నవతరం దర్శకుడు వేణు ఊడుగుల అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను… సినిమా కథను ‘పెట్టుబడి- రాబడి సమీకరణం’ మాత్రమే నిర్దేశిస్తోంది… మార్కెటబుల్ కంటెంటే ఇక్కడ ప్రధానం… ఇతర భాషలతో పోలిస్తే సినిమాలకు అడాప్టబుల్‌గా ఉండే సాహిత్యం తక్కువ… ఆ కొరత ఉంది… ఒక నవలను సినిమాగా మల్చడం కూడా క్రియేటివ్ అంశమే… విస్తృతి, లోతైన తాత్వికత, భావోద్వేగాలతో ప్రజలు కనెక్టయ్యే కంటెంట్ కావాలి… అప్పుడే మన సినిమాలోనూ వైవిధ్యం కనిపిస్తుంది…
ఇదీ స్థూలంగా తను ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసం చెప్పుకొచ్చింది… నిజమే, ఈ అంశం మీద తెలుగు సాహిత్య, సినిమా సర్కిళ్లలో ఇంకా డిబేట్ జరగాల్సిన అంశం ఇది… ఇటీవల మనం ది గోట్ స్టోరీ (ఆడు జీవితం), అసురన్, పొన్నియన్ సెల్వన్, జల్లి కట్టు సినిమాలు చూశాం కదా… అలాంటి కథాంశాలు మనకున్నాయా అనేది ప్రశ్న… సున్నితమైన మానవ సంబంధాలే కాదు, సామాజిక సమీకరణాలు, సోషల్ రియాలిటీస్ కథాంశాలు కావడం ఒకెత్తు, వాటిని తెరపైకి మల్చడం మరో ఎత్తు…
మనకేమో లిటరరీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన సినిమా రచయితలు తక్కువ… 70, 80 దశకాల్లో చాలా నవలల్ని ఎఫెక్టివ్‌గా సినిమాకరించారు మనవాళ్లు… జనానికి చేరువయ్యాయి కూడా… కానీ తరువాత పాపులర్ సాహిత్యం, పాపులర్ సినిమా కథ మాత్రమే కనిపిస్తోంది… దీనికి మరో కారణం మితిమీరిన హీరోయిజం… భిన్నమైన కథలకు వోకే చెప్పే స్టార్ హీరోలు ఎవరు..? హిట్ ఫార్ములా పేరిట అడ్డదిడ్డమైన కథలు, వాటికి తగినట్టు చిత్రీకరణ… మార్కెట్ అంచనాలు… మొత్తం ఇదే తంతు…
Ads
ఎన్ని పాటలుండాలి, ఏయే స్టెప్పులు పడాలి, నటీనటులు ఎవరు, ఎక్కడెక్కడ ఫైట్లుండాలి, తలతిక్క కామెడీ ట్రాక్, బూతు పంచులు… మొత్తం ఇదే ప్రణాళిక… మరీ 1990-2000 నుంచి ఇదే రొడ్డకొట్టుడు ధోరణి… నిజమే, సినిమా అనేది ఓ పెద్ద దందా… డబ్బు సమీకరణాలు కూడా ముఖ్యమే… జనం కూడా ఇలాంటి సినిమాలు చూసీ చూసీ దానికే అడిక్టయ్యారు తప్ప, ఇప్పుడు ఓ భిన్న కంటెంట్ ప్రజెంట్ చేస్తే చూసేవాళ్లు ఎందరు..? బలమైన సీన్లతో ప్రజెంట్ చేయగలిగితే తప్ప..! జనం టేస్ట్ మారింది కూడా…
ఐతే ఇది స్ట్రీమింగ్ యుగం… తక్కువ ఖర్చుతో, ఎక్కువ నిడివితో… ఏదైనా భిన్న కథాంశాన్ని ప్రజెంట్ చేయగల అవకాశం వచ్చింది… థియేటర్లో రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం… పైగా దానికి మనీ ఈక్వేషన్స్ ఉంటాయి… వెబ్ సీరీస్‌లలో మంచి ప్రయోగాలు చేయొచ్చు… అదీ ఎఫెక్టివ్‌గా చేయగలిగితేనే సుమా…
ఒకప్పుడు నిజంగానే డెప్త్ ఉన్న స్టోరీస్ వచ్చేవి… తరువాత యండమూరి, మల్లాది, యర్రంశెట్టి, మాదిరెడ్డి, యద్దనపూడి తదితర రచయితలందరూ పాపులర్ సాహిత్యం మీదే దృష్టి పెట్టారు… ఉదాహరణగా యండమూరినే తీసుకుంటే అభిలాష, రాక్షసుడు, ఛాలెంజ్ వంటివే తప్ప వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ, ప్రార్థన, పర్ణశాలల్ని సినిమాకరించలేకపోయారు నిర్మాతలు… వాటికి తగిన స్క్రీన్ ప్లే రాయడమే ఓ ఛాలెంజ్… ఆయన కూడా సినిమాలకు మాత్రమే పనికొచ్చే ఎంటర్‌టెయిన్మెంట్ నవలల మీదే దృష్టి పెట్టాడు తరువాత కాలంలో… అంతెందుకు తులసిదళం, తులసి ఈకాలం ట్రెండ్‌కు బాగా సూటవుతాయి… ప్చ్, ఎవరున్నారు తీసేవాళ్లు..?
కథా వైవిధ్యం ఈ కమర్షియల్ శకంతో వెండితెర మీద చూడటం కష్టమే… కల్కి, కేజీఎఫ్, సాలార్, ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి హైఫై, పాపులర్ సూపర్ హీరోయిజం తాలూకు ఆర్టిఫిషియల్ వంటకాల కథలే ఇప్పటి ట్రెండ్… కాస్త పురాణాల ఫ్లేవర్ తగిలించి ఫాంటసీని నెత్తికెక్కించుకుంటే అదే పాపులర్ ట్రెండ్..! కథల దాకా ఎందుకు..? పాటల సాహిత్యం కూడా కుర్చీ మడత బెట్టి తనకు తానే కొట్టుకుంటోంది… ఒక్కో సినిమా వేల కోట్ల వసూళ్లకు వెళ్తున్న ఈ తరుణంలో ప్రయోగాలు, వైవిధ్యాలు, ఉద్వేగాలు, మానవబంధాలు గట్రా ఎవరికి పట్టాయి గనుక..!!
దిక్కుమాలిన ప్రశ్నలు, వసూళ్ల కీర్తనలు, హీరోల భజనలు, ట్రెయిలర్ల సమీక్షలతో మురికి కంపు కొడుతున్న సినీమీడియా నుంచి ఇలాంటి అర్థవంతమైన చర్చలు, వ్యాసాలు, సమీక్షలు ఆశించడం కూడా అత్యాశే… అవును, జర్నలిజం కూడా ఇప్పుడు ఓ దందాయే కదా… భిన్నంగా ఎందుకు ఉంటుంది..? అందుకే వేణు ఊడుగుల వంటి నవతరం దర్శకులైనా అర్థవంతమైన ఇలాంటి చర్చలకు పూనుకోవడాన్ని అభినందిస్తున్నాను…
Share this Article