ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆస్తుల్ని అమ్మేస్తున్నారు… ఎంత దుర్మార్గం అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వన్ని విమర్శిస్తుంది టీఆర్ఎస్ …. కానీ తను కూడా ప్రభుత్వ భూముల్ని అమ్మిపారేసి 15 వేల కోట్ల దాకా సంపాదిస్తాను అని బడ్జెట్‌లోనే చెబుతుంది… అంటే ఏమిటి..? రాజకీయ విమర్శలు వేరు… ఆచరణ వేరు… బేసిక్‌గా ప్రతి పార్టీ సేమ్… కేంద్రం వివక్ష, పావలూ కూడా ఇవ్వడం లేదని సభలోనే విమర్శిస్తాడు ఆర్థిక మంత్రి… పది పేజీల ప్రసంగప్రతి మొత్తం ఆ విమర్శలకే సరి… కానీ తన బడ్జెట్‌లోనే కేంద్ర ఆదాయంలో వాటా ప్లస్ గ్రాంట్లు కలిపి 60 వేల కోట్లు వస్తాయని రాసుకుంటాడు…
బడ్జెట్ అంటే ఓ నంబర్లాట… అలాగే ఖర్చు కావాలని ఏమీలేదు… అసలు ఎంత మంది సభ్యులు వాటిని చదివి అభిప్రాయాలు చెబుతున్నారు… ప్రతిపక్షంలో ఉంటే ఉత్త అంకెల గారడీ అంటూ విమర్శ చేయడం, అధికారపక్షంలో ఉంటే ఆహా ఓహో అని చప్పట్లు కొట్టడం… నిజానికి బడ్జెట్‌ను అదే ఆర్థిక పరిభాషలో, సరిగ్గా విశ్లేషించేవాళ్లు ఏరి..? దురదృష్టవశాత్తూ పత్రికలు కూడా అంతే… (టీవీలను వదిలేయండి)… కనీసం బడ్జెట్‌పై తమ అభిప్రాయం, అంచనా ఏమిటో కూడా చెప్పలేని దురవస్థ… ఆ డప్పు పత్రికను వదిలేస్తే, సాక్షి మూడున్నర పేజీల్ని అచ్చేసింది… కానీ బేసిక్‌గా బడ్జెట్ స్వరూపం మీద సొంత విశ్లేషణ ఏది..?
Ads
ఈనాడు అయితే మరీ దారుణం… కట్టె, కొట్టె, తెచ్చె… ఆ అంకెలు, ఆ గ్రాఫులు, ఆ ప్రసంగాలు, ఆ విమర్శలు… మరి పాత్రికేయ కోణంలో నిశిత పరిశీలన ఏది..? కాస్త ఆంధ్రజ్యోతి నయం… ఫస్ట్ పేజీలో సగటు మనిషికి అర్థమయ్యే విషయాలు కొన్ని రాసుకొచ్చింది… కొన్ని ముఖ్యమైనవి…
- నిరుద్యోగ భృతి జాడ లేదు, లక్ష వరకూ రుణమాఫీ ఊసు లేదు…
- బీసీ బంధు లేదు… దళితబంధు నిధులూ సరిపోవు…
- 57 ఏళ్లకే వృద్దాప్య పింఛన్ అన్నారు, ఆసరా కేటాయింపులు మాత్రం పెరగలేదు…
- బడ్జెట్ బయట, బడ్జెట్ పరిధిలో కలిసి 5 లక్షల కోట్ల దాకా రుణాల్ని పెంచేస్తున్నారు… ఈసారీ 60 వేల కోట్ల అప్పులు తెస్తారట…
- డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వమే కట్టి ఇచ్చేది, కానీ అది మోయలేని భారంగా మారి, చాలా స్వల్పసంఖ్యలో కట్టి మమ అనిపిస్తోంది… ఈ స్థితిలో 3 లక్షలిస్తాం, మీ జాగాలో మీరే కట్టుకొండి అంటున్నారు… 5 లక్షలు అని ఆమధ్య చెప్పుకున్నారు… కానీ 3 లక్షలు సరిపోతాయా..?
- కేటాయింపులు ఆకాశంలో… అసలు ఖర్చు నేల మీద… పేరుకు రెండున్నర లక్షల కోట్ల భారీ బడ్జెట్… కానీ గతంలో జరిగిన వాస్తవ వ్యయం ఎంత..?
విపక్షాలకు కూడా అసెంబ్లీలో ఎలా నిరసనలు చెప్పాం, ఎలా కేకలు వేశాం, ఎలా అడ్డుకున్నాం, ఎలా హైలైట్ అవుతున్నాం, అనే ధ్యాసే తప్ప క్రిటికల్ విమర్శ ఏది..? ప్రశ్నించాలనే సోయి ఏది..? ఓ లేడీ గవర్నర్‌ను అవమానించాం అనే అపప్రథ రాకుండా మహిళాబంధు అంటూ ఊరూరా టాంటాం ప్రచారాలు… అసెంబ్లీ టెక్నికల్‌గా ప్రొరోగ్ కాలేదు కాబట్టి, అంటే ఇంకా సమావేశాలు సాగుతూనే ఉన్నట్టుగా లెక్క కాబట్టి, గవర్నర్ ప్రసంగం అవసరం లేదు అని ఓ సమర్థన… రాజ్యాంగరీత్యా తప్పు కాదని వివరణ… కానీ ఆ స్పూర్తి ఏది..? గవర్నర్ ప్రసంగం ఉంటే నష్టమేంటి..? ఆమె ప్రసంగించకుండా చేయడంతో వచ్చే లాభమేంటి..? ఏం సాధించినట్టు..? పోరాటం రాజకీయంగా సరైన దిశలో జరగాలి, ఇలాంటి చర్యలతో కాదు… అంటే అన్నామంటారు గానీ… రాబోయే ఏపీ బడ్జెట్ తీరు, టీడీపీ రచ్చ, వైసీపీ ఎదురుదాడి కూడా దాదాపు ఇలాగే ఉంటయ్… ఉంటున్నయ్… హేమిటో… ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, అక్కడ బెంగాల్ నుంచి కేరళ దాకా… పార్లమెంటు నుంచి రాష్ట్రాల అసెంబ్లీల దాకా… సేమ్ సేమ్…!!
Share this Article