.
Bhandaru Srinivas Rao ……. టిక్కెట్టు వున్నవారినే ప్లాటుఫారం మీదకి అనుమతిస్తాం అని రైల్వే మంత్రి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త చదివిన తర్వాత గుర్తొచ్చిన పాత పోస్టు :
పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన ‘సిల్క్ రూటులో సాహస యాత్ర’ పుస్తకంలో కొన్నేళ్ల క్రితం చైనాలో తన రైలు ప్రయాణ అనుభవాన్ని ఇలా అభివర్ణించారు…
Ads
“చైనా భాషలో లీన్ యాన్ అంటే పువ్వుల తోట అని అర్ధం. కానీ ఎడారి కొసన ఉన్న పట్టణం కాబట్టి ఎక్కడా చెట్టూచేమా జాడ కూడా లేదు. రైలు స్టేషన్ కు మూడంచెల పటిష్టమైన భద్రత. టిక్కెట్టు యెంత ముందు కొనుక్కున్నా ఎవర్నీ ప్లాట్ ఫారం మీదికి వెళ్ళనివ్వరు.
రైలు రావడానికి ఓ పది నిమిషాల ముందు లోపలకి అనుమతిస్తారు. సామానులు మోయడానికి కూలీలు వుండరు. వృద్ధులతోసహా అందరూ ఆరోగ్య వంతులే కాబట్టి ఎవరి లగేజి వాళ్ళు అవలీలగా మోసుకెడతారు.
ప్లాట్ ఫారం శుభ్రంగా అద్దంలా వుంటుంది. ఎటువంటి దుకాణాలు వుండవు. రణగొణ ధ్వనులు చెత్తాచెదారానికి ఆస్కారంవుండదు. రైలు కదలగానే ప్లాట్ ఫారం ఖాళీగా, నిశ్శబ్దంగా వుంటుంది. ఒకరిద్దరు రైల్వే ఉద్యోగులు మాత్రమే కనబడతారు.
ఇక ప్రతి బోగీకి ఒక అటెండెంటు నీటుగా నీలం రంగు డ్రెస్సులో తల మీద టోపీతో ఉంటాడు. టిక్కెట్లు చెక్ చేయడం, బెర్తులు చూపించడంతో పాటు ప్రతి గంటకు చీపురుతో బోగీ మొత్తం శుభ్రం చేస్తుంటాడు. వారిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడింది.
ప్రతి ఆరు సీట్లకి ఒక ప్లాస్టిక్ చెత్త బుట్ట వుంటుంది. ప్రయాణీకులు చెత్త అందులోనే వేస్తారు. అటెండెంటు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తాడు. ప్రతి బోగీలో బాత్ రూములు, వాష్ రూములు విడిగా వుంటాయి. టాయిలెట్లు వెస్ట్రన్ తరహా కాదు. పాత మోడల్స్. అంటే ముసలివారితో సహా ఎవరికీ ఆ దేశంలో మోకాళ్ళ నొప్పులు లేవని అర్ధం అయింది.
ప్రయాణీకులు అందరి వద్దా డిస్పోసబుల్ స్లిప్పర్స్ వున్నాయి. రైలు ఎక్కగానే బూట్లు విప్పేసి వాటిని ఉపయోగించి, దిగేముందు వాటిని చెత్త డబ్బాలో వేస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాత్రి పడుకోబోయే ముందు ఆడామగా తేడా లేకుండా అందరూ శుభ్రంగా బ్రష్ చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
చైనా రైల్వేలలో నాకు నచ్చిన మరో విషయం ఏమిటంటే… రాబోయే స్టేషన్ కు అయిదు నిమిషాల ముందు, స్టేషన్ దాటిన తర్వాత అయిదు నిమిషాల పాటు టాయిలెట్ తలుపులు ఆటోమేటిక్ గా లాక్ అవుతాయి. ఈ పద్దతి వల్ల రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలు, పరిసరాలు శుభ్రంగా వుంటాయి.
రైలు మార్గాలను దేశమంతటా ఫెన్సింగ్ చేశారు. దానివల్ల పశువులు, మనుషులు, వాహనాలతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం పట్ల చైనీయుల చైతన్యం నన్ను ఆశ్చర్య పరిచింది. నలభయ్ గంటల సుదీర్ఘ ప్రయాణం. కండరాలు పట్టేయకుండా ఏదయినా స్టేషన్లో రైలు ఆగిందంటే చాలు గభాలున ప్లాట్ ఫారం మీదకు గెంతి వార్మప్‌లు మొదలు పెడతారు…
“భీకరాకార పర్వత గర్భాలను తొలిచి నిర్మించిన టన్నెల్స్ ద్వారా సాగిన ఆ రైలు ప్రయాణం ఒక మధురానుభూతి” – పరవస్తు లోకేశ్వర్
Share this Article