బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్లో రాళ్ల దాడి జరిగింది… వాటీజ్ దిస్ నాన్సెన్స్, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని బీజేపీ నాయకులు దీర్ఘాలు తీసేసరికి… ఏయ్, చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా… మీ ప్రోగ్రాములకు జనం రావడం లేదని, మీరే రాళ్లు వేసుకుని, ప్రచారం కోసం డ్రామాలు ఆడుతున్నారా అని సీఎం మమత ఎకసక్కేలకు దిగింది… ఆమె అంతే… ఎవరి మీదనైనా దాడులు చేయించగలదు… ఏదో దాదా-దీదీ అనుబంధం కాబట్టి కాస్త ప్రధాని మోడీని విడిచిపెడుతుందేమో తప్ప ఇంకెవరినీ ఆమె ఉపేక్షించదు… సీబీఐ మనుషులు వస్తేనే అరెస్టు చేసి, ఠాణాల చుట్టూ తిప్పింది… ఆమె కేంద్రాన్ని ఎప్పుడు ఖాతరు చేసింది గనుక…
ఆ రాష్ట్ర గవర్నర్నయితే పురుగుకన్నా హీనంగా తీసిపారేస్తుంది ఆమె… మక్కీచూజ్ అంటాం కదా, పులుసులో పురుగును తీసేసినట్టుగా… ఏం చేసినా, ఏం జరిగినా… గవర్నర్ రుసరుస… బీజేపీ నేతల గుస్సా… అంతే… ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారింది అంటూ గవర్నర్ కేంద్రానికి ఓ నివేదిక పంపించాడు… అలా చాలాసార్లు పంపించాడు… కానీ ఈసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకి సమన్లు పంపించింది… శాంతిభద్రతల పరిస్థితిపై 14 న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది… దాన్ని మమత సర్కారు తిరస్కరించింది… ఢిల్లీకి రాముఫో అనేశారు… దీంతో కేంద్రం మమత ప్రభుత్వంపై ఏదో కొరడా ఝలిపించబోతున్నట్టు వార్తలు రాసేస్తున్నారు కొందరు… కానీ..?
Ads
నెవ్వర్… మమత ప్రభుత్వంపై ఈగ కూడా వాలదు… అది పక్కా… మమత ఎంత చెలరేగిపోతే బీజేపీ అంతగా బలపడుతుంది అక్కడ… మమత కొట్టే దెబ్బలకు బీజేపీ రాటుదేలుతోంది… స్థానిక ఎన్నికలు జరిగితే అసలు ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనివ్వలేదు వేల గ్రామాల్లో… దటీజ్ మమత… ఆ నిర్బంధాల్లోనే బీజేపీ బలం పెంచుకుంటోంది… పెరిగిన బలం ఏమిటో గత లోకసభ ఎన్నికల్లోనే స్పష్టమైంది… అదే మమతకు చిర్రెక్కిస్తోంది… మరింత అదుపు తప్పుతోంది… అది చూసి బీజేపీ నవ్వుకుంటోంది…
ఎలాగూ సీపీఎం పని అయిపోయింది అక్కడ… ప్రజలు మళ్లీ సీపీఎం వైపు మళ్లే సిట్యుయేషన్ అస్సలు లేదు… ఏళ్ల తరబడీ ఆ పార్టీ పాలనను అనుభవించారు కదా… మమత బలహీనపడేకొద్దీ పెరిగేది బీజేపీయే… ఈ స్థితిలో ఆమె ప్రభుత్వంపై వేటు వేస్తే… మళ్లీ అప్పనంగా అధికారాన్ని ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించినట్టే అవుతుంది… అసెంబ్లీ ఎన్నికలు మరో మూడునాలుగు నెలల్లో జరిగే ముందు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మమతకు మస్తు సానుభూతి ఖాయం… ఆ తప్పు బీజేపీ ఎందుకు చేస్తుంది..? కాకపోతే మమత అరాచకాన్ని బాగా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది… ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకి సమన్లు అందులో భాగమే… అంతే… అంతకుమించి ఇంకేమీ జరగదు…
అక్కడ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు, ఆయన టీం సోషల్ వర్క్ ఫ్లాప్… అవి పెద్దగా క్లిక్ కావడం లేదు… మమత పార్టీలోనే పీకే టీంను లైట్ తీసుకుంటున్నారు చాలామంది… తను సొంతంగా చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ ఫలితాలు ఏమీ కనిపించడం లేదు…
బీజేపీకి వ్యతిరేకంగా ఓ లౌకిక కూటమిని నిర్మించాలని అనుకున్నా సరే… కాంగ్రెస్ ఎప్పుడో మట్టిగొట్టుకుపోయింది… సీపీఎంకు ఏమాత్రం అలుసు ఇచ్చినా అది తన మీదే రాను రాను ఎలా స్వారీ చేస్తుందో తనకు తెలుసు… ఇక ఒంటరిపోరు తప్పదు… మరోవైపు ఒవైసీ నుంచి సవాళ్లు వస్తున్నయ్… ఇన్నాళ్లూ ముస్లిం వోట్లలో మెజారిటీ శాతం ఆమెకే పడేవి… బీజేపీ వ్యతిరేకి కాబట్టి ఈసారీ పడాాలి… కానీ ఒకవేళ మజ్లిస్ గనుక బరిలోకి దిగితే ఆ వోట్లు చీలిపోయి మమతకు భారీ షాక్ ఖాయం… ఈ ఫ్రస్ట్రేషన్ ఆమెలో కనిపిస్తోంది… అందుకని రాళ్లు పడ్డా, బాంబులు పడ్డా… ప్రస్తుతానికి బీజేపీ ఆమెపై ఏ చర్యా తీసుకోదు… తీసుకోకూడదు…!!
Share this Article