.
డిజిటల్ యాడ్స్ కు నో వ్యూస్… ప్రకటనలకు ఇదివరకు పరిమితమైన వేదికలు. పత్రికలు, గోడ రాతలు, హోర్డింగ్స్, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, రేడియో, టీ వీలు మాత్రమే ఉండేవి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇవి కూడా లేక యూరియా కంపెనీలవారు మెటడోర్ వాహనంలో రాత్రిళ్ళు ఊరిమధ్యలో ప్రొజెక్టర్, స్క్రీన్ పెట్టి కాసేపు ఏదో ఒక సినిమా వేసి…తరువాత తమ యూరియా ప్రకటనల చిత్రాలను ప్రదర్శించేవారు.
Ads
ఇప్పుడు సామాజిక మాధ్యమాల విజృంభణ, సాంకేతిక ఆవిష్కరణలతో ప్రకటనలకు వేదికలు మారిపోయాయి. కానీ ప్రకటన స్వరూప, స్వభావాలు మారలేదు. దాంతో థియేటర్ కోసమో, రేడియో కోసమో తయారుచేసిన ప్రకటననే సోషల్ మీడియాలో కూడా ప్లే చేస్తూ వేల కోట్లు వృథాచేసుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసేవారిలో 93 శాతం మంది సెల్ ఫోన్లోనే వీడియోలు చూస్తున్నారని ఒక సర్వేలో తేలింది. అంటే మూడంగుళాల అడ్డం, అయిదంగుళాల నిలువు ఉన్న సెల్ ఫోన్లో చూసేప్పుడు ఆ వీడియో అడ్డం, నిలువు కొలతలు ఎలా ఉంటాయో అన్నదాన్నిబట్టి యాడ్ షూట్ చేసేప్పుడు ఆ ఫార్మాట్లోనే చేయాలి. లేకపోతే అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా సాగదీసినట్లు వీడియో క్వాలిటీ పోతుంది. అక్షరాలు ఇతర సమాచారం కుడిఎడమల కట్ అయి అతుకులబొంతలా కనిపిస్తుంది.
అందుకే పేరున్న లేదా సాంకేతికంగా బాగా అవగాహన ఉన్న యాడ్ ఏజెన్సీలు ఒకేసారి అన్ని ఫార్మట్లలో షూట్ చేసి… ఏ వేదికకకు తగినట్లు ఆ కొలతల్లోనే యాడ్స్ ను విడుదల చేస్తాయి. ఇంతకంటే లోతుగా వెళితే ఇది యాడ్ మేకింగ్ సాంకేతిక పాఠమవుతుంది కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం.
ఇంత గొప్పగా వండి వారుస్తున్న ప్రకటనలను డిజిటల్ వేదికలమీద ప్లే చేయడానికి భారతీయ కంపెనీలు ఏటా చేస్తున్న ఖర్చు దాదాపు పాతిక వేల కోట్లు. థియేటర్లో ప్రకటన వచ్చినా ప్రేక్షకుడు అక్కడే ఉంటారు. అదే టీవీలో ప్రకటన రాగానే ఛానెల్ మారుస్తారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ లాంటివాటిల్లో యాడ్ రాగానే స్కిప్ చేస్తారు.
అందుకే స్కిప్ చేయడానికి వీల్లేని మొదటి నాలుగయిదు సెకెన్లలోనే ప్రకటన సారాంశం చెప్పేయాలన్నది ఇప్పుడు యాడ్ తయారుచేసేవారి ముందున్న పెనుసవాలు అయి కూర్చుంది. నిజానికి ఆధునిక డిజిటల్ యుగంలో ఇరవై సెకెన్ల యాడ్ చాలా పెద్దది. అయిదు సెకన్ల యాడ్ కొంచెం చిన్నది. సెకెను, అర సెకెనులో కూడా యాడ్స్ రావచ్చు.
ఈ యాడ్ డైనమిక్స్ మీద ప్రఖ్యాత యాడ్ ఏజెన్సీ ఆర్కె స్వామి- ఇండియన్ మార్కెట్స్ స్టడీ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
# సోషల్ మీడియాలో ప్రకటనలు వెల్లువెత్తుతున్నా… బ్రాండ్ రీ కాల్ (ఒక బ్రాండ్ ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం) చాలా తక్కువగా ఉంది.
# 600 ప్రముఖ బ్రాండ్లను సర్వేలో ప్రస్తావిస్తే వేలమంది ఆరేడు బ్రాండ్లకు మించి గుర్తు చేసుకోలేకపోయారు. అంటే బ్రాండ్ రీ కాల్ ఒకటినుండి ఒకటిన్నర శాతానికి మించి లేదు.
# దాదాపు 80 శాతం మంది ప్రకటన రాగానే స్కిప్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రోగ్రాం కోసం క్లిక్ చేస్తే ప్రకటన రావడం ఏమిటి? అని విసుక్కుంటున్నవారే అధికం.
# యాడ్స్ లో అతిశయోక్తులు, అసంబద్ద విషయాలు ఎక్కువగా ఉంటున్నాయని 60 శాతం మంది ఉదాహరణలతో వివరించారు.
# మరీ తప్పనిసరై స్కిప్ చేయడానిక్కూడా వీలుకాకపోతే సౌండ్ మ్యూట్ చేస్తున్నామని 50 శాతం మంది చెప్పారు.
# ఈ సర్వేకు ప్రాతిపదికగా తీసుకున్న మూడు వేల మంది రోజుకు సగటున రెండున్నర గంటలపాటు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నారు.
# వాట్సాప్ లో వచ్చే వీడియోల్లో దాదాపు నాలుగిట్లో ఒకటి నచ్చి ఫార్వర్డ్ చేస్తున్నారు.
యాడ్ మేకింగ్, డిస్ ప్లే వేదికలు, స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సర్వే తేల్చిందేమిటంటే ఏటా దాదాపు పాతికవేల కోట్లు డిజిటల్ యాడ్స్ డిస్ ప్లే కోసం ఖర్చు పెడితే అందులో ఇరవై వేల కోట్ల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు- అని….. ఒక కథ, ఒక కథనం, ఒక భావోద్వేగం, ఒక రాగం, ఒక మైమరపుల మేళవింపులతో యాడ్స్ తయారు చేసే పీయూష్ పాండేల అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది….
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
పీయూష్ పాండే ఎవరో గుర్తుంది కదా... ఇదీ లింక్...
Share this Article