దూల… నోటిదూల… నాలుక అదుపులో లేకపోతే కొన్నిసార్లు వీపు మోతమోగే ప్రమాదముంది… అఫ్కోర్స్, ప్రమాదం తెలిసి కాళ్లబేరానికి వెళ్తే సరే… ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్… ఈ నోటిదూల బాపతు కేరక్టరే… మావోడు ఇంకా పిల్లాడే, పట్టించుకోవద్దు అని తండ్రి చెబుతూనే ఉంటాడు, ఈ నోటితీట వివాదాల్లో తలపెట్టి, తరువాత సారీలకు దిగుతూనే ఉంటాడు… తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ‘‘వీపు పగిలిపోతుంది సుమా’’ అనే తరహాలో బెదిరించింది… ఆ పార్టీ తెలుసుగా, రాజ్ ఠాక్రే పార్టీ… అసలు వివాదం ఏమిటంటే..? ఈ ఆదిత్య పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌కు హోస్ట్… తను ఎన్నో ఏళ్లుగా చాలా సింగింగ్ షోలను హోస్ట్ చేస్తున్నాడు… అనుభవమున్నవాడే… కానీ నోరు… ఆ నోటికి కాస్త తీట ఎక్కువ… సవాయ్ భట్ అనే రాజస్థానీ సింగర్‌తో ఏదో మాట్లాడుతూ ఆలీబాగ్ సిటీ గురించి నెగెటివ్ టోన్‌లో ఏదో అన్నాడు… వెక్కిరింపు ధోరణితో… (అది మహారాష్ట్రలోని ఓ కోస్టల్ సిటీ)…
ఇది సోషల్ మీడియాలో కంట్రవర్సీకి దారితీసింది… ఎంఎన్ఎస్ చిత్రపట్ సేన చీఫ్ అమేయ కోప్కర్ ఫేస్బుక్లో ఓ వీడియో పెట్టాడు… ‘‘ఆ షో పేరు చెప్పను, కానీ ఆలీబాగ్ ప్రాంతాన్ని, ఆ ప్రజల్ని అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలున్నాయని మావాళ్లు చెబుతున్నారు… వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేకపోతే మీ ఇష్టం, ఈ విషయాన్ని ఆదిత్య తండ్రికి చెప్పాను, సోనీ టీవీ వాళ్లకూ చెప్పాను…’’ అని హెచ్చరిక జారీ చేశాడు… పరోక్షంగా ‘పగిలిపోతుంది సుమా’ అని సోనీ వాళ్లకు హెచ్చరిక అన్నమాట… ఈ షూటింగులన్నీ జరిగేవి ముంబైలోనే… అందులో ఎంఎన్ఎస్ పార్టీ… అందుకని ఆదిత్యను పిలిచి, వాయించి, సెటిల్ చేసుకో అని హెచ్చరించింది చానెల్… తప్పదు కదా… ‘‘అబ్బెబ్బే, నాకు ఆలీబాగ్ అంటే ఇష్టం, నా సెంటిమెంట్లన్నీ దాంతోనే ముడిపడి ఉన్నయ్, ఎవరైనా హర్టయితే సారీ’’ అని ఫేస్బుక్ వేదికగానే క్షమాపణలు చెప్పాడు…
Ads
ఇదే కోప్కర్ లాస్ట్ ఇయర్ బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించి కూడా ఇలాగే అల్టిమేటమ్ జారీ చేశాడు… ఓ కంటెస్టెంట్ మరొకరితో ‘మరాఠీలో మాట్లాడకు’ అంటాడు ఓచోట, దాన్ని పట్టుకుని, నువ్వయితే హౌజు నుంచి బయటికిరా అన్నట్టుగా బెదిరించాడు… మీ షూటింగ్ సంగతి చూస్తాను అన్నాడు… క్షమాపణలతో సరిపోయింది అప్పట్లో… ఆదిత్య వివాదాల్లోకి వస్తే… మొన్నామధ్య ప్రఖ్యాత సింగర్ కిషోర్ కుమార్‌ను స్మరిస్తూ ఓ స్పెషల్ షో చేశారు ఇండియన్ ఐడల్‌లో… బోలెడు పాటలు పాడారు… గెస్టుగా కొడుకు అమిత్‌ను పిలిచారు… ‘‘అబ్బే, నాకేమీ నచ్చలేదు, అందరినీ పొగడాలి అంటారు, ఇదేం తీరు’’ అని పెదవి విరిచాడు ఆయన… దీనికి ఆదిత్య అనవరంగా కెలుకుతూ… ‘‘అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు, ఐనా ఇది ఆ షో ప్రేక్షకుల కోసమే తప్ప సోషల్ మీడియా కోసం కాదు’’ అంటూ ఏవేవో వ్యాఖ్యలకు దిగాడు… ఐనాసరే, ఈ కంట్రవర్సీ నోట్లో నోరు ఎందుకు పెట్టడం అనుకుని అమిత్ సైలెంటుగా ఉండిపోయాడు… ఐనా ఏటా ఏదో ఒక వివాదంలో తలపెట్టి, పత్రికలకు ఎక్కడం, సోషల్ మీడియా తిట్లు తినడం ఆదిత్యకు అలవాటే… నిజానికి ఏ వివాదమూ లేకపోతేనే తను ఏదో కోల్పోయినట్టుగా ఉంటాడు…!! భలే కేరక్టర్…!!
Share this Article