తెలుగు కథకే అవమానం… కాదు, కాదు… చిన్నతనం… తెలుగు కథకులందరికీ తలవంపులు… అంత పెద్ద ఈనాడు సంస్థ కథల పోటీ పెడితే ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడానికి అర్హత సంపాదించిన కథ ఒక్కటంటే ఒక్కటీ లేదట… 1500 కథలు పోటీపడితే, అందులో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కథలు కనిపించక… చివరకు న్యాయమూర్తులే అల్లాడిపోయి, వాళ్లే తలదించుకున్నంత పనైపోయి… నో టాప్ టు ర్యాంక్స్ అని విచారవదనాలతో ప్రకటించాల్సి వచ్చింది… ఈ పోటీ పేరు ‘ఈనాడు’ కథావిజయం… అది కాస్త కథాఅపజయంగా తేలిపోయింది, ఫాఫం… ఏదో పోనీలే పాపం అనుకున్నారో, మరీ అన్నీ పక్కన పడేస్తే బాగుండదు అనుకున్నారో, సర్లె మూడునాలుగు వేలే కదా ఇచ్చేది అనుకున్నారో… 22 కథలను మాత్రం ఎంపిక చేశారు… మరి ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌కు, ఈనాడు.నెట్ సైటుకు కూడా కంటెంటు, కథలు కావాలి కదా… ఆ అవసరం కోసం లేదా మొహమాటానికి ఈ ఎంపికలు జరిగినట్టుగా ఉంది సుమీ…
సరే, సరదాగా చెప్పుకున్నది సరే గానీ… నిజంగా తెలుగులో మంచి కథకులే లేరా..? ఎన్నదగిన ఒక్క కథ రాసే దిక్కులేదా..? అంత బోసిపోయిందా..? అంత వట్టిపోయిందా..? కచ్చితంగా ఈ ప్రశ్నలు తలెత్తుతాయి కదా… మనం మరో కోణంలో ఓసారి ఆలోచిద్దాం… అసలు మంచి కథ అంటే ఏమిటి..? దానికి ప్రామాణికాలు ఏముంటాయి..? ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి ప్రాతిపదికలు ఏమిటి..? ఈ ప్రశ్న ఎందుకు అంటే..?
Ads
ఇది వార్షిక పరీక్షా..? ప్రవేశ పరీక్షా..? వార్షిక పరీక్ష అయితే… ఇన్ని మార్కులొస్తే పాస్, ఇన్ని మార్కులు దాటితే ఫస్ట్, లేదా సెకండ్… ఈ రేంజ్ దాటితే డిస్టింక్షన్ అంటూ కొన్ని లెక్కలు, స్కేళ్లు ఉంటయ్… అదే ప్రవేశ పరీక్ష అయితే… ర్యాంకుల పద్దతి… టాప్ వన్ నుంచి ర్యాంకులు ఇవ్వాల్సిందే… ఉన్నవారిలో ఎవరిది ఏ ర్యాంకు అనేదే లెక్క… అంతేతప్ప టాపర్‌కు ఇన్ని మార్కులు వచ్చి ఉండాలనేమీ ఉండదు… అంటే వచ్చిన కథలకే ర్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది… వచ్చిన కథల్లో ఏది బెటర్‌గా ఉంటే దానికి ప్రథమం, ఆ తరువాత ద్వితీయం. ఇలా అనివార్యంగా ఎంపిక ఉండాలి కదా… ఎహె, వచ్చిన కథల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులకు అర్హత ఉన్న కథలే లేవుపో అని ప్రకటించడం అంటే… అర్హత ప్రమాణాలు, కొలమానాలు ఏమిటి అనే ఓ పెద్ద ప్రశ్న మన ముందు నిలుస్తుంది… అది కాదయ్యా బాబూ, జడ్జిలు మంచి కథ అని ఫీలయ్యే కథలు రాలేదు, అదే ఫైనల్ అంటారేమో… ఏమో, జడ్జిల టేస్టుకు తగిన కథ రాలేదేమో… ఇదంతా సరే… నిజంగా తెలుగు కథ డొల్లబారిందా..? లేక ఈనాడు వాడికి కథలు పంపించడం అనే భావనతో కథకులే వదిలేశారా..? ఎందుకంటే..? ఎంపిక చేసిన కథల్ని ఈ మూణ్నాగులైదు వేల సింపుల్ పారితోషికంతో తను ఎలాగైనా వాడుకుంటాడు… అసలు మంచి కథకుడు ఈ పోటీకి దూరంగా ఉండటం వెనుక అసలు కథ ఇదేనా..? ఏమోలెండి… ఈనాడు ఎన్ని కథలైనా చెప్పగలదు..!!
Share this Article