీ అవి పెద్ద బోరింగ్ సినిమాలు… కానీ నేను మాత్రం అలా ప్రసారమయ్యే ప్రతి సినిమాను టీవీ ఎదుట కూర్చుని శ్రద్ధగా చూసేవాడిని,.. అప్పుడు నేను ఎనిమిది తొమ్మిదేళ్లవాడిని కావచ్చు బహుశా… అదుగో ఆ సినిమాల్లో స్మితను గమనించాను మొదటిసారి… ఆమె ఓ ఆదివాసీ మహిళ అనుకునేవాడిని… అలా కనిపించేది మరి… వెరీ నేచురల్ లుక్…
Ads
ఆ తరువాత ఆమె సినిమాలు బోలెడు చూశాను… ఎక్కువ శాతం దూరదర్శన్‌లోనే సుమా… భూమిక, మంథన్, బజార్, నిశాంత్, చ,క్ర… అబ్బో, ఎన్నో… ఆమె సినిమాలు, ఆమె నటన చూస్తుంటే ఆమెతో ముచ్చటించినట్టు అనిపించేది… ఒట్టి నటన మాత్రమే కాదు, ఆమె లుక్… కొత్తగా, పచ్చిగా, రస్టిక్ అప్పీల్… అన్నీ కలిపిన ఓ యూనిక్ యాక్ట్రెస్ ఆమె… ఎవరితోనూ పోలిక లేదు… నటన, అందం, అప్పియరెన్స్, పాత్రలు అన్నీ ఓ స్పెషలే… అసలు ఆమే అవన్నీ కలిసిన ఓ అరుదైన మిశ్రమం….
అన్నింటికీ మించి ఆమె సామాజిక చైతన్య స్పృహ ఎక్కువ… ఇతర తారల్లాగా కాదు… బాగా చదువుకుంది, పుస్తకాలు చదివేది… ఆ లక్షణం ఆమె వ్యక్తిత్వం, మాటతీరు, నడవడికలోనూ కనిపించేది… ఆమె మీద నా ప్రేమ ఇలా పెరిగిపోతున్న వేళ ఓరోజు అర్థ్ సినిమా చూశాను… ఓ టీనేజర్ అయిన నాకు ఆ కథ అర్థం కావడానికి కష్టమైంది… ప్రధాన హీరోయిన్‌గా ఉన్న షబానాకన్నా నాకు స్మితా పాటిలే బాగా నచ్చింది… ఉంబర్తాలో ఆమె కట్టిన కాటన్ చీరెల్లో ఎంత క్లాస్‌గా కనిపించేదో… అర్ధసత్యలో ఓంపురి కూడా అక్కడక్కడా వెలవెలబోయాడు ఆమెకు దీటుగా నటించలేక…
నాకు ఇప్పటికీ క్రిస్ప్ చీరెల్ని ధరించిన మహిళలంటే ఇష్టం, గౌరవం, ప్రేమ… బహుశా ఉంబర్తాలో స్మిత చీరెకట్టు చూశాక పుట్టిన ప్రేమ అయి ఉంటుంది… గులామీ, శక్తి, ఆఖిర్ క్యోఁ వంటి సినిమాలు తప్ప ఆమె నటించిన మెయిన్ స్ట్రీమ్ రొటీన్ సినిమాల్ని నేను చూసేవాడిని కాను… ఆమెను నేను ఓ రొటీన్ తారగా చూడలేకపోయేవాడిని… ఆమె ప్రతిభ ప్రదర్శితమయ్యే సినిమాలే నాకు నచ్చేవి, అవే చూసేవాడిని… ఆమె అందరు హీరోయిన్లవంటిది కాదు కదా…
ఈ అపురూపం చాలా త్వరపడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఏదో ఏదో అర్జెంటు పని ఉన్నట్టు… ఎక్కడో ఆమె నటన అవసరమున్నట్టు..!! ఆమె వెళ్లిపోయాక, అంటే నైన్టీస్ తరువాత చోప్రాలు, బర్జాత్యాలు, జోహార్ల బారిన పడింది హిందీ సినిమా… నిస్సారమైన సినిమాలు… ఆమె వెళ్లిపోవడమే నయమైందేమో… లేకపోతే ఆమెను కూడా వీళ్లు చెడగొట్టి, నా మనసులో ఆమె పట్ల ఆరాధనను కూడా కలుషితం చేసేవాళ్లు…
ముఖ్యంగా ఆమె షారూక్‌కు తల్లిగా నటించడం నేనిప్పటికీ అసహ్యించుకుంటాను… అలాగే నమక్ హలాల్ సినిమాలో అమితాబ్ పక్క ఆజ్ రపట్ పాటలో వేసిన గెంతులను కూడా…!! ఇంతకీ స్మితాపాటిల్ అంటే ఎవరు అని అప్పుడప్పుడూ ప్రశ్న వేసుకుంటాను… నా పిచ్చి గానీ… స్మిత అంటే స్మితే… ఆ పేరుకు, ఆమెకు పోలిక ఏముంటుంది..? ఆమె ఆమే…!! (ఓ ఇంగ్లిష్ సోషల్ మీడియా పోస్టుకు నా తెలుగు స్వేచ్చానువాదం)
Share this Article