.
దసరా… తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ… అల్లుళ్లు, బిడ్డలు… మనమళ్లు, మనమరాళ్లు… కొత్త బట్టలు, పిండి వంటలు, సంబురాలు… అంతేకాదు, కక్కా ముక్కా… అంటే ముక్కా, సుక్కా… అంటే మద్యం, మాంసం…
ఎంత లేనివాడైనా దసరాను తన స్థాయిలోనైనా తను ఉత్సాహంతో, సంబరంతో గడుపుకోవాలని అనుకుంటాడు… ఓ నైన్టీ లేదా కాస్త కల్లు… ఓ నాలుగు మటన్ ముక్కలు… వాడికి మళ్లీ దసరా దాకా జీవనోత్సాహాన్ని ఇస్తుంది అది…
Ads
జమ్మి పెట్టడానికి, ఆలింగనాలకు, ఆశీస్సుల దండాలకు ఇళ్లకు వచ్చే బంధువులు, మిత్రులు, పరిచయస్తులకు ఓ ముక్క, ఓ పెగ్గు ఆఫర్ చేయడం తెలంగాణలో చాలా కులాల్లో సర్వసాధారణం… అది లేకపోతే అసలు పండుగే లేదు… అదొక కల్చర్…
కానీ ఈ దసరాకు ఆ జోష్ కరువయ్యే ప్రమాదం ఉంది... కారణం, ఎక్సయిజు శాఖ పిచ్చి నిర్ణయాలు...
ఆరోజు గాంధీ జయంతి… అక్టోబరు రెండు వస్తోంది దసరా… అంతే, మాంసం దొరకదు, మద్యం దొరకదు… బంద్… మద్యం, మాంసం లేనిదే దసరా జోష్ ఎక్కడిది..? ఐనా గాంధీ జయంతికీ మద్యం బంద్‌కు, మాంసం బంద్‌కు లింకేమిటి అసలు..?
- ఎవరో స్టార్ట్ చేస్తారు, ఇక ఓ ఆనవాయితీగా ఈ అబ్కారీ శాఖ గుడ్డిగా అమలుపరుస్తూ ఉంటుంది… ఇదే కాదు… బోనాలు జరిగితే డ్రై డే… అరె, బోనాలు, గ్రామదేవతల పూజలు అంటేనే మద్యం, మాంసం… అదే లేకుండా చేశాక ఇక బోనాల ఉత్సవం ఏముంటుంది..?
అసలు బోనాల పండక్కీ డ్రై డేకూ లింకేమిటి..? మందు తాగేసి, వీథుల్లో వీరంగం వేస్తూ, అల్లర్లు చేస్తారా హిందూ భక్తులు..? అదేనా ఈ పిచ్చి నిర్ణయం వెనుక మర్మం..? హనుమాన్ శోభాయాత్రకు కూడా అంతే…
ఆమధ్య సలావుద్దీన్ ఒవైసీ భలే అడిగాడు… స్వాతంత్ర్య దినానికీ మాంసం కొట్లు బంద్ చేయటానికీ సంబంధం ఏమిటీ అని..! నిజమే కదా… ఏమైనా లింక్ ఉందా..? మూడు నేషనల్ హాలీడేస్‌లూ అంతే… అసలు డ్రై డేలపై ఎప్పుడైనా ప్రభుత్వం సమీక్ష ఉంటుందా..? అన్నీ అధికారుల స్థాయిలోనే అనాలోచిత నిర్ణయాలు జరిగిపోతుంటాయి…
ఒకవైపు బార్లు పెరుగుతుంటయ్, వైన్స్ పెరుగుతుంటయ్, తెలంగాణలో దాదాపు 97 శాతం జనాభా నాన్ వెజిటేరియన్సే… ఇంకా మైక్రో బ్రూవరీల పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు… ఇదుగో మరోవైపు ఈ అనాలోచిత డ్రై డేస్… మటన్ బందులు… అసలు గాంధీకి మటన్ బందుకు సంబంధం ఏమిటి..? హేమిటో ఇదంతా…
కొన్నిసార్లు మామూలు వైన్స్, బార్లు బంద్ అట… కానీ క్లబ్బులు, స్టార్ హోటళ్లలో మాత్రం పర్మిటెడ్… అదేం తలతిక్క విధానమో మరి… నిజంగా అల్లర్లకు పాల్పడే వాళ్లే ఉంటే, ముందురోజే ఫుల్లు మద్యం బాటిళ్లు తెచ్చుకుని, ఇంట్లో పెట్టుకుని, మరుసటి రోజు తాగలేరా..? ఊగలేరా..?
ఎన్నికలు జరుగుతుంటే… కౌంటింగ్ జరుగుతుంటే… పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో వైన్స్, బార్లు బంద్ పెట్టడంలో ఎంతోకొంత అర్థముంది… పొలిటికల్ టెన్షన్లు క్రియేట్ అవుతాయి గనుక… ఐనా అదీ దండుగే… ప్రచారం జరిగినన్ని రోజులూ మద్యం పారించిన నేతలు కౌంటింగ్, పోలింగు రోజుల్లో మద్యం పోయించలేరా కార్యకర్తలకు..? వోటర్లకు..?
- చివరకు ఎమ్మెల్సీ ఎన్నికలకూ అంతే… గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూడా మందు కొట్టి వీథుల్లో అల్లర్లు చేస్తారా..? ఆమధ్య ఏకంగా మూడు రోజులు బంద్ పెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు…
ఇదేమీ మద్యపానాన్ని, మాంసాహారాన్ని ప్రమోట్ చేసే కథనం కాదు… ప్రభుత్వ నిర్ణయాల్లో విజ్ఞత, తెలివిడి ఉండాలనీ, అది లోపించిందనీ, ఇవి పక్కా దిక్కుమాలిన నిర్ణయాలని చెప్పడానికి ఇది..!! నైన్టీ వేయడం, ఓ ముక్క కొరకడం తెలంగాణలో నేరం కాదు, తప్పు కాదు… ఆ తెలివిడి, ఆ అవగాహన అధికారగణంలో లేదు అని చెప్పడానికి ఇది..!!
Share this Article