.
[[ – శంకర్‌రావు శెంకేసి ( 7989876088 )] దండకారణ్యంలో పోలీసు బలగాలు చెప్పిందే లెక్క…
‘దండకారణ్యంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు సమాచారం వచ్చింది సర్…’ ఫోన్‌లో రిపోర్టర్.
‘ఏ జిల్లాలో జరిగింది.. ఏ ప్రదేశంలో జరిగింది..?’ డెస్క్ నుంచి ఆరా.
‘తెలియదు సార్..’ రిపోర్టర్ సమాధానం..
‘ఎంత మంది చనిపోయారు.. ప్రముఖులెవరైనా ఉన్నారా..?’ డెస్క్ నుంచి మళ్లీ ఆరా.
‘తెలియదు సార్..’ రిపోర్టర్ సమాధానం..
Ads
‘సంఘటన స్థలం ఫొటోలు కావాలి… ఎలా తీసుకువస్తావు..?’ డెస్క్ నుంచి ప్రశ్న.
‘మనం వెళ్లేది ఏమీ వుండదు సర్..’ రిపోర్టర్ బదులు.
‘మృతులను పరిశీలించడానికి, మృతుల కుటుంబాలతో మాట్లాడటానికి ప్రయత్నించు…?’ మళ్లీ డెస్క్.
‘మనకెవరినీ చూపించరు సర్…’ మళ్లీ రిపోర్టర్.
‘మరి ఎలా..?’ డెస్క్ అమాయకపు ప్రశ్న.
‘ఏమీ లేదు..సర్. అంతా వన్‌సైడ్. పోలీసులు చెప్పిందే రాసుకోవాలి. వాళ్లు పంపించిన ఫొటోలే పెట్టుకోవాలి.. మృతుల కుటుంబాల వారెవరూ కనిపించరు సర్.. కనిపించినా నోరు మెదపరు సర్.. దండకారణ్యంలో ఇంతే. ఇప్పుడే కాదు, గత పదేళ్లుగా ఇదే పరిస్థితి సర్. మేం చేసేది రిపోర్టింగ్ కాదు సర్.. రెడీమేడ్ సమాచారం క్యారీయింగ్ మాత్రమే…’ స్పష్టంగా చెప్పాడు రిపోర్టర్.
‘అయితే సరే, పంపించు..’ డెస్క్ నుంచి ముక్తసరి స్పందన.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మావోయిస్టుల అణచివేత పేరిట సాగుతున్న నరమేధాన్ని ఒక ప్రత్యేక కోణంలో చూపించిన సంభాషణ ఇది. ‘ఆపరేషన్ కగార్’ పేరిట అక్కడ సాగుతున్న మావోయిస్టుల అణచివేత (కేంద్ర హోం శాఖ మంత్రి అమితషా స్వరంలో అది మావోయిస్టు నిర్మూలన కార్యక్రమం) రాజ్యాంగం కల్పించిన సర్వహక్కులను చట్టబద్ధంగా కాలరాస్తూ తన అసలు స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది.
2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందుకు తాము సైతం కట్టుబడివున్నామని చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి గొంతు కలిపారు. గత జనవరిలో బీజాపూర్‌లో 31 మంది మావోయిస్టులను ఊచకోత కోసిన తర్వాత కేంద్ర మంత్రి స్పందించిన తీరు అది.
సాయుధ నక్సల్స్ మీద రాజ్యం అణచివేత కొత్త కాకున్నా.. చత్తీస్‌గడ్‌లో అది నరమేధం వలె సాగుతుండటమే కలచివేస్తోంది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దండకారణ్యంలో పోలీసు బలగాల ఏకపక్ష ఎన్‌కౌంటర్లు గత కొంత కాలంగా సాధారణంగా మారాయి.
బీజాపూర్, దంతేవాడ, సుకుమా వంటి జిల్లాల్లోని అడవులను వందలాది పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటవీగ్రామాల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకొని అత్యాధునిక ఆయుద సంపత్తితో మావోయిస్టులను ఏరివేసే ఏకైక కార్యాచరణగా ముందుకు సాగుతున్నాయి.
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో డీఆర్‌జి (డిస్‌ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్) క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీరికి సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు వెన్నుదన్నుగా ఉంటాయి. ఎన్‌కౌంటర్లలో పోలీసులు నక్సల్స్ అని చెబుతున్న 180 మంది గత ఏడాది ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 121 మంది మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, దంతేవాడ బీజాపూర్ కొండగావ్, బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలో దండకారణ్యం విస్తరించి ఉంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు సరిహద్దున విస్తారంగా వ్యాపించి ఉంటుంది. శత్రుదుర్భేద్యమైన దండకారణ్యం మావోయిస్టులకు కొట్టిన పిండి.
10 ఏళ్ల క్రితం వరకు పోలీసులు దండకారణ్యంలో కాలుపెట్టాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. కానీ మోదీ-షా పాలనలో దండకారణ్యంపై ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టుల ప్రాభవానికి బీటలు పడటం మొదలైంది.
ఒకప్పుడు సల్వాజుడుం ద్వారా మావోయిస్టులను అణచడానికి ప్రయత్నాలు జరగగా, ఇప్పుడు డీఆర్‌జీ బలగాల ద్వారా అవే ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో గతంలో పనిచేసిన వారిని, సానుభూతిపరులను, ఆదివాసీ యువతను రకరకాలుగా ఆకర్షించి డీఆర్‌జీలో పోలీసులుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఆధునిక ఆయుధాలను కట్టబెడుతున్నారు. వీరికి దండకారణ్యం స్వరూపంపై పూర్తి అవగాహన ఉండటంతో మావోయిస్టుల అణచివేత సులువుగా మారిపోయింది. వీరి ద్వారా సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు అడవుల్లోకి చొచ్చుకుపోయి ఎడాపెడా ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నాయి.
డ్రోన్లు, థర్మల్ ఇమేజెస్, వైర్‌లెస్ సెట్లు వంటి సాంకేతిక పరకాల సహాయంతో మావోయిస్టులను కదలికలను పసిగట్టి పదుల సంఖ్యలో మట్టుబెడుతున్నాయి. వాస్తవానికి ఎన్‌కౌంటర్లలో చనిపోతున్న వారిలో 70శాతం అమాయక ఆదివాసీలేనన్నది బహిరంగ రహస్యం.
ఒక్కో ఎన్‌కౌంటర్‌లో కనీసం 10 మంది గరిష్ఠంగా 30 మంది చనిపోతున్నారు. వారిలో మహిళలే అధిక సంఖ్యలో ఉంటున్నారు. అసలైన నక్సల్స్‌ను తుదముట్టించే క్రమంలో అమాయక ఆదివాసులను కూడా పిట్టల్లా కాల్చిపారేస్తున్నారనే వాదనలు కూడా వున్నాయి.
1980, 90లలో ఉమ్మడి రాష్ట్రంలో… ప్రత్యేకించి కల్లోల తెలంగాణలో నక్సల్స్ ఉద్యమం పీక్స్‌లో వున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎన్‌కౌంటర్ల స్థలాలకు వెళ్లి గ్రౌండ్ రిపోర్టింగ్ చేసే వారు. అక్కడ అణువణువనూ పరిశీలించే వారు. చెట్ల ఆకులపైన, మొదళ్లపైన చిందిన నెత్తుటి మరకలు, బుల్లెట్ల గుర్తులు, శవాలు పడివున్న తీరు, వారిపైన బుల్లెట్ల గాయాలు, వారి దుస్తులు చిందరవందరైన తీరు ఆధారంగా భిన్న కోణాల్లో సంఘటనను కళ్లకు కట్టేవారు.
నక్సల్స్ అణచివేత విషయంలో పాలకులు ఎంత కఠినంగా వున్నా, మీడియా వద్దకు వచ్చేసరికి వారికి తగినంత స్వేచ్ఛ మాత్రం ఉండేది. అందుకే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో భారీ ఎత్తున జరిగిన ఎన్‌కౌంటర్లలో అధిక భాగం బూటకమేనని నిరూపితం అయ్యాయి. అదంతా కేవలం ప్రాణాలకు తెగించి పనిచేసిన మీడియా ప్రతినిధుల నిబద్ధత వల్లనే సాధ్యమైంది.
ఇప్పుడు దండకారణ్యంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు వున్నాయి. అటు ఛత్తీస్‌గడ్‌లోని మీడియాను, ఇటు సరిహద్దుల్లోని తెలుగు మీడియాను పోలీసులు ఎన్‌కౌంటర్ ప్రదేశాల్లోకి కాలు కూడా అడుగుపెట్టనివ్వడం లేదు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు విడుదల చేసే ప్రెస్‌నోట్, ఫొటోల ఆధారంగానే వార్తలు రాయాల్సిన పరిస్థితులు వున్నాయి.
సాధారణంగా ఎన్‌కౌంటర్ ప్రదేశాలు భయానకంగా, బీభత్సంగా ఉంటాయి. కానీ పోలీసులు విడుదల చేసే ఫొటోల్లో మాత్రం నక్సల్స్ శవాలు నల్లటి పాలిథీన్ కవర్లలో నీట్‌గా ప్యాక్ చేసి, ఆయుధాలు ఒక ఆర్డర్‌లో అందంగా అమర్చబడి ఎగ్జిబిషన్‌ను తలపిస్తూ ఉంటాయి. అనుకోవడానికి బాధాకరంగా ఉన్నా, అదే నిజం… మరో మార్గం లేదు కాబట్టి, పత్రికలు వాటిని అనివార్యంగా ప్రచురిస్తున్నాయి. తెలుగు మీడియానే కాదు, ఛత్తీస్ గఢ్, జాతీయ మీడియాదీ ఇదే పరిస్థితి.
దండకారణ్యంలో సాయుధపోరుకు నాయకత్వం వహిస్తున్నది తెలుగు విప్లవకారులే కాబట్టి, న్యూస్ వేల్యూ ప్రాధాన్యత దృష్ట్యా తెలుగు మీడియా ఎన్‌కౌంటర్లపై ఫోకస్ చేస్తున్నది. లేకుంటే ఆ మాత్రం కూడా బయటి ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు.
ఎన్‌కౌంటర్ ఎక్కడి జరిగింది.. ఆ సంఘటన స్థలాన్ని చూపించమని పోలీసు అధికారులను ఎవరైనా మీడియా ప్రతినిధి అడిగితే… ‘ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది… అడవి దారుల్లో ఎక్కడిపడితే అక్కడ నక్సల్స్ పేలుడు పదార్థాలు పాతిపెట్టి ఉంచారు.. కాల్పులు ఎటునుంచి మొదలవుతాయో చెప్పలేం.. ఎప్పుడు ఏ ప్రమాదమైనా ముంచుకురావొచ్చు.. అయినా వెళ్లాలని మీకుంటే అది మీ రిస్కు. మేం భద్రత కల్పించలేం..’ అని ఎంతో బాధ్యతాయుతంగా జవాబిస్తున్నారు.
వారు ఎంతో శ్రద్ధతో, బాధ్యతతో అంత వినమ్రంగా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఏ మీడియా ప్రతినిధి అయినా అడవి వంక తొంగిచూడగలడా? ఇంకా ఎక్కువ అడిగితే ‘లెక్కలు అడగొద్దు.. చెప్పింది రాసుకో..’ అన్నట్టుగా హుంకరిస్తున్నారు. మరీ అత్యుత్సాహంతో ఒకరో ఇద్దరో పరిశోధనకు దిగితే గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. ఈ రిస్కు పడలేక… మీడియా ప్రతినిధులు మూసుక్కూర్చుంటున్నారు.
గత రెండేళ్లుగా దండకారణ్యంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లకు సంబంధించి వచ్చిన వార్తాకథనాలు… రిపోర్టర్లు ఊహాశక్తితో అల్లినవే గానీ, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన నిజానిజాల ఆధారంగా రాసినవి కాదు. ఒకవేళ గ్రౌండ్ రిపోర్టింగ్‌కు అవకాశమే ఉంటే ‘ఆపరేషన్ కగార్’ ఎంత కిరాతకమైనదో వెలుగులోకి వచ్చేది.
అది గాజా పైన ఇజ్రాయిల్ ఐడీఎఫ్ బలగాలు చేస్తున్న నరహంతక దాడుల కన్నా ఎక్కువని అర్థమయ్యేది. ఆదివాసీలను ఆదివాసీలపైకే ఉసిగొల్పుతున్న వికృత క్రీడ అని అనుభవంలోకి వచ్చేది. అడవుల్లోని అపార వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు వేస్తున్న రాచమార్గాలని అవగతం అయ్యేది.
ఇప్పుడు ఎన్‌కౌంటర్లకు సంబంధించి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ మాత్రమే జరుగుతోంది గానీ, ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ జరగడం లేదు. కనీసం మృతుల కుటుంబాలను పలకరించే పరిస్థితులూ ఉండటం లేదు.
మృతులందరూ అమాయక ఆదివాసీలే కావడంతో వారికి చట్టాలు, హక్కుల పట్ల అవగాహన లేక, మీడియా అవేర్‌నెస్ లేక దుఃఖాన్ని దిగమింగుకొని అశక్తులుగా మిగిలిపోతున్నారు. దంకారణ్యంలో ఇప్పుడు జరుగుతున్న నరమేధం, మానవహక్కుల హననమే కాదు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా అణచివేత కూడా…
Share this Article