Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడంటే స్మగ్లర్లు, దొంగలు సినిమాల్లో హీరోలు… కానీ ఆనాడు ఈ ఈనాడు..?!

April 2, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…….. మరో అల్లూరి సీతారామరాజు 1982 డిసెంబర్లో 1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన ఈ ఈనాడు సినిమా . ఓ ప్రభంజనం . ఓ సునామీ . అదే సంవత్సరంలో రిలీజయిన యన్టీఆర్ నటించిన నా దేశం సినిమాకన్నా కూడా ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసిన సినిమా .

ప్రజాస్వామ్య రక్షణ , పార్టీ ఫిరాయింపులు , అవినీతి , కల్తీ సారా మరణాలు , బలిసినోళ్ళ పిల్లలు చేసే అకృత్యాలు అఘాయిత్యాలు , పేదవాళ్ళల్లో కూడా నరనరాల్లో జీర్ణించుకుపోయిన కుల వివక్ష , వ్యత్యాసాలు , గజ్జి వంటి ఎన్నో రాజకీయ , సామాజిక , సమకాలీన , సున్నితమైన అంశాల చుట్టూ అల్లిన కొరడా కధ.

Ads

సినిమాలో ప్రతి సీను ప్రేక్షకుడి చేత చప్పట్లు కొట్టిస్తుంది . ఈ సినిమా అఖండ విజయానికి ప్రధాన కారణం కృష్ణ విజృంభణ , పరుచూరి బ్రదర్స్ తూటాల్లాంటి మాటలు . ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ . విజయవాడ అలంకార్ థియేటర్ సెంటర్లో షూట్ చేయబడిన క్లైమాక్స్ సీన్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్సే గుర్తుకు వస్తుంది .

పార్టీ ఫిరాయింపుల మీద ఇంత తీవ్రమైన దండయాత్ర చేసిన సినిమా మరొకటి లేదు . బహుశా 1982 డిసెంబర్లో ఈ సినిమా ఇచ్చిన స్పూర్తే 1994 ఆగస్టులో యన్టీఆర్ని బర్తరఫ్ చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు చేసిన తిరుగుబాటు . 1984 లో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చాడు . అయినా దొడ్డి దారిన ఫిరాయింపులు , చట్టానికి తూట్లు జరుగుతూనే ఉన్నాయి . అదంతా మరో కధ . మళ్ళా సినిమాకు వద్దాం .

1982 లోనే మళయాళంలో వచ్చిన ఈనాడు సినిమా మన తెలుగు ఈనాడుకి మాతృక . కృష్ణ ఇమేజికి అనుకూలంగా మార్పులు , చేర్పులు , కూర్పులు చేసి ఇంకా పదును పెట్టారు . ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా కధను తయారుచేసారు . కృష్ణకు హీరోయిన్ , డ్యూయెట్ లేకుండా వచ్చిన సినిమా . ఆ సినిమా స్పీడులో ఏవీ కనిపించవు .

ఛంద్రమోహన్ , రాధిక జోడీ చాలా రొమాంటిక్ గా ఉంటుంది . సమాజ ద్రోహులుగా రావు గోపాలరావు , జగ్గయ్య , కాంతారావు , వారి చెంచాలుగా త్యాగరాజు , గిరిబాబు , గోకిన రామారావుల పాత్రలను పరుచూరి బ్రదర్స్ చాలా బాగా తీర్చిదిద్దారు .

ఈ సినిమాలో రెండు గొప్ప స్త్రీ పాత్రలు ఉంటాయి . ఒకటి హీరో అక్క పాత్ర . కృష్ణకుమారి ఎంత బాగా నటించిందంటే ప్రేక్షకుడి కళ్ళు చెమర్చుతాయి ఆ అక్క ప్రేమను చూసి . మరో పాత్ర జమునది . మరిది ఆగడాలు తెలిసినా రక్షించే తల్లి లాంటి వదిన పాత్ర . భర్త చేసే దురాగతాలను భరించలేక చివరకు పోలీసులకు భర్తకు వ్యతిరేకంగానే నిజం చెప్పే పాత్ర . ఇతర పాత్రల్లో గుమ్మడి , పేకేటి , సుధాకర్ , రాజా , పి యల్ నారాయణ , శ్యామలగౌరి , ఝాన్సీ , పుష్పకుమారి ప్రభృతులు నటించారు .

జె వి ,రాఘవులు సంగీత దర్శకత్వంలో రెండు పాటలు జనాన్ని ఊపేస్తాయి . టైటిల్స్ తోనే వస్తుంది రండి కదలి రండి శ్రీశ్రీ పాట . ఆ పాట ఎర్ర జండాలతో ఎరుపెక్కి పోతుంది . అలాంటిదే మరో పాట నేడే ఈనాడే ప్రజా యుధ్ధ సంరంభం . ఇదీ శ్రీశ్రీదే . ఎంత ఇంపాక్ట్ అంటే ప్రేక్షకుడు తాను కూడా ఆ ప్రభంజనంలో ఉన్నాను అని భావిస్తాడు . 3D effect .

కొసరాజు వ్రాసిన వినరో ఓ వీర పుత్రుడా బుర్రకధ అద్భుతంగా చిత్రీకరించబడింది . మన తెలుగు వారిని విపరీతంగా ప్రభావితం చేసేది బుర్రకధ . అల్లూరిదయినా , అభిమన్యుడిదయినా , పలనాటి బాలచంద్రుడిదయినా బుర్రకధ తెలుగు వాళ్ళకు బాగా ఇష్టమైన కళా ప్రక్రియ . ఈ బుర్రకధలో కృష్ణ , చంద్రమోహన్ , రాధికలు అంత ఇంపాక్టుఫుల్ గా నటించారు .

మళయాళం , తెలుగు భాషల్లోనే కాకుండా హిందీలో యే దేశ్ , తమిళంలో ఇదు ఎంగనాడు టైటిల్సుతో తీసారు . మన ఈనాడు 30 లక్షలతో తీస్తే రెండు కోట్ల కలెక్షన్ వచ్చిందట . 42 సెంటర్లలో రిలీజ్ చేస్తే 29 సెంటర్లలో యాభై రోజులు ఆడింది . మా నరసరావుపేటలో సంధ్యా పేరడైజులో 50 రోజులు ఆడింది . 15 సెంటర్లలో వంద రోజులు ఆడింది . మా గుంటూరులో పల్లవి డీలక్సులో 100 రోజులు ఆడింది . ఒకటి రెండు సెంటర్లలో సిల్వర్ జూబిలీ కూడా .

ఈ సినిమా ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రిపబ్లిక్ డే నాడు ఏదో ఒక చానల్లో రావాల్సిందే .  యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . ముప్పై నలభై ఏళ్ళ కింద ఎంత సామాజిక , రాజకీయ స్పూర్తి కల సినిమాలు వచ్చేవో , ఇప్పుడు ఎలాంటి ఉప్పూ కారం లేని నిద్ర సినిమాలు వస్తున్నాయో అర్థం అవుతుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions