నిన్న హరీష్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతూ… తమ సర్కారు హయాంలో సాగునీటి ప్రాజెక్టులు ఏవేవి పూర్తిచేశామో వివరంగా చెబుతూ పోయాడు… సడెన్‌గా అవన్నీ చదివితే… పర్లేదు, ఈ సర్కారు బాగానే చేస్తోందిగా అనిపిస్తుంది… ఓసారి అవి చదవండి…
‘‘తుమ్మిళ్లను రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తి చేశాం. భక్త రామదాసు ప్రాజెక్టుని 10 నెలల్లో పూర్తి చేశాం. మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ రెండో దశ, గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్‌లను పూర్తి చేశాం… ఎస్సారెస్పీ పునరుజ్జీవం, సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం… కిన్నెరసాని కాలువల పూర్తి, గొల్లవాగు, మత్తడి వాగు, పాలెం వాగు, ర్యాలీ వాగు, గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కెనాల్, గట్టుపొడిచిన వాగు, దేవాదుల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్‌లను పూర్తి చేశాం…
కాళేశ్వరం ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ కోసమని, బతికుండగా చూస్తామా? అని అనుకున్నారు. కానీ మూడున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తున్నాం. రికార్డు సమయంలో పూర్తి చేశాం. ప్రాణహిత ప్రాజెక్టును మొదలెట్టినప్పుడు 16 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం.. పనులు ప్రారంభం కాకముందే 38 వేల కోట్లకి పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాక, సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చే సమయానికి అంచనా వ్యయాన్ని 48 వేల కోట్లు చేశారు.
Ads
కాళేశ్వరంలో దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్ధ్యం, మూడు బ్యారేజీలు, పది ఎత్తిపోతల స్టేషన్లు, 16 రిజర్వాయర్లు, 108 మెగా బాహుబలి పంపులు, 98 సర్జిపూల్స్, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 400 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ సబ్ స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల విద్యుత్ లైన్లను మూడున్నరేళ్లలో పూర్తి చేశాం.
ఈ ప్రాజెక్టు కింద ఒక లక్షా 30 వేల 500 ఎకరాల కొత్త ఆయకట్టు ఇప్పటికే ఇచ్చాం. 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి 56 ఏళ్లు పట్టింది. 1961లో కొబ్బరికాయ కొడితే 1980లో పనులు ప్రారంభించి 2017లో పూర్తయింది. మధ్యప్రదేశ్‌లో నిర్మించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ 1984లో శంఖుస్థాపన చేస్తే 2005లో 21 సంవత్సరాలకు పూర్తి చేశారు. మూడున్నరేళ్లలో కాళేశ్వరాన్ని పూర్తి చేసి 817 చెరువులు, 66 చెక్‌డాంలు నింపాం…’’
నిజానికి పునరుజ్జీవం తరువాత ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. అంత అక్కర కూడా రాలేదు… భక్త రామదాసు కంప్లీట్ అయ్యింది… తుమ్మిళ్లలో ఒక్క మోటారును మాత్రమే రన్ చేసేలా పనులు చేశారు… మిడ్ మానేరు పనులు 90 శాతం కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయి… వీళ్లు మిగతా పనులు పూర్తి చేశారు… శ్రీరాంసాగర్ రెండో దశ పనులు ఇంకా కొనసాగుతున్నాయి… ఎస్సారెస్పీ పునరుజ్జీవంలో చివరి పంపుహౌస్ (ముప్కాల్) పనులు కంప్లీట్ కాలేదు… మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే… వాటి పనులు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వరకు పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నారు.. మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తయింది.. డ్యాం ప్రొటోకాల్ ప్రకారం ఏటా కొంత మేరకు నీళ్లు నింపుతున్నారు…
కాంగ్రెస్ నుంచి అసలు బలమైన కౌంటర్ ఇచ్చేవాళ్లు ఎవరున్నారు..? నిజంగానే కాంగ్రెస్ హయాంలోనే కొన్ని చేపట్టారు, కానీ పూర్తి చేయలేదు… వాటిల్లో కొన్ని కేసీయార్ సర్కారు పూర్తిచేసింది, కొన్ని ఇంకా పనులు సాగుతున్నాయి… రెగ్యులర్‌గా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాత్రమే కరెంటు, సాగునీరు, ఆర్థికం, ఐటీ తదితర విషయాల్లో తన విస్తృతమైన సోషల్ మీడియా రీచ్ ద్వారా కౌంటర్లు ఇస్తుంటాడు… కానీ గాంధీభవన్ వేదికగా తరచూ ఇలాంటివి మీడియాతో షేర్ చేసుకుంటే పార్టీకి మేలు… కానీ మాట్లాడనివ్వరు… అక్కడ సబ్జెక్టు మీద సాధికారంగా మాట్లాడే వేరే నేతలు ఎవరూ లేరు… అసెంబ్లీలోనే భట్టి కొన్ని పాయింట్స్ మాట్లాడాడు, కానీ పంచ్ సరిపోలేదు…
Share this Article