ముందుగా ఓ చిన్న విషయం… ఇన్ని రోజులైంది కదా కాంతార తెలుగులో కూడా విడుదలై… థియేటర్ల సంఖ్య డబుల్ చేసుకుంది… ప్రస్తుతం తెలుగు మార్కెట్‌లో స్టడీగా వసూళ్లు రాబడుతున్న సినిమా అదే… మొన్నటి శనివారం హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో 2.25 లక్షలు కలెక్టయ్యాయట… ఆదివారం కూడా అంతే… ఈమధ్యకాలంలో ఇది అరుదైన ఫీటే అంటున్నారు హైదరాబాద్ ఎగ్జిబిటర్లు… కాంతార స్టిల్ ఎంతగా జనాన్ని కనెక్టవుతోంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ అన్నమాట…
అసలు చెప్పుకునేది అది కాదు… సినిమాకు ప్రాణం క్లైమాక్స్ కదా… ఆ పదీపదిహేను నిమిషాలే కదా థియేటర్లు దద్దరిల్లిపోతున్నది… ఆ క్లైమాక్స్ అలా లేకపోతే సినిమా ఉత్త జుజుబీ కదా… నిజానికి ఆ క్లైమాక్స్‌కు సంబంధించి అసలు స్క్రిప్టే రాసుకోలేదట… ఎవరో కాదు, సినిమా దర్శకుడు కమ్ రైటర్ కమ్ హీరో కమ్ స్క్రీన్ ప్లేయర్ రిషబ్ శెట్టే చెబుతున్నాడు… టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను చాలా ఇంగ్లిషు, ఇతర మెయిన్ స్ట్రీమ్ జాతీయ పత్రికలు కవర్ చేశాయి…
‘‘నాతోపాటు నలుగురు కో-రైటర్స్ డైలాగ్స్ మీద వర్క్ చేశారు… నిజానికి నేను బేస్ లైన్ చెబితే వాళ్లే రాశారు… క్లైమాక్స్ గురించి మొత్తం సీక్వెన్స్ అసలు మేం ముందుగా రాసుకోలేదు స్క్రిప్టులో… జస్ట్, దైవ గుళిగ హీరో శివ దేహంలోకి ప్రవేశిస్తుందని రెండు లైన్లు రాసిపెట్టుకున్నాం, అంతే… ఐతే దాన్ని ఎలా తీయాలో, ఎలా తీయబోతున్నామో నేను ఎవరికీ చెప్పలేదు… నాకు తెలిస్తే కదా… సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్‌కు కూడా ఏమీ చెప్పలేదు…
Ads
నా మైండ్‌లో నాలుగు విజువల్స్ తిరుగుతున్నయ్… కొంత అస్పష్టత… సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్‌కు అదే చెప్పాను… దైవం ఓ మనిషి దేహంలోకి ప్రవేశిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా చూపిస్తే బాగుంటుందో ఫలానా ఫలానా షాట్లతో ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చునని ఫైట్ మాస్టర్‌కు రఫ్‌గా ఓ ఐడియా వస్తోంది… చెబుతున్నాడు… సో, ట్రెడిషనల్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌లో ప్లే చేస్తూ కొన్ని షాట్స్ తీశాం… తరువాత దైవం నా దేహంలోకి ప్రవేశించిన షాట్ షూట్ చేశాం… సెట్‌లో ఆ అయిదు నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్… ఇప్పుడు థియేటర్లలోలాగే… అలా డెవలప్ చేసి కంప్లీట్ చేశాం’’ అని వివరించాడు… ఇందులో ఆ దైవమే మాకు సహకరించాడేమో అంటాడు తను…
తన ఇంటర్వ్యూలోని ఇంకొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..? ‘‘హిందీలో నేను అభిమానించే సీనియర్ నటులు బోలెడు మంది… కానీ ఈ కాంతార సినిమాను రీమేక్ చేయడం బాగుండదు… రీమేక్‌కు ఇది సూట్ కాదు కూడా… నిజానికి మేం ఈ సినిమాను పెద్ద సినిమా అనుకోలేదు… మా ప్రాంత కల్చర్, యాక్సెంట్, జానపదాన్ని హైలైట్ చేద్దామని బేసిక్ ప్లాన్… కర్నాటకలోనే ఇతర ప్రాంతాలకు మా గురించి పెద్దగా తెలియదు… పెద్దగా ప్రమోషన్ వర్క్ కూడా చేయలేదు… కానీ మౌత్ టాక్‌తో సినిమా హిట్టయింది… ఈ రేంజ్ హిట్ మేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు…
నిజం చెప్పాలా..? ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్నాం… తరువాత థియేటర్లలోకి వచ్చాం… ఇతర ప్రాంతాల్లో భాషాభేదం లేకుండా ప్రేక్షకులు సినిమా చూస్తుండేసరికి ఇక తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశాం… తరువాత వేరే భాషలు… పాన్ ఇండియా అనేది పూర్తిగా అసంకల్పితం… మా ఆలోచనల్లో ఆ ప్లాన్ లేనేలేదు…
సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది… ఎందుకంటే, నేను బేసిక్‌గా ప్రేక్షకుడిని…, నా ప్రాంతం గురించి, ఆచారాలు, అలవాట్లు, సంస్కృతి, నా ఆట, నా పాట గురించి నాకు ఆసక్తి ఉంటుంది కదా… మన తరువాత తరానికి కూడా ఆసక్తి ఉంటుంది… ఈ తరం దర్శకులకు మన ఉనికి, మన ప్రాంతీయత గురించి బలంగా వెల్లడించాల్సిన బాధ్యత ఉందనేది నా ఫీలింగ్…
ఎవరెవరో ఏవో విమర్శలు చేస్తారు, అన్నీ పట్టించుకుంటే అడుగు ముందుకు వేయలేం… 99.99 శాతం పాజిటివ్‌గా స్వీకరించారు సినిమాను… మిగతా 0.01 గురించి ఆలోచించుకుంటూ కూర్చోలేను కదా… చిన్నప్పటి నుంచీ విన్న ఓ కథను డెవలప్ చేసి, చూసిన సీన్లతో ఓ లైన్ మనసులో ఊహించుకుని సినిమా తీసేశాను… ఏవేవో రంగులు పూసేవాళ్లుంటే అది వాళ్ల ఇష్టం… నేను దేవుడిని నమ్ముతాను, కానీ మూఢనమ్మకాల్ని ప్రమోట్ చేయను… ప్రకృతికీ మనిషికీ నడుమ బ్యాలెన్స్ చేయడానికి దేవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తాడని నమ్ముతాను…
పాన్ ఇండియా కాన్సెప్టు మీద నా భావాలు వేరు… దేశంలో మొదటి పాన్ ఇండియా సినిమా రాజ్‌కుమార్ తీసిన మహిషాసుర మర్దిని… అప్పట్లోనే బోలెడు భాషల్లోకి డబ్ చేసి, దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు… సినిమా పట్ల ఆదరణను చూస్తూ నిర్ణయం తీసుకోవాలి… పాన్ ఇండియా సినిమా అనే జానర్ ఏమీ ఉండదు…
కొన్ని యాక్షన్ సీన్లలో డూప్‌ను కూడా పెట్టాలనిపించలేదు… అలా మునిగిపోయాను… కొన్నాళ్ల ముందు నుంచే నాన్ వెజ్ మానేశాను… ఆ అయిదారు రోజుల క్లైమాక్స్ షూట్‌లో కొబ్బరి నీళ్లే ఆధారం… ఎప్పుడైనా కాస్త ప్రసాదం పెట్టేవాళ్లు… బాణాసంచాతో నన్ను కొట్టడం కూడా నిజమే… వీపు కాలింది… పెయిన్… ఏమో, అలా చేయాలని అనిపించింది, చేసేశాను… ఇప్పుడు కన్నడ సినిమాలది, లేదా సౌత్ సినిమాలదే హవా అనే వాదనల్ని కూడా నేను నమ్మను… అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఇండస్ట్రీలోనూ సహజం…’’
Share this Article